logo
వ్యవసాయం

Natural Farming: మెట్ట ప్రాంతంలో ప్రయోగాత్మక పంటలు

Natural Farming by Young Farmer Vijay Kumar
X

Natural Farming: మెట్ట ప్రాంతంలో ప్రయోగాత్మక పంటలు

Highlights

Natural Farming: రసాయనాల వినియోగం ఉండదు కృత్రిమ ఎరువుల ఊసే లేదు సేంద్రియ పద్దతిలో పాత...

Natural Farming: రసాయనాల వినియోగం ఉండదు కృత్రిమ ఎరువుల ఊసే లేదు సేంద్రియ పద్దతిలో పాత తరహా సాగు విధానాలను అనుసరిస్తూ పంటల సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నాడు ఈ యువరైతు. ప్రస్తుతం వరి సాగు చేస్తే ఉరేనంటూ సాగుతున్న ప్రచారానికి తెరలేపుతూ ఆడుతు పాడుతూ ఆనాటి పంటలను పండిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాడు అంతే కాదు ఈ యువరైతు స్ఫూర్తితో గ్రామంలోని పదుల సంఖ్యలో రైతులు సాగుబాట పట్టారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా యువరైతు.

మెట్ట సీమలో పాత తరం వరి వంగడాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి గ్రామానికి చెందిన గారపాటి విజయ్ కుమార్. డిగ్రి వరకు చదువుకున్న ఈ యువరైతు ఉపాధి అవకాశాల కోసం వెంపర్లాడకుండా నేలతల్లిని నమ్ముకుని పంటల సాగు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఏదో మొక్కుబడిగా పంటలు సాగు చేయడం కాకుండా అంతరించిపోయే దశకు చేరుకున్న పాత తరం వరి వంగడాలను పండించేందుకు పూనుకున్నాడు తనకు ఉన్న 11 ఎకరాల పొలంలో 9 రకాల వరి వంగడాలను గత ఐదేళ్లుగా సాగు చేస్తున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు.

ఏ మాత్రం రసాయనాలు కృత్రిమ ఎరువులను వినియోగించడం లేదు విజయ్ కుమార్. సేంద్రియ ఎరువులను కూడా అతి తక్కువ మోతాదులోనే పంటలకు వాడుతున్నారు. చీడపీడలను నియంత్రించేందుకు వినియోగించే రసాయనిక ఎరువుల వల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నట్టు అనేక పరిశోధనలు స్పష్టం చేస్తున్న నేపధ్యంలో తాను సాగు చేసే వరి వంగడాల వల్ల ఏలాంటి హానీ లేకపోగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయంటున్నాడు విజయ్ కుమార్. తక్కువ నీటి లభ్యతలో సైతం భూమిలో ఉన్న సారాన్ని బట్టి తాను సాగు చేసే పంటలు మంచి ధాన్యం దిగుబడిని అందిస్తున్నాయని అంటున్నారు. సాధారణ వరి రకాలను ఆశించే పురుగులు దోమకాటు ప్రభావం ఈ వంగాల దరి కూడా చేరవని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రత్నచోడి, నారాయణ కామిని, మైసూర్ మల్లికా, చింతలూరు సన్నాలు, కాలా బట్టీ, సుగంధ సాంబ, నవారా, బర్మా బ్లాక్, కులాకార్ వంటి తొమ్మిది రకాల ధాన్యం సాగు చేస్తున్నారు విజయ్ కుమార్.

మెట్ట ప్రాంతంలో ప్రయోగాత్మకంగా విజయ్ కుమార్ చేపట్టిన సేద్యం పై చుట్టు పక్కల ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుండటంతో గత ఏడాది నుంచి కొందరు రైతులు ఆయన బాటలోనే ప్రయాణించడం ప్రారంభించారు. గండేపల్లి, జగ్గంపేట మండలాల్లో 30 మందికి పైగా రైతులు ఇప్పుడు పూర్వపు వరివంగడాలను పండిస్తున్నారు.

ఐదేళ్ల క్రితం సాగు చేపట్టిన విజయ్ కుమార్ తాను జీవితంలో సెటిల్ అయిపోయినట్టేనని అంటున్నారంటే ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు. తనకు వచ్చిన రాబడితో గోడౌన్లను నిర్మించిన విజయ్‌ కుమార్. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యునిట్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అత్యంత తక్కువ పెట్టబడితో ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు ఈ యువరైతు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.


Web TitleNatural Farming by Young Farmer Vijay Kumar
Next Story