ఆ కరువు జిల్లా మరో కోనసీమగా మారబోతుందా..?

ఆ కరువు జిల్లా మరో కోనసీమగా మారబోతుందా..?
x
Highlights

నిన్న, మొన్నటి వరకు ఆజిల్లా కరువుతో అల్లాడిన జిల్లా. మూడువందల కిలోమీటర్లు మేర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా సాగునీటి కోసం రైతన్న కష్టాలు...

నిన్న, మొన్నటి వరకు ఆజిల్లా కరువుతో అల్లాడిన జిల్లా. మూడువందల కిలోమీటర్లు మేర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా సాగునీటి కోసం రైతన్న కష్టాలు ఎదుర్కొన్న జిల్లా. అదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. కానీ నేడు ఆ కరువు జిల్లా మరో కోనసీమగా మారబోతుందా..? జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలపై HMTV స్పెషల్ స్టోరీ.

కరువు జిల్లాగా ముద్రపడ్డ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా త్వరలోనే మరో కోనసీమలా మారబోతుందా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. రెండు నెలల నుంచి వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులు, చెరువులు, బావులతోపాటు కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే నీటిని పొదుపుగా వాడుకుంటే వానాకాలంతోపాటు యాసంగి పంటలకూ నీరు పుష్కలంగా ఉండనుంది. జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 626.9 మిల్లీమీటర్లు కాగా అందులో కురవాల్సిన వర్షాపాతం 437.3 మిల్లీమీటర్లు. కానీ నమోదైన వర్షాపాతం 692.3మిల్లీమీటర్లు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 72 మండలాలు ఉండగా అందులో మూడుమండలాలైన రాజాపూర్, మిడ్జిల్, అమ్రాబాద్‌లో మాత్రమే 20మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. అటు నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్నీ మండలాల్లోనూ 10మీటర్ల కంటే తక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు.

గతంలో వంద ఫీట్లకు పైగా బోరు వేస్తే కానీ లభించని గంగమ్మ నేడు పది నుంచి 20 ఫీట్లలోపే లభిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఈ ఏడాది వర్షాలు కురవడమే అంటున్నారు రైతన్నలు. జిల్లా వ్యాప్తంగా నీరు సమృద్ధిగా ఉండటంతో వలసలు వెళ్లిన వారంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. తమకున్న కొద్దిపాటి పొలాల్లో వ్యవసాయ పనులను ప్రారంభించారు. మొత్తానికి కరువు జిల్లా, వలసల జిల్లాగా ముద్రపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లాకు అటు కృష్ణా జలాలు పూర్తిస్థాయిలో రావడం ఇటు రెండునెలల పాటు సమృద్ధిగా వర్షాలు కురవడంతో కరువు జిల్లా కాస్తా కోనసీమగా మారి సిరులు కురిపించే జిల్లాగా అవతరించబోతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories