Top
logo

Natural Farming: సుభాష్‌ పాలేకరే స్ఫూర్తి.. ఆహారపు అడవిని సృష్టి

Natural Farming Farmer Darlapudi Ravi Success Story
X

Natural Farming: సుభాష్‌ పాలేకరే స్ఫూర్తి.. ఆహారపు అడవిని సృష్టి

Highlights

Natural Farming: ఒకే పొలంలో విభిన్న పంటలు పండిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు.

Natural Farming: ఒకే పొలంలో విభిన్న పంటలు పండిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు. పూర్తి ప్రకృతి పద్ధతులను పాటిస్తూ పాలేకర్ సూచించిన ఐదు అంచెల విధానాన్ని ఆచరిస్తూ పొలానికి కొత్త వన్నెలను తీసుకువస్తున్నారు. ఓ వైపు 35 రకాల దేశీయ వరి వంగడాలను సాగు చేస్తూనే మరోవైపు మామిడిలో అంతర పంటలను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా, రేగిడి ఆమదాలవలస మండలం ఉంగరాడ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు దార్లపూడి రవి ప్రకృతి విధానంలో ఐదంచెల సేద్యం చేస్తూ సాగులో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వ్యవసాయంపై ఆయనకు ఉన్న మక్కువకు తోడు కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాలవలస శాస్త్రవేత్తలు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నారు. దేశీయ వరి వంగడాలతో పాటు మామిడిలో అంతర పంటలను దేశీయ గో వ్యర్ధాలతో తయారైన ఎరువులతో పండిస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

గత నాలుగేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు రవి. వివిధ ప్రాంతాలను సందర్శించి సేకరించిన సుమారు 35 రకాల దేశీయ వరి వంగడాలను తన వ్యవసాయక్షేత్రంలో పండిస్తున్నారు. అదే విధంగా మామిడిలో 20 రకాల అంతర పంటలను పండిస్తున్నారు. తన వ్యవసాయక్షేత్రంలో ఐందంచెల విధానంలో నిత్యం ఏదో ఒక రకమైన పంట చేతికి వచ్చే విధాంగా భూమిని సిద్ధం చేసుకున్నారు. భూమిలోపల పండేవి, భూమిపైన పండేవి, వృక్షాల ఆధారంగా తీగజాతి పంటలు, ఒక సంవత్సరంలో చేతికి అందే పంటలు రెండు , మూడు సంవత్సరాలకు వచ్చే పంటలు ఇలా ఐదు అంచెల విధానం సాగిస్తే సంవత్సరమంతా ఆదాయం వస్తుందంటున్నారు ఈ రైతు. ఏడాది కాలంలోనే వ్యవసాయ క్షేత్రాన్ని వనంలా తయారు చేయవచ్చని నిరూపిస్తున్నారు

అంతర పంటల్లో భాగంగా చిరుధాన్యాలు వేసుకున్నారు. ఎకరంన్నర విస్తీర్ణంలో రాగాలు ప్రధాన పంటగా కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు, సజ్జలు, జొన్నలు సాగు చేస్తున్నారు. వీటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి మార్కెట్‌లో విక్రయించడం వల్ల రైతుకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ఈ సాగుదారు.

ప్రకృతి సేద్యానికి అవసరమైన ఎరవు తయారీ కోసం రెండు ఒంగోలు ఆవులను పెంచుతున్నారు ఈ సాగుదారు. వీటి నుంచి వచ్చే పేడ, మూత్రం, పాలు, పెరుగుతో ఎరువులను తానే స్వయంగా తయారు చేసుకుని పంటలకు ప్రణాళికా ప్రకారం అందిస్తున్నారు. ఇక పంటపై దాడిచేసే చీడపీడల నివారణకు కషాయాలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు రవి. ఇందుకోసం అవసరమయ్యే చెట్లను గట్ల మీదే పెంచుతున్నారు. పంటకు అవసరమైన ఏ పదార్ధమైనా పంట నుంచే అందాలన్న విధానాన్ని అనుసరిస్తున్నారు ఈ సాగుదారు. అందుకే ఈ క్షేత్రం రైతులను, అధికారులను అమితంగా ఆకర్షిస్తోంది.

తన తోటను ఓ ప్రయోగశాలగా మార్చి ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిచయం చేస్తూ తోటి రైతులను చైతన్యపరుస్తున్నారు ఈ సాగుదారు. మిశ్రమ పంటల సేద్యంతో రైతుకు ఒనగూరే ప్రయోజనాలపైన అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగికి నెలకు ఒకసారే ఆదాయం వస్తుంది. ఐదంచెల విధనం అనుసరించి పంటలను సాగు చేసినట్లైతే రైతుకు ప్రతిరోజు ఆదాయం వస్తుందని అంటున్నారు రవి. అయితే మార్కెట్ సమస్యలను ప్రతి రైతు ఎదుర్కొంటున్నప్పటికీ ఒక వ్యక్తిగా కాకుండా సంఘంగా ఏర్పడి పంట ఉత్పత్తులను ప్రాసెస్ చేసి విక్రయిస్తే రైతు తప్పనిసరిగా ఆర్ధికాభివృద్ధిని సాధిస్తారంటున్నారు రవి. ఆ దిశగా రైతులు ప్రయత్నం చేయాలంటున్నారు.


Web TitleNatural Farming Farmer Darlapudi Ravi Success Story
Next Story