కాకతీయుల కోటలో.. ఆకుకూరల తోటలు

Warangal
x
Warangal
Highlights

ఒకప్పుడు కాకతీయుల సామ్రాజ్యంగా వెలుగొందింది ఆ నేల నాటి పద్ధతులతో సిరులమాగాణిగా విరసిల్లింది ఆ భూమి. నేడు పర్యాటకుల సందడితో పాటు పచ్చటి పంట పొలాల నడుమ నిత్యం కళకళలాడుతోంది.

ఒకప్పుడు కాకతీయుల సామ్రాజ్యంగా వెలుగొందింది ఆ నేల నాటి పద్ధతులతో సిరులమాగాణిగా విరసిల్లింది ఆ భూమి. నేడు పర్యాటకుల సందడితో పాటు పచ్చటి పంట పొలాల నడుమ నిత్యం కళకళలాడుతోంది. ఖిలా వరంగల్ కోటలో నేడు రైతులు సిరుల పంటలు పండిస్తున్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులకు అదనపు ఆహ్లాదాన్ని పంచుతున్నారు. కోటలో ఆకుకూరలు , కూరగాయల తోటల సాగుపై మీ నేలతల్లి ప్రత్యేక కథనం.

కాకతీయుల రాజధాని ఓరుగల్లు నేటి వరంగల్ ఇప్పటికీ చారిత్రక కట్టడాలతో పర్యాటక కేంద్రంగా నిత్యం సందర్శకులతో సందడిగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరుపొందిన వరంగల్ ప్రముఖ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలకు నెలవుగా కొనసాగుతుంది.

వరంగల్ అనగానే ముఖ్యంగా చెప్పుకునేది ఖిలా వరంగల్ కోట ఒకప్పటి కాకతీయుల రాజధాని. చుట్టూ మట్టికోటలతో ప్రహరీ గోడలు మధ్యలో నివాసలతో పాటు వ్యవసాయ యోగ్యమైన భూములు పంటలకు ఉపయోగపడే గొలుసుకట్టు నీటి బావులు, చెరువులు దీంతో నాటి నుంచి నేటి వరకు కోటలో రైతులు పచ్చని పంటలు పండిస్తూనే ఉన్నారు. పచ్చగా జీవిస్తున్నారు.

ఖిలా వరంగల్ పడమర కోట, మధ్యకోటలో సన్నకారు, చిన్నకారు రైతులు పాలకూర, బచ్చలి కూర, కలెగూర, సుక్కకూర, తోటకూర, కొత్తిమీర, మెంతికూర ప్రధాన పంటలుగా వ్యవసాయం చేస్తున్నారు. అరగుంట భూమి ఉన్నా సరే అందులో మూడు నాలుగు మడుల్లో ఆకుకూరల సాగుచేస్తున్నారు.

తాతముత్తాతల కాలం నుంచి బట్టకు పొట్టకు ఇబ్బంది లేకుండా బతుకుతున్నారు ఇక్కడి రైతులు. కూరగాయలు, ఆకుకూరలు అమ్మగా వచ్చిన డబ్బులతో పిల్లలను చదివించుకుంటున్నారు.

కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో సువిశాలంగా వ్యాపించి పండ్లు, పూల తోటలతో అనేక రాజభవనాలతో అద్భుత కళాకాంతులతో శోభిల్లుతుండేది. కోట పై భాగంపై నిలబడి ఏ వైపు చూసినా రెండు మైళ్ళ పొడవునా నీటి ఫౌంటైన్స్‌తో పాటు అందమైన తోటలు విరివిగా కనబడేవట. తోటల పెంపకంలో భాగంగా మామిడి, అరటి, పనస తోటల పెంపకం ఎక్కువగా వుండేది. ఇప్పుడు ఇక్కడే పచ్చటి ఆకుకూరలను,కూరగాయలను ఉన్నకొద్దిపాటి నీటి వనరులతో తరతరాలుగా సాగు చేస్తున్నారు రైతులు.

ఎకరం, ఎకరంన్నర భూమి ఉన్నా అక్కడక్కడా బంతిపూలు, మక్కజొన్న వేస్తున్నారు ఇక్కడి రైతులు. పది మందికి ఉపాధినివ్వడమే కాకుండా, వరంగల్ జిల్లాతోపాటు పక్కనున్న కరీంనగర్ జిల్లాలోని అనేక మార్కెట్లకు ఆకుకూరలను పంపిస్తున్నారు. కొంతమంది రైతులుగా సాగుబడిలో ఉంటే మరికొంత మంది వరంగల్ కూరగాయల మార్కెట్ అమ్మకం దారులుగా స్థిరపడ్డారు.

చిన్నపిల్లలను సాకినట్టు ఈ పంట పొలాను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ఇక్కడి రైతులు. ఒక్కరోజు తోటను పట్టించుకోకపోయినా తోటలు వల్లిపోతాయి. అందుకే తోటలకు కూలీలెక్క ఇక్కడే ఉంటుంటారు. వంతుల వారీగా మడుల్ని చూసుకుంటారు.

ఇక్కడ ఆకుకూరల సాగు మొత్తం కలిపి 150 ఎకరాల కంటే ఎక్కువగా ఉండదు. అందులో అరగుంట నుంచి ఎకరం, ఎకరన్నర భూమి ఉన్నవాళ్లే అధికం. వరంగల్ కూరగాయల మార్కెట్‌కు ఆకుకూరలు ఇక్కడి నుంచే వెళతాయి. దాదాపు అన్ని మార్కెట్లతోపాటు కరీంనగర్ జిల్లా మార్కెట్‌కు కూడా ఆకుకూరలు, తోటకూరలు ఇక్కడి నుంచే సరఫరా అవుతుంటాయి.

తెలంగాణ ఆవిర్భవించిన తరువాత రాష్ర్టాన్ని విత్తన భాండాగారంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ ఖిలా వరంగల్ రైతులు మాత్రం ఒక్క పాలకూర మినహా విత్తనాలను స్వయంగా తయారు చేసుకుంటారు. ఇరుగు పొరుగు రైతుల సహకారం, విత్తన బదిలీ పద్ధతిని అనుసరిస్తున్నారు.

అందరూ ఒకేరకమైన పంటలు వేయరు. ఒక్కొక్కరు ఒక్కో రకాన్ని సాగు చేస్తుంటారు. ఒకరు తోటకూర పండిస్తే.. మరొకరు మెంతికూర పండిస్తారు. ఒకరు బచ్చలికూర నారిస్తే ఇంకొకరు కలెగూర ఇస్తారు. వారు సాగు చేసే పంటల నారును వారే స్వయంగా చేలల్లో తయారు చేసుకుంటారు. నారొచ్చిన తరువాత పంచుకుంటారు.

కోటలో ఉన్న నేలలు ప్రధానంగా పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి అంతే కాదు సాగు నీటికి కోదవలేదు. దింతో ఇక్కడ పండే పంటలకు మంచి గిరాకీ ఉంది. కోటకు వచ్చే పర్యాటకులు సైతం కూరగాయలు ఆకుకూరల సాగును పరిశీలించడంతో పాటు ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేసే వెలుతున్నారు అని అంటున్నారు సాగుదారులు.

ఖిలావరంగల్‌లో సాగునీటికి బావులే ప్రధాన ఆధారం. అందరూ చిన్న, సన్నకారురైతులే కాబట్టి బావులను సొంతానికి తవ్వుకోలేరు. సొంతానికి బావి తవ్వాలనుకుంటే వారికున్న భూమి దాదాపు గుంటెడు దాకా పోతుంది. ఖిలా వరంగల్ కేంద్ర పురావస్తు శాఖ సైట్ కబట్టి అక్కడ ఎటువంటి తవ్వకాలు నిషేధం. బోరు బావులు ఎట్టిపరిస్థితుల్లో వేసుకునే అవకాశం లేదు. అందుకే రైతులు అక్కడున్న పాతబావులనే వంతుల వారీగా వాడుకుంటున్నారు.

మధ్యకోటలో పది పదిహేను బావుల కంటే ఎక్కు వ లేవు. మొన్నటి వానలకు బావుల్ల నీరు బాగా ఊరింది. కరెంట్ బిల్లును అందరు కలిసి కట్టుకుంటున్నారు. ఇప్పటి వరకైతే ఎవ్వరి పంటలు ఎండిపోలేదు. పచ్చగా కళకళలాడుతూనే ఉన్నాయి.

రైతులే కాకుండా ఇంటిల్లిపాది ఆకుకూరల సాగులో భాగస్వాములవుతున్నారు. భార్యాభర్త, కొడుకూ కోడలూ అందరూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తోటమడుల్లోనే కాలం గడుపుతారు. పంట చేతికి రాగానే బదల్ పద్ధతిలో అంటే ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సహకార సాగు విధానాన్ని అనుసరిస్తున్నారు. కొంచెం పెద్ద రైతులు ఉంటే వారి కోసం ఆకుకూరలు కోసి, కట్టలు కట్టేందుకు కూలీలు ఉంటారు. మడులు కోసి కట్టలు కట్టి వాటిని మార్కెట్‌కు తరలిస్తారు.

కోట చూసేందుకు వెళ్లే సందర్శకులకు ముందుగా ఆహ్లాదాన్ని పంచేవి ఈ పంటపొలాలే ఇక్కడ పాలకూర, తోటకూర, కొత్తిమిరా, మెంతికుర, ముల్లంగి, క్యారెట్, చుక్కకుర, మొక్కజొన్న, కరివేపాకు, ఇలా అన్నిరకాల ఆకుకూరలతో పాటు కూరగాయల సాగును ప్రత్యక్షంగా చూస్తూ వాటి సాగు పద్ధతులను అడిగి తెలుసుకుంటున్నారు.

కోట సందర్శనకు నిత్యం 5 నుంచి 6 వేల మంది పర్యాటకులు వస్తుంటారు సెలవుల్లో 10 వేలకు సంఖ్య మించుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కోటతో పాటు మా పంటపొలాలను చూసి ఇక్కడ ఆగి అడిగి తెలుసుకుంటారంటున్నారు రైతులు.

పర్యాటక ప్రాంతాల్లో సహజంగా ప్రభుత్వం చుట్టుపక్కల పరిసరాలను పచ్చగా ఉంచుతుంది కానీ ఇక్కడి రైతులు కోట చుట్టూ పచ్చని పంట పొలాలతో కోటకు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను అందిస్తున్నారు. మద్యకోటలోని చారిత్రక కట్టడాలకు మణిహారంలా పంటలతో స్వాగతం పలుకుతున్నారు చిన్న సన్నకారు రైతులు మంచి ఆదాయాన్ని పొందడంతో పాటు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories