Top
logo

Natural Farming: భూమేశ్వర్ భూమిలో.. బంగారమే పండుతుంది

Natural Farming by farmer Bhuvmeshwar
X

Natural Farming: భూమేశ్వర్ భూమిలో.. బంగారమే పండుతుంది

Highlights

Natural Farming: ఏళ‌్లుగా రసాయనాలతో పంటలు పండించిన భూమి అది. సారం కోల్పోయి రైతుకు ఆర్ధికభారాన్నే మిగిల్చింది.

Natural Farming: ఏళ‌్లుగా రసాయనాలతో పంటలు పండించిన భూమి అది. సారం కోల్పోయి రైతుకు ఆర్ధికభారాన్నే మిగిల్చింది. ఏయేటికాయేడు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయే కానీ సాగుదారుకు మాత్రం ఆదాయం కొరవడింది. సాగులో కష్టనష్టాలే తప్ప లాభాల ఊసే లేకుండా పోయింది. కారణం ఏమిటన్న అన్వేషణ సేంద్రియ సేద్యం వైపు మార్గాన్ని చూపింది. మొదటి ఏడాది నిరుత్సాహాన్నే మిగిల్చినా మూడేళ‌్లకు ఆ జీవం లేని పొలంలో బంగారం పండటం మొదలైంది. చిటికెడంత రసాయనాలు కానీ పురుగుమందులు కానీ వినియోగించకుండా ప్రతి రైతు తన వ్యవసాయక్షేత్రంవైపు చూసేలా చేశారు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాజారపు భూమేశ్వర్. గత పదేళ్లుగా 8 ఎకరాల్లో పొలంలో సేంద్రియ పద్ధతిలో సమీకృత సేద్యం చేస్తూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

ఒక పంటపై ఆధారపడి కష్టమొచ్చినా నష్టం ఎదురైనా నెట్టుకురావడం కాదు. ఒక పంట పోయినా మరో పంట ద్వారా ఆదాయం ఆర్జించాలాన్న ఆలోచనే తనను నేడు సేద్యంతో నిలబెట్టిందని చెబుతున్నారు భూమేశ్వర్. 8 ఎకరాల పొలాన్ని విభజించుకుని విభిన్న పంటలు పండిస్తున్నారు. ఐదు ఎకరాల్లో వరి, రెండు ఎకరాల్లో మొక్కజొన్న, అరెకరంలో కూరగాయలు, పది గుంటల్లో చేపలు, మరో పది గుంటల్లో కోళ్లు పెంచుతున్నారు. ప్రతి రోజు చేతినిండా పనితో పాటు నికర ఆదాయం వస్తోందని సంబురంగా చెబుతున్నారు ఈ సాగుదారు.

భూమిని నమ్ముకున్న ఏ రైతన్నా బాగుపడతాడు కానీ అందుకు రైతు ఎన్నుకునే మార్గమే కీలకమని అంటున్నారు ఈ అభ్యుదయ రైతు. మొదట సాగు సానుకూలంగా లేకున్నా సేంద్రియ సేద్యాన్నే నమ్మి ముందుకు సాగానని తెలిపారు. రసాయనాలతో నిర్జీవమైపోయిన నేలను ప్రస్తుతం వానపాములను వృద్ధి చేసి సారవంతం చేశారు. ప్రణాళికా ప్రకారంగా పంటలను సాగు చేస్తున్నారు.

రసాయనిక సేద్యం చేసేప్పుడు నష్టాలు ఎందుకు వచ్చాయో తన అనుభపూర్వకంగా చెబుతున్నారు భూమేశ్వర్. కెమికల్ వ్యవసాయంలో ఎకరం వరి పండించడానికి 18 వేలు ఖర్చు అయ్యేదట. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి పంటను అమ్ముకుంటే చేతికి 30 వేల రూపాయల వరకు వచ్చేవి. ఆ 30 వేలు కూడా పూర్తిగా దక్కే పరిస్థితి ఉండేది కాదని ఎంత శ్రమ పడ్డా నష్టాలే మిగిలేవని తెలిపారు. కానీ సేంద్రియ విధానం తన సాగు గతినే మార్చేసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ రైతు. కేవలం ఎకరా వరి సాగుకు 500 రూపాయల ఖర్చుతో ఎంత లేదన్నా 50 వేల మిగులుతోందని రైతు చెబుతున్నారు.

వరి, మొక్కజొన్న కూరగాయలతో పాటు కోళ్లను, చేపలను సేంద్రియ విధానంలోనే పెంచుతున్నారు. వీటికి కావాల్సిన మేతను తన పొలం నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. కో‌ళ్ల వ్యర్ధాలను పంటకు వంట వ్యర్ధాలను కోళ్లకు , చేపలకు ఇలా బయటి మార్కెట్ పై ఆధారపడకుండా పూర్తి సహజ పద్ధతుల్లో వీటిని పెంచుతున్నారు. ప్రస్తుతం తన పొలంలో ఏర్పాటు చేసుకున్న కుంటలో 3 వేల చేపలు వేశరు. వీటి నుంచి సుమారు 40 వేల వరకు ఆదాయం సమకూరుతుందని రైతు చెబుతున్నారు. ఇక కోళ్లను సహజంగానే పొదిగుస్తూ వాటి సంఖ్యను పెంచుతూ మాసం, గుడ్ల ద్వారాను ప్రతి రోజు ఆదాయం పొందుతున్నారు.

ఒకే ఒక్క ఆవుతో సేంద్రియ సేద్యం మొదలు పెట్టారు భూమేశ్వర్. ప్రస్తుతం తన వద్ద 10 వరకు ఆవులు ఉన్నాయి. ఈ ఆవుల నుంచి వచ్చే పేడ, మూత్రంతో ఘనజీవామృతాన్ని తయారు చేసుకుని అందులో వర్మికంపోస్ట్‌ను అదనంగా కలుపుకుని ఆ ఎరువు మాగిన తరువాత పొలానికి దఫదఫాలుగా అందిస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువును తానే తన పొలంలోనే ఒక చిన్న షెడ్డును, ట్యాంకును నిర్మించుకుని తయారు చేస్తున్నారు. మార్కెటింగ్ కోసం పెద్దగా శ్రమపడటం లేదు ఈ రైతు. చుట్టుపక్కన ప్రాంతాల్లో భూమేశ్వర్ సాగు గురించి తెలుసుకున్నవారే నేరుగా పొలానికి వచ్చి పంటను, చేపలను, కోళ్లను కొనుగోలు చేస్తున్నారు.

Web TitleNatural Farming by farmer Bhuvmeshwar
Next Story