కర్బూజ, బీర, దోస.. వరికంటే ట్రిపుల్ లాభం..

Ideal Farmer Tirupati Cultivation Organic Vegetable
x

కర్బూజ, బీర, దోస.. వరికంటే ట్రిపుల్ లాభం..  

Highlights

Organic Vegetable: వరి, మొక్కజొన్న, పసుపు సాగులో ఆదాయం పొందాలంటే దీర్ఘకాలం వేచిచూడాలి.

Organic Vegetable: వరి, మొక్కజొన్న, పసుపు సాగులో ఆదాయం పొందాలంటే దీర్ఘకాలం వేచిచూడాలి. అందులోనూ రసాయనాల సేద్యంలో పెట్టుబడులు పెరుగుతున్నాయే కానీ మార్కెట్‌లో మద్దతు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో సమాజహితంతో పాటు సేద్యంతో నికరమైన ఆదాయాన్ని ఆర్జించాలన్న ఆలోచనకు వచ్చాడు ఆ యువరైతు. నడుం భిగించాడు, సేంద్రియ సేద్యం వైపు కదం తొక్కాడు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన రైతు నల్లాల తిరుపతి. తమ తాతల నుంచి వస్తున్న నేలలో కూరగాయల సేద్యానికి శ్రీకారం చుట్టాడు ఈ యువరైతు. మొదట ఆటుపోట్లు ఎదురైనా కంగారు పడలేదు. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకున్నాడు. ఆధునిక వ్యవసాయ విధానాల గురించి అవగాహన పెంచుకుని సేద్యంలో వాటి అవసరాన్ని గుర్తించాడు. మల్చింగ్ , డ్రిప్ వంటి పద్ధతులను అనుసరిస్తూ సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ ఆరోగ్యకరమైన పంటలను పండిస్తూ నికర ఆదాయం పొందుతున్నాడు. సేంద్రియ సేద్యంతో పురుగుమందులు, రసాయనాలు లేకుండా పంటలు పండించవచ్చన్న నమ్మకం కలిగిందని తన అనుభవాలను చెబుతున్నాడు ఈ సాగుదారు.

30 గుంటల భూమిని చిన్న చిన్న కమతాలుగా విభజించుకుని విభిన్న పంటలను పండిస్తున్నాడు యువరైతు తిరుపతి. అందులో 15 గుంటల్లో పందిరి విధానంలో బీర సాగు చేస్తున్నాడు. గత ఏడాది బీరను నేలపైన పండించడం వల్ల రెండు మూడు కోతలకే పంట కోత పూర్తైందని చెబుతున్న ఈ రైతు ఈ ఏడు పందిరి పద్ధతి వల్ల 8 కోతల వరకు కాయ దిగుబడి వచ్చిందని సంతోషంతో తెలిపాడు. పందిర్ల నిర్మాణం కోసం పెద్దగా ఖర్చు చేయలేదు. అందుబాటులో ఉన్న కర్రలు, తీగలతోనే పందరిని స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. పంట దిగుబడి ప్రస్తుతం ఆశాజనకంగా ఉండటంతో నేరుగా వినియోగదారుడికే పంటను విక్రయిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు ఈ యువరైతు.

స్నేహితుల ప్రోత్సాహంతో తిరుపతి మరో పది గుంటల్లో సీజనల్ పంటైన కర్బూజను సాగు చేస్తున్నాడు. కర్బూజ సాగులో ప్రారంభంలో చీడపురుగుల సమస్యలు ఏర్పడ్డాయి వాటి నివారణకోసం ఆవు మూత్రంతో పాటు పులిచిన మజ్జికను పంటపై పిచికారీ చేశాడు. అంతే కాదు నిపుణుల సూచనలతో పొలంలో ఫిరమోన్ ట్రాపర్లు, జిగురు పూసిన అట్టలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆధునకి పద్ధతులైన మల్చింగ్ , డ్రిప్ ద్వారా పంట దిగుబడి బాగుందని ఒక్కో కాయ 4 కిలోల వరకు బరువు తూగుతుందని రైతు చెబుతున్నారు. స్థానికంగా కర్బూజ సాగు అధికంగా లేకపోండంతో సొంతగా మార్కెట్ చేసుకోవడం వల్ల మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతు హర్షం వ్యక్తం చేశాడు.

5 గుంటల్లో రెండు రకాల దోస పండిస్తున్నాడు తిరుపతి. ఒక రకం నేలమీద పండిస్తుంటో మరో రకం దోసను నిలువ పందిర్లపైన పండిస్తున్నాడు. సేంద్రియ విధానాలు అనుసరిస్తున్నప్పటికీ నేల మీద పండిన పంటకు, పందిరిపైన వచ్చిన పంటకు చాలా తేడా ఉందని ఈ రైతు చెబుతున్నాడు. పందిర్లపై కాసిన కాయల నాణ్యత బాగుండటం, ఆరోగ్యకరమైనది కావడంతో మార్కెట్‌లోనూ మంచి ధరకు అమ్ముడుపోతోందని రైతు చెబుతున్నాడు. ఒక పంట ద్వారా నష్టం ఏర్పడినా మరో పంట ద్వారా ఆదాయం వస్తుందని ఉద్దేశంతోనే ఉన్నది కొద్దిపాటి పొలమే అయినా మూడు రకాల పంటలను సాగు చేస్తున్నాడు తిరుపతి. ఇలా వివిధ రకాల పంటలు సాగు చేసుకోవడం వల్ల వరికంటే మూడు రెట్ల ఆదాయం పొందే అవకాశం ఉందని రైతు ఎంతో ధైర్యంగా చెబుతున్నాడు.

సాగులో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఎదురవుతాయి, అలా అని తన జీవనాధారమైన వ్యవసాయాన్ని ఏ రైతు వీడడు. పక్కవాడి నోటికి ముద్ద అందించాలనే తపనతో తన పొట్టను ఖాళీగా ఉంచుకుని సేద్యాన్ని ఓ ఉద్యమంలా చేస్తుంటాడు కర్షకుడు. అలా అని కష్టనష్టాలు వెన్నంటి ఎప్పుడూ ఉండవు వాటిని అధిగమించి అధిక ఆదాయం పొందే మార్గాలను రైతు అన్వేషించాల్సిన అవసరం ఉంది. అలాంటి కోవకే వస్తాడు ఈ సాగుదారు. మీరు మూస ధోరణిలో అవే పంటలను పండించకుండా లాభాలను ఆర్జించే సేద్యం వైపు కదులతారని ఆశిస్తున్నాం.


Show Full Article
Print Article
Next Story
More Stories