మొక్కజొన్న రైతులకు తీరని కష్టాలు

మొక్కజొన్న రైతులకు తీరని కష్టాలు
x
Highlights

ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది మక్క రైతుల పరిస్ధితి. పండించిన పంటను అమ్ముకోలేక మక్క పంట సాగును వదులుకోలేక ఇందూరు రైతన్నలు మల్ల గుల్లాలు...

ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది మక్క రైతుల పరిస్ధితి. పండించిన పంటను అమ్ముకోలేక మక్క పంట సాగును వదులుకోలేక ఇందూరు రైతన్నలు మల్ల గుల్లాలు పడుతున్నారు. యాసంగీ సీజన్ లో మొక్క జొన్న సాగు చేయవద్దంటూ సర్కారు స్పష్టం చేయడంతో దిగాలు చెందుతున్నారు. పండించిన పంట అమ్మకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మద్దతు ధర పెంచినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో క్వింటాకు 500లకు పైగా నష్టపోతున్నారు మక్క రైతులు.

మొక్కజొన్న సాగుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ ప్రసిద్ది. పసుపు పంటలో అంతర్ పంటగా కొందరు, నేల స్వభావంతో మరికొందరు రైతులు పంట సాగు చేశారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా వానాకాలంలో మొక్క జొన్న సాగు చేయవద్దని ప్రభుత్వం సూచించింది. గత ఏడాదితో పోలిస్తే 24వేల ఎకరాల విస్తీర్ణం తగ్గించారు. 21 వేల ఎకరాలలో పంట సాగు చేశారు. వానలకు పంట కోసి రోడ్లపై ఆరబెడుతుంటే అకాల వర్షాలకు పంట తడిసి ముద్దవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మొక్కజొన్న క్వింటాలకు 1850 మద్దతు ధర ప్రకటించగా మార్కెట్ లో మాత్రం క్వింటాకు 1000 నుంచి 1200 లోపు ధర పలుకుతోంది. క్వింటాకు 500లకు పైగా రైతులు నష్టపోవాల్సిన పరిస్ధితి నెలకొంది. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ల పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వ్యాపారులు అందిన కాడికి దోచుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉంటే రైతుకు మద్దతు ధర వచ్చేదని సర్కారు తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్ల పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. యాసంగి పంట సాగు పై ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. వానాకాలంలో సాగు చేసిన పంటను ప్రభుత్వం తక్షణం కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత యాసంగి సీజన్ లో నిజామాబాద్ జిల్లాలో 5.50 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 5.10లక్షల మక్క పంటను సర్కారు కొనుగోలు చేసినట్లే వానాకాలం పంటను కొనాలని కోరుతున్నారు. మార్కెట్ లో డిమాండ్ లేదనే సాకుతో వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. మొక్కజొన్నకు ప్రత్యామ్నయ పంటలు వేయాలని సర్కారు చెబుతున్నా కొందరు రైతులు అదే పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత కోసి అమ్మకానికి సిద్దం చేసినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సర్కారు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా మక్క రైతుల కన్నీటి కష్టాలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories