Terrace Gardening: సమీకృత విధానంలో మిద్దె సాగు

Integrated Terrace Gardening by Ravichandra Kumar
x

Terrace Gardening: సమీకృత విధానంలో మిద్దె సాగు

Highlights

Terrace Gardening: గుంట భూమిలేదు అయినా పచ్చటి వనాన్ని నిర్మించారు.

Terrace Gardening: గుంట భూమిలేదు అయినా పచ్చటి వనాన్ని నిర్మించారు. మట్టి జాడ లేదు..అయినా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. పెద్ద పెద్ద చెరువులు లేవు కానీ సంవత్సరానికి సరిపడా చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. అంతేనా అంతకు మించి అన్నట్లుగా ఓ వైపు పందెం కోళ్లు మరోవైపు దేశీ గోవులు కాంక్రీట్ నగరంలో ఇంటినే ఓ వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్ది సమీకృతి మిద్దె సాగు చేస్తున్నారు సైదాబాద్‌ సరస్వతీనగర్‌కు చెందిన రవిచంద్ర కుమార్. ఆరోగ్యంతో పాటు తరతరాలుగా వస్తున్న పూర్వికుల విధానాలను భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంగా మిద్దె సాగులో వినూత్న విధానాలను అనుసరిస్తున్నాడు ఈ సాగుదారు. ఓ వైపు ఆధునిక పరిజ్ఞానంతో మట్టి అవసరం లేకుండా అతి తక్కువ నీటి వినియోగంతో పంటలు పండిస్తూనే మరోవైపు ట్యాంకుల్లో చేపలు పెరట్లో దేశీ గోవులు, పందెం కోళ్లను పెంచుతున్నారు.

ఐదుగురు సభ్యులు ఉన్న వారి కుటుంబానికి సరిపడా ఆహారాన్ని 1200 అడుగుల మిద్దె తోట ద్వారా పొందుతున్నారు. కుటుంబానికి ఆరోగ్య కార్డు లాంటిది ఈ మిద్దె తోట అని అంటున్నారు రవిచంద్ర. మిద్దె తోటల నిర్వహణ ద్వారా చిన్న పిల్లలకు విజ్ఞానం ఉద్యోగులకు మానసిక ఉల్లాసం, వయస్సుపైబడిన వారికి కాలక్షేపం అవుతుందని అంటున్నారు. పంటలతో పాటే కోళ‌్లను, చేపలను, పశువులను పెంచుకోవడం వల్ల పరిపూర్ణమైన ఆర్ధిక వ్యవస్థ గృహాల్లో ఏర్పడుతుందని అంటున్నారు.

నీటి వృధాను అరికట్టేందుకు నవీన పద్ధతిని అనుసరిస్తున్నారు రవిచంద్ర. డ్రిప్ అండ్ డ్రైన్ విధానం తమకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. మేడ మీద వెయ్యి లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసుకున్న ఈ సాగుదారులు ఆ ట్యాంకుల్లో చేపలను పెంచుతున్నారు. ఈ ట్యాంకుల్లో ఉన్న నీటినే డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. దీంతో మొక్కలకు ప్రత్యేకంగా పోషకపదార్ధాలు అందించాల్సిన అవసరం రాదంటున్నారు ఈ సాగుదారు. మొక్కలకు అందించాగా వృథాగా వచ్చిన నీరు కింద ఫిల్టర్లలో సేకరించి వాటిని మళ్లీ శుద్ధి చేసి ప్రత్యేక ట్యాంకుల్లోకి సేకరిస్తున్నారు. ఆ నీటిని తిరిగి చేపల ట్యాంకుల్లోకి పంపుతున్నారు. ఇలా రీసైక్లింగ్ విధానంలో నీటిని పొదుపు చేస్తూ ఏడాది పొడవునా కూరగాయలు , చేపల ఉత్పత్తిని పొందుతున్నారు.

వంద కేజీల పాటింగ్ మిశ్రమం తయారీ కోసం 30 శాతం వర్మికంపోస్ట్, 30 శాతం కోకోపిట్, 30 శాతం ఆవు ఎరువు , 10 శాతం నీమ్ కేక్ ను వాడతున్నారు ఈ సాగుదారు. గుప్పెడంత మట్టిని కూడా వినియోగించడం లేదు. మొక్కల పెంపకంలో మట్టి వినియోగం వల్ల తెగుళ్లు వ్యాపిస్తాయని ఈ మిశ్రమం ద్వారా ఆ ఊసే ఉండదంటున్నారు. పైగా మేడ మీద బరువు కూడా పడదంటున్నారు. నిరంతరం 365 రోజులు ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు పండ్లు పెంచుకోవచ్చు అని చెబుతున్నారు. ఆకుకూరలు సాగు చేసుకోవడానికి టవర్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు రవిచంద్ర. అపార్ట్‌మెంట్లలో తమ బాల్కానీల్లోనూ పెంచుకునే విధంగా 300 లీటర్ల డ్రమ్మును టవర్ గార్డెన్‌గా రూపొందించారు. ఏడు వరుసల్లో ఏడు రకాల ఆకుకూరలను 4 నుంచి 6 నెలల వరకు పెంచుకోవచ్చంటున్నారు. విదేశీ ఆకుకూరలను సైతం సాగుచేసుకోవచ్చంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories