మార్కెట్‌లో ఆర్గానిక్ మ్యాంగోకు మంచి డిమాండ్‌

మార్కెట్‌లో ఆర్గానిక్ మ్యాంగోకు మంచి డిమాండ్‌
x
Highlights

అన్ని రంగాల్లో వస్తున్న మార్పులలాగే మనిషి మనుగడకు కీలకమైన వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు దర్శనమిస్తున్నాయి. అయితే ఇతర రంగాలతో పోల్చితే అంత మొత్తంలో...

అన్ని రంగాల్లో వస్తున్న మార్పులలాగే మనిషి మనుగడకు కీలకమైన వ్యవసాయ రంగంలోనూ అనేక మార్పులు దర్శనమిస్తున్నాయి. అయితే ఇతర రంగాలతో పోల్చితే అంత మొత్తంలో మార్పులు లేనప్పటికీ మెళ్లి మెళ్లిగా రైతుల ఆలోచనలు మారుతున్నాయి. ప్రయోగాల సాగుకు ప్రాధాన్యాతను ఇస్తున్నారు. దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతున్నారు అలాంటి వారిలో సింగారెడ్డి శౌరిరెడ్డి ఒకరు. ఒక ఎకరం విస్తీర్ణంలో 16 రకాల మామిడిని ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు ఈయన. మామిడిలోనూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. నూతన పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు.

వరంగల్ కి అతి సమీపంలో వున్న కుమ్మరి గూడెం ప్రాంతంలో గత 7 సంవత్సరాలుగా మామిడి సాగు చేస్తున్నారు సింగారెడ్డి శౌరిరెడ్డి. ఎకరం విస్తీర్ణంలో హైడెన్సిటీ పద్ధతులో 60 మొక్కలను నాటారు. అందులోనూ ఒకే రకం కాకుండా దాదాపు 16 రకాల మామిడి రకాలను పండిస్తున్నారు. ఈ రకాలన్నీ కూడా అంటు మొక్కలే. ఈ మామిడి తోట సాగులో పూర్తి ప్రకృతి విధానాలనే అనుసరిస్తున్నారు. ప్రకృతి విధానంలో మామిడి సాగు చేపట్టిన మొదటి సంవత్సరం నుంచే పూత బాగా వచ్చింది అయితే చెట్టు ఎదుగుదల దృష్ట్యా మూడు సంవత్సరాల వరకు పూతను తెంపుతూ వచ్చారు. ప్రస్తుతం నాణ్యమైన, రుచికరమైన పండ్ల ఉత్పత్తిని పొందుతున్నారు.

ప్రస్తుతం మామిడి సాగు జరుగుతున్న ప్రాంతం ఒకప్పుడు కరవు ప్రాంతం. ఇక్కడున్న బోర్లన్నీ ఎండిపోయిన పరిస్థితి. అయినా కూడా ప్రయోగాత్మకంగా పొలంలోనే ఫంపాండ్‌ను ఏర్పాటు చేసుకుని మామిడి సాగు మొదలు పెట్టారు. తక్కువ నీటితో అధిక దిగుబడిని సాధిస్తున్నారు.

సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్‌లో అధిక ధరలు పలుకుతాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే రైతులు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే వారు పండించే పంట పూర్తి ప్రకృతి సిద్ధంగా పండిందన్న నమ్మకాన్ని వినియోగదారుల్లో కల్పించడమే. ఆర్గానిక్ మాంగోకు మంచి డిమాండ్ ఉంది. రూపాయి ఎక్కువైనా సరే వీటిని కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసుకుని నూటికి నూరు శాతం ప్రకృతి విధానంలో మామిడి సాగు చేసినట్లైతే మార్కెట్‌ రేటుకంటే అధికంగా ధర పొందవచ్చంటున్నారు సింగారెడ్డి శౌరిరెడ్డి.

కొత్తగా మామిడి సాగు చేయాలనుకునే రైతులు ఏడాదంతా ఆదాయాన్ని ఇచ్చే రకాల సాగు మొదలు పెట్టాలంటున్నారు ఈయన. ఏడాదంతా దిగుబడిని ఇచ్చే మామిడి రకాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. అయితే మార్కెట్ డిమాండ్‌కు అనువైన రకాలను ఎన్నుకుని ఆదాయాన్ని రెట్టింపుచేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. మామిడి పంట చేతికి వచ్చే సమయంలో కొన్ని తెగుల్లు వస్తాయి. వాటిని నివారించేందుకు నీమాస్త్ర, బ్రహ్మాస్త్రం వినియోగిస్తున్నారు ఈయన. మామిడిలో వచ్చే ఎలాంటి సమస్యలకైనా ప్రకృతి ఎరువులను, కషాయాలనే వినియోగిస్తున్నారు.

మామిడి సాగులో మూడు రకాల పద్ధతులను అవలంభిస్తున్నారు సింగారెడ్డి శౌరిరెడ్డి. ఇప్పటి వరకు హైడెన్సిటీ విధానంలో చాలా మంది మామిడి సాగు చేసుంటారు కానీ ఈయన ప్రయోగాత్మకంగా సూపర్ డెన్సిటీ పద్ధతులను అవలంభిస్తున్నారు. 350 గజాలలో 230 చెట్లను నాటారు. ఇవన్నీ అంటు మొక్కలే తక్కువ స్థలంలో అధిక ధర పలికే రకాలను ఎన్నుకుని నాటారు. పందిర్ల కింద వీటిని పండిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories