తెలుగు నేలపై కేరళ పంట.. సాగు లాభదాయకంగా ఉందంటూ రైతు హర్షం..

Jajikaya-Japatri Farming in Kakinada
x

తెలుగు నేలపై కేరళ పంట.. సాగు లాభదాయకంగా ఉందంటూ రైతు హర్షం..

Highlights

Jajikaya-Japatri: కేరళలో మాత్రమే పండే సుగంధ పంటలను తన పొలంలో ప్రయోగాత్మకంగా పండించి మంచి ఫలితాలు పొందుతున్నారు కాకినాడ జిల్లాకు చెందిన రైతు.

Jajikaya-Japatri: కేరళలో మాత్రమే పండే సుగంధ పంటలను తన పొలంలో ప్రయోగాత్మకంగా పండించి మంచి ఫలితాలు పొందుతున్నారు కాకినాడ జిల్లాకు చెందిన రైతు. తనకున్న పామాయిల్‌ తోటల్లో అంతర పంటగా జాజికాయ పెంపకం చేపట్టి తోటి రైతులను ఆకర్షిస్తున్నారు. కేరళలో ఉన్న తన బంధువుల సహకారంతో మొక్కలను తెప్పించి, అదనపు పెట్టుబడి లేకుండా సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ పంటలను విజయవంతంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు అంబయ్య. దేశవాలీ ఆవులను పెంచుతూ వాటి వ్యర్థాలను సేద్యానికి వినియోగించడంతో పాటు పాల విక్రయంతోనూ ఆదాయాన్ని పొందుతున్నారు.

ఏ పంట సాగు చేసినా అందులో వైవిధ్యం ఉండాలి. తోటి రైతుల్లా అవే పంటలు పండిస్తే లాభమేముంటుంది చెప్పండి. స్థానిక నేలలు, వాతావరణం, నీటి సదుపాయాన్ని చూసుకుని కొత్త రకం పంటలు ఎన్నుకుని సేద్యంలో ప్రయోగాలు చేస్తేనే రైతుకు లాభాల మార్గం కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ప్రయోగమే చేసి సత్ఫలితాలను పొందుతున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం యండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగులో ఉన్న సుగంధద్రవ్య పంటలను తన పొలంలో వినూత్నంగా పండిస్తున్నారు ఈ సాగుదారు. అదనపు పెట్టుబడి పెట్టకుండా ఇదివరకే సాగులో ఉన్న పామాయిల్ తోటలో అంతర పంటగా జాజికాయ సాగు చేస్తున్నారు. తెలుగు నేలపైనా సుగంధద్రవ్యాలు పండుతాయని నిరూపిస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముళ్ళపూడి కృష్ణారావు అనే రైతు పొలంలో జాజికాయల సాగు చూసి, తన పొలంలోనూ సాగు చేపట్టానని రైతు తెలిపారు. ఐదేళ్ల క్రితమే అంబయ్య జాజికాయ మొక్కలను నాటారు. ప్రస్తుతం పంట దిగుబడి ప్రారంభమైంది. వీటితో పాటే మిరియాలు, యర్రవాగులి, ఎర్ర చక్కెరకేళి, కంద వంటి మొక్కలను పామాయిల్‌లో అంతరంగా పెంచుతున్నారు. పూర్తి ప్రకృతి విధానాలు అవలంభిస్తుండటంతో రైతు మంచి దిగుబడిని అందిపుచ్చుకుంటున్నారు. ఒక్కో జాజికాయ చెట్టు నుంచి 5 నుంచి 10 కేజీల వరకు దిగుబడి అందుతోందని రైతు చెబుతున్నారు.

మార్కెట్‌లోనూ ఈ పంటకు మంచి డిమాండ్ ఉందన్నారు ఈ సాగుదారు. పండిన పంటను తానే స్వయంగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నాని తెలిపారు. అంతే కాదు వ్యాపారులే పొలం వద్దకు వచ్చి పంటను కొనేందుకు ఆర్డర్లు ఇస్తున్నారన్నారు. మార్కెట్‌లో జాపత్రి కేజీ 2,500 రూపాయలు ఉండగా జాజికాయ కేజీ వెయ్యి రూపాయలు పలుకుతోంది.

అంతరపంటగా జాజికాయ సాగు మంచి లాభాలను ఇస్తుండటంతో తోటి రైతులు ఈ పంట సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచనలు ఇస్తున్నారు. సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. అంతర పంటగా జాజికాయను సాగు చేసుకుంటే ప్రధాన పంట కన్నా ఎక్కువ లాభాలు ఈ పంట ద్వారా పొందవచ్చని రైతు తెలిపారు. ఉద్యానశాఖ ద్వారా తగిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తూ, సబ్సిడీ మీద మొక్కలు పంపిణీ చేస్తే ఇటువంటి వినూత్న పంటలకు రైతులు ముందుకు వస్తారని రైతు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories