logo
వ్యవసాయం

ఎకరం విస్తీర్ణంలో సమీకృత సేద్యం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న యువరైతు

Integrated Farming BY Farmer Lakshmi Kiran
X

ఎకరం విస్తీర్ణంలో సమీకృత సేద్యం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న యువరైతు

Highlights

Integrated Farming: అధిక ఉత్పత్తే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ప్రస్తుత వ్యవసాయానికి భిన్నంగా అడుగులు వేస్తున్నాడా యువరైతు.

Integrated Farming: అధిక ఉత్పత్తే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ప్రస్తుత వ్యవసాయానికి భిన్నంగా అడుగులు వేస్తున్నాడా యువరైతు. పూర్వకాలం నుంచి వస్తున్న సమీకృత సేంద్రియ సేద్య పద్ధతిని అనుసరిస్తూ తోటి రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. విషపూరితమైన రసాయనాలను వినియోగించకుండా ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన ఉత్పత్తలను సొంతం చేసుకుంటున్నాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన యువరైతు తిరుమలశెట్టి లక్ష్మీ కిరణ్ అనుసరిస్తున్న సాగు విధానం తోటి రైతులను ఆలోచింపజేస్తోంది. తనకున్న ఎకరం భూమిలో 70 సెంట్లలో విభన్న రకాల పూలు, 30 సెంట్లలో పండ్లు పండిస్తూ సత్ఫిలితాలను సాధిస్తున్నాడు ఈ యువరైతు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

70 సెంట్ల భూమిలో కనకాంబరాలతో పాటు బంతి, చేమంతులను సాగు చేస్తున్నాడు కిరణ్. తద్వారా ప్రతి నెల నికర ఆదాయాన్ని పొందుతున్నాడు. స్థానికంగా పూలకు మంచి గిరాకీ ఉంటుందని ఈ యువరైతు చెబుతున్నాడు. సీజన్‌లో కనకాంబరాలు కిలో వెయ్యి నుంచి 1500 పలికితే అన్‌ సీజన్‌లో 800 రూపాయల వరకు ధర ఉంటుందంటున్నాడు. అన్ని ఖర్చులు పోను ప్రతి నెల నికరంగా 30 నుంచి 50 వేల వరకు ఆదాయం కనకాంబరాల ద్వారా పొందుతున్నానని తెలిపాడు కిరణ్. అదే 70 సెంట్లలో సాగు చేస్తున్న బంతి, చేమంతుల నుంచి అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ యువరైతు.

సమీకృత విధానం కొత్తదేమీ కాదని తాతల కాలం నుంచి ఈ పద్ధతి కొనసాగుతోందని ఈ యువరైతు చెబుతున్నాడు. అయితే రాను రాను కేవలం అధిక దిగుబడుల ఆశతోనే రైతులు ఏక పంట సాగుకు అలవాటు పడిపోయారని తెలిపాడు. వాణిజ్య పరమైన పంటతో పాటు రైతు తమ కుటుంబ అవసరాలకు సరిపడా ఆహారాన్ని స్వయంగా పండించుకోవాలని సూచిస్తున్నాడు. అందులో ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వాలని తెలిపాడు. రైతు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందంటున్నాడు. అందుకే వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన విభిన్న రకాల పండ్ల కు ఈ యువరైతు క్షేత్రం వేదికైంది. కేవలం 30 సెంట్ల విస్తీర్ణంలో 14 రకాల పండ్ల చెట్లను పెంచుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు కిరణ్.

నామమాత్రంగా పండ్ల మొక్కలను పెంచడం కాదు, స్థానికంగా అందుబాటులోని అధిక ఫలసాయాన్ని అందించే పోషకాలు కలిగిన పండ్ల మొక్కలనే సాగుకు ఎన్నుకున్నాడు ఈ యువరైతు. తమిళనాడు నుంచి అలగిరి స్వామి మునగ జాతి మొక్కలను తెప్పించి పొలంలో నాటుకున్నాడు. ఈ మునగ జాతి చలికాలంలో పూత అందిస్తుందని ఇదే దీని ప్రత్యేకత అని రైతు చెబుతున్నాడు. పోషకాలు అధికంగే ఉండే మునగాకు చేనులో రాలడం వల్ల నేలకు సహజ సిద్ధమైన పోషకాలు అందుతున్నాయని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. మునగ ద్వారా అదనపు ఆదాయంతో పాటు పంటకు పోషకాలు అందుతున్నాయని కిరణ్ తెలిపాడు.

365 రోజు గుత్తులు గుత్తులుగా కాయలు కాసే మామిడి చెట్లూ ఈ క్షేత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తైవాన్ రకమైన ఈ మామిడి చెట్ల నుంచి ప్రతి రోజు పండ్లను కోసి ఇంట్లో వినియోగించుకుంటున్నామని కిరణ్ తెలిపాడు. అదే విధంగా చెక్కరకేళి అరటి పండ్ల చెట్లు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి.

ఎలాంటి ఎరువులు పురుగుమందులు వినియోగించడకుండా ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచుతున్నాడు. పొలం చుట్టూ కంచెలుగా ఏర్పాటు చేసుకున్న డ్రాగన్ మొక్కల నుంచి నాణ్యమైన ఫలసాయాన్ని పొందుతున్నాడు. స్థానికులకు ఒక్కో కాయ 50 రూపయాల చొప్పున విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు.

కనకాంబరాల సాగుకు ముందు ఇదే 70 సెంట్లలో బొప్పాయి సాగు చేశాడు కిరణ్. పంట మార్పిడి విధానంలో భాగంగా ఈ ఏడు కనకాంబరాలను పెంచుతున్నాడు. అక్కడక్క తైవాన్ రెడ్ లేడీకి బొప్పాయి రకాలను సాగు చేస్తున్నాడు. మిగతా తోటల్లో బొప్పాయి వైరస్ బారిన పడినా తాను సహజ సిద్ధ ఎరువులను వినియోగిస్తుండటం వల్ల మొక్కలకు ఎలాంటి తెగుళ్లు వ్యాపించలేదని రైతు చెబుతున్నాడు.

మనస్సు ప్రశాంతంగా ఉంటే మనుగడ ప్రశాంతంగా ఉంటుందిని చెబుతున్న ఈ రైతు ఆ ప్రశాంతత ప్రకృతి నుంచే లభిస్తుందని అంటున్నాడు. అందుకోసమే తన క్షేత్రాన్ని ఓ మోడల్ ఫామ్‌ గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కిరణ్.


Web TitleIntegrated Farming BY Farmer Lakshmi Kiran
Next Story