ఫలించిన శాస్త్రవేత్తల పరిశోధనలు

ఫలించిన శాస్త్రవేత్తల పరిశోధనలు
x
Highlights

కండలు తిరిగిన ఒంగోలు గిత్తలకు సమానమైన జన్యు లక్షణాలు కలిగిన మన్ననూరు మచ్చల పశువులు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తున్నాయి. పులితో...

కండలు తిరిగిన ఒంగోలు గిత్తలకు సమానమైన జన్యు లక్షణాలు కలిగిన మన్ననూరు మచ్చల పశువులు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తున్నాయి. పులితో పోరాడే సత్తా ఉన్న తురుపు జాతి పశువులకు త్వరలో జాతీయ స్థాయి గుర్తింపు లభించనుంది. వీటికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేందుకు కొంత కాలంగా జీవవౌవిధ్య మండలి, పశుసంవర్థక శాఖ చేస్తున్న పరిశోధనలు ఫలించాయి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఎన్‌బీఏజీఆర్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక అధికార ప్రకటన లాంఛనమేనని అధికారులు చెప్తున్నారు.

తెల్లని రంగులో గోధుమ వర్ణపు చుక్కలతో అందంగా, దృఢంగా కనిపించే నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు తూర్పు జాతి గిత్తలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించనుంది. మన మన్ననూరు గిత్తలకు ప్రత్యేక గుర్తింపునివ్వడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ , నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రిసోర్సెస్ రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్‌బీఏజీఆర్ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పరిశీలన మొదలుపెట్టారు.

కొన్ని ప్రత్యేక లక్షణాలను సొంతం చేసుకొన్న అచ్చంపేట, మన్ననూరు ఎడ్లకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కొంతకాలంగా రాష్ట్ర జీవవైవిధ్య మండలి, పశుసంవర్ధకశాఖ చేస్తున్న కృషి కొలిక్కి వచ్చింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 151 పశువులు, జంతువులను ప్రత్యేక మేలురకం లక్షణాలున్నవిగా ఎన్‌బీఏజీఆర్ గుర్తించింది. వాటిలో ఒంగోలు గిత్తతోపాటు పలురకాల పశువులు, గొర్రెలు, గుర్రాలు ఉన్నాయి. ఈ జాబితాలోకి త్వరలో తెలంగాణ మన్ననూరు జాతి ఎడ్లు కూడా చేరనున్నాయి.

ఒక జాతి పశువులకు జాతీయస్థాయి గుర్తింపు ఇవ్వాలంటే వాటి పూర్తి వర్ణన జరగాలి. భౌతిక లక్షణాలు, ఉత్పత్తి పనితీరు వివరాలు సేకరించాల్సి ఉంటుంది. మన్ననూరు చుట్టూ వివిధ ప్రాంతాల్లో సుమారు వెయ్యి తురుపు జాతి పశువుల డాటా రికార్డింగ్ కోసం గుర్తించారు. తెలంగాణ జీవ వైవిధ్య మండలి, పశుసంవర్ధకశాఖ, కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసీ ఈ పశుజాతికి గుర్తింపునకు జరిగిన పరిశోధనలు జరిపి ఎన్‌బీఏజీఆర్‌కు విజ్ఞప్తిచేశాయి. వీరి నివేదికను పరిశీలించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఎన్‌బీఏజీఆర్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇక అధికార ప్రకటన లాంచనమేనని అధికారులు చెప్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 39 రకాల గుర్తింపుపొందిన పశువుల జాతులు ఉన్నాయి. గుజరాత్ రాష్ర్టానికి చెందిన గిర్, కాంక్రేజ్, తమిళనాడుకు చెందిన పుల్లికులం, కాంగేయం, కర్ణాటక హల్లికర్, మలనాడు గిడ్డ, కేరళకు చెందిన పెచ్చురు ఇలా ప్రత్యేక జాతులను గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒంగోలు, పుంగనూరు జాతులకు కూడా గుర్తింపు లభించింది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన మన్ననూరు గిత్తలకు జాతీయస్థాయి గుర్తింపు లభిస్తే 40 వ పశువుగా రికార్డులకెక్కుతుంది.

ఈ గిత్తలు నాగర్‌కర్నూలుజిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్, శ్రీశైలం దిగువ కొండల్లో వీటి మనుగడ ఎక్కువగా ఉంది. శరీరం పరిమాణం మధ్యస్తంగా ఉండి బలిష్టమైన గిట్టలతో పెద్ద మూపురం, పొడవాటి తోకతో ఉండే ఈ జాతి గిత్తల జీవనప్రమాణం 25 ఏండ్లుగా లెక్కకట్టారు. తక్కువ పశుగ్రాసం తీసుకోవడం, సమర్థంగా పనిచేయడం ఈ పశువుల ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు.

మచ్చల పశువుల గురించి ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రాంత రైతులకు తెలియడంతో వీటికి డిమాండ్ పెరిగింది. చిన్న,సన్నకారు రైతులు వేల రూపాయలతో పశువులు కొనలేరు. ఒకవేళ కొన్నా వాటి తిండికయ్యే ఖర్చులు భరించలేరు. అలాంటి రైతులకు మచ్చల పశువులతో ఇబ్బందులు ఉండవు. అటవీ ప్రాంతంతోపాటు కొండలు, గుట్టల్లో ని మెట్ట పొలాల్లో సాగుపనుల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇతర జాతి పశువులు వ్యవసాయపనులు చేయలేవు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ తురుపు జాతి పశువులకు జాతీయ గుర్తింపు వస్తే వీటిపై ఇంకొన్ని పరిశోధనలు చేసే అవకాశం కలుగుతుంది. ఇవి పచ్చిగడితో పాటు ఎండుగడ్డి కూడా మేస్తాయి. వీటిని స్థానికంగా పొడ జాతి పశువులు అని కూడా పిలుస్తుంటారు ఇక్కడి రైతులు.


Show Full Article
Print Article
Next Story
More Stories