చదువులతల్లి ఒడిలో చిట్టి చేతుల ప్రకృతి సేద్యం

చదువులతల్లి ఒడిలో చిట్టి చేతుల ప్రకృతి సేద్యం
x
Highlights

ఆటలు,చదువుల్లో పోటీలు ఇదే విద్యార్థుల ప్రపంచం. మన దేశ సంపద కూడా వీళ్ళే కానీ అలాంటి చిన్నారులు,విద్యార్థులకు రాను రానూ పౌష్టికాహారం కరువవుతున్న...

ఆటలు,చదువుల్లో పోటీలు ఇదే విద్యార్థుల ప్రపంచం. మన దేశ సంపద కూడా వీళ్ళే కానీ అలాంటి చిన్నారులు,విద్యార్థులకు రాను రానూ పౌష్టికాహారం కరువవుతున్న పరిస్థితి. మోతాదుకు మించి రసాయనాలతో పండుతున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల వంటి వాటి వల్ల ఆరోగ్యకరమైన జీవితానికి దూరమై కొత్త కొత్త అనారోగ్యలకు గురవుతున్నారు. అందుకు పరిష్కారంగా పాఠశాలలోనే స్వయంగా ప్రకృతి విధానంలో పంటలు పండిస్తున్నారు గుంటూరు జిల్లా అత్తోట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు. అటు చదువులోనూ, ఇటు సాగులోనూ అందరిని మెప్పిస్తూ నేలతల్లి మట్టిలో ఈ చిట్టి చేతులు చేస్తున్న ప్రకృతి సేద్యం పై ప్రత్యేక కథనం.

నేటి బాలలే రేపటి దేశ సంపద. వారి ఉజ్వల భవిష్యత్తే దేశ భవిష్యత్తు మరి అలాంటి రాబోయే తరానికి నాణ్యమైన విద్యతో పాటు, బలమైన పౌష్టిక ఆహారం అందించడం మనందరి భాద్యత. ఆ విధంగానే గుంటూరు జిల్లా, అత్తోట గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో అభ్యుదయ రైతు బాపారావు చొరవతో, కేవలం పాఠాలే కాకుండా విద్యార్థులే స్వయంగా ప్రకృతి పంటలను పండించే విధంగా బడి పంట కార్యక్రమాన్ని కలిసి కట్టుగా నిర్వహిస్తూ పిల్లల్లో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన కలిగిస్తున్నారు పాఠశాల యాజమాన్యం.

బడి పంట కార్యక్రమం ద్వారా పిల్లలో ప్రకృతి వ్యవసాయం పై అవగాహన పెరగడమే కాక, ఎలాంటి రసాయనాలు వాడకుండా పండించిన కూరగాయలు, ఆకుకూరలను తినడం వల్ల పిల్లలు ఆరోగ్యకరంగా ఎదుగుతారని రాబోయే కాలంలో ఎవరైనా విద్యను ఆపేసి సేద్యం వైపు వెళ్లేవారు, రసాయనాల జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయం చేయడానికి వీలుంటుంది అని అంటున్నారు అభ్యుదయ రైతు బాపారావు.

పర్యావరణ విద్యలో భాగంగా ప్రకృతి వ్యవసాయ విధానాలతో పంటలు పండిస్తూ పంట రక్షణకి స్వయంగా సహజ పద్దతిలో తయారుచేసిన వర్మీ కంపోస్ట్, జీవామృతాలను ఎరువులుగా ఉపయోగిస్తున్నారు. అదే క్రమంలో పుట్టినరోజున మొక్కలను నాటుతూ సంరక్షణతో పాటు, పచ్చదనం, పరిశుభ్రత వంటి నైతిక విలువలు పెంపొందించుకుంటున్నారని అంటున్నారు పాఠశాల ఉపాధ్యాయులు.

కేవలం చదువు, ఆటలే కాకుండా తమ ఆరోగ్యం కోసం తామే పంటలు పండించుకోడం చాలా ఆనందాన్నిస్తుందడంతో పాటు, రసాయనాల ఆహారం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతిని చదువులు ఆగిపోకుండా, ప్రకృతి విధానంలో జీవామృతాలను ఎరువులుగా వాడుతూ పాఠశాలలోనే పంటలు పండిస్తున్నామని అని సంబర పడుతున్నారు ఈ విద్యార్థులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories