logo
వ్యవసాయం

బత్తాయి సాగు వైపు నల్గొండ రైతుల చూపు

Orange Farming Benefits in Nalgonda District
X

బత్తాయి సాగు వైపు నల్గొండ రైతుల చూపు

Highlights

Orange Farming: యాసంగిలో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది.

Orange Farming: యాసంగిలో వరి సాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది. దీంతో వరికి బదులు రైతన్నలు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా దీర్ఘకాలిక దిగుబడిని అందించే పండ్ల తోటలు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో బత్తాయి సాగులో దేశంలోనే నల్గొండ జిల్లా ఆగ్రస్థానంలో ఉండేది. అయితే వేరుకుళ్లు తెగులు ఉధృతి పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో సాగునీటి వనరులు కూడా పెరగడంతో రైతులు బత్తాయి తోటలను తొలగించి గత ఐదారేళ్లుగా వరి సాగు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి లో వరి సాగు చేయవద్దని చెబుతుండటంతో రైతులు మళ్ళీ బత్తాయి తోటల సాగు ఫైన దృష్టి సారించారు. అందులోనూ ఈ మధ్య టన్ను బత్తాయి ధర 80 వేల నుంచి లక్ష రూపాయలు పలుకుతుండటంతో రైతులు ఇదే అదునుగా భావిస్తున్నారు.

ఆసియా ఖండంలోనే అత్యధికంగా బత్తాయి పండుతున్న ప్రాంతంగా నల్గొండ జిల్లాకు పేరుంది. జిల్లాలో గతంలో లక్షకుపైగా ఎకరాల్లో బత్తాయి తోటలు విస్తరించి ఉండేవి. కానీ నేడు చాలా వరకు తోటలు అంతరించిపోయాయి. ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటడం, నీరు లేక చెట్లు ఎండుముఖం పట్టడం, వేరుకుళ్లు వంటి తెగుళ్లు వేధించడంతో బత్తాయి సాగుకు రైతులు నెమ్మదిగా దూరమయ్యారు. గత కొంత కాలంగా నీటి లభ్యత పెరగడంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు. అయితే ఇటీవలె రబీలో వరి సాగు వద్దంటూ ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, మార్కెట్‌లో ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో వరి పండించే రైతులు బత్తాయి సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం 46 వేల ఎకరాల్లో మాత్రమే బత్తాయి సాగులో ఉంది. జనవరి నుంచి మార్చి లోపు సుమారు 14 వేల ఎకరాలలో బత్తాయి మొక్కలు నాటేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కటోల్ గోల్డ్, మాల్టా వంటి వంటి కొత్త బత్తాయి రకాలను సాగుకు ఎన్నుకుంటున్నారు రైతులు. రంగాపూర్ రకం కంటే మిగతా వెరైటీలు రెండు టన్నుల అధిక దిగుబడిని ఇవ్వడంతో పాటు జ్యుస్ లభ్యత ఎక్కువగా ఉండటం, కాయలో గింజలు తక్కువగా వుండటము తో మార్కెట్ లో డిమాండ్ ఉంటుందని రైతులు భావిస్తున్నారు. ఢిల్లీ మార్కెట్ లో ఈ వెరైటీలకు మంచి డిమాండ్ ఉందని రైతులు చెబుతున్నారు.

బత్తాయి సాగు , మెలకువలు, సస్యరక్షణ చర్యలు పూర్తిగా జిల్లా రైతులకు తెలుసు. దీంతో కొత్త వెరైటీ సాగు సులభంగా ఉంటుందని బావిస్తున్నారు. మామిడి, అరటి, జామ, ఉసిరి వంటి ఇతర పంటలను నూతనంగా సాగు చేపట్టాలనుకున్నా వాటి గురించి రైతులకు అవగాహన లేకపోవడంతో బత్తాయివైపే మొగ్గు చూపుతున్నారు. కొండమల్లేపల్లిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెట్ట పరిశోధన కేంద్రంలో నారు మొక్కలు అందుబాటులో లేకపోవడంతో ప్రవేటు నర్సరీలను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది రైతులు రాజమండ్రి, తిరుపతి వర్సిటీల నుంచి నారు మొక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కో మొక్క ధర 70 నుంచి 100 వరకు ఉంటుందంటున్నారు రైతులు. బత్తాయి మొక్కలను ప్రైవేటు నర్సరీల్లో కొనుగోలు చేసి సాగు చేయడం తమకు కొంత భారంగా ఉందని ప్రభుత్వం సబ్సిడీ ద్వారా బత్తాయి మొక్కలను అందజేయాలని రైతులు కోరుతున్నారు.

టన్ను బత్తాయికి అత్యధికంగా 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ధర పలుకుతుండటంతో రైతులు మళ్లీ బత్తాయి సాగు వైపు మళ్లారంటున్నారు ఉద్యావనశాఖ అధికారులు. త్వరలో ఈ ధర మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. జిల్లాలోని వాతావరణం బత్తాయి సాగుకు అనుకూలంగా ఉండడంతో పాటు రైతులకు ఈ పంటపై మంచి అవగాహన ఉదని తెలిపారు. ప్రభుత్వం నుంచి రైతులకు రాయితీలతో పాటు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. రానున్న ఏడాదిలో గతంలో మాదిరిగానే జిల్లాలో లక్ష ఎకరాల పైనే బత్తాయి సాగు జరుగుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తంగా నల్గొండ జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా బత్తాయిని ముమ్మరంగా సాగుచేస్తున్నారు రైతులు. స్థానిక నేలలు సాగుకు అనుకూలంగా ఉండటంతో రానున్న కాలంలో బత్తాయి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశముంది.


Web TitleOrange Farming Benefits in Nalgonda District
Next Story