వ్యవసాయం చేయాలంటే సారవంతమైన నేల కావాలి అందులో పోషకాలున్న మట్టి ఉండాలి. ఇదంతా పాత పద్ధతి ఇప్పుడు చేతికి మట్టి అంటే పనిలేదు వానలు కురవలేదన్న బాధ లేదు....
వ్యవసాయం చేయాలంటే సారవంతమైన నేల కావాలి అందులో పోషకాలున్న మట్టి ఉండాలి. ఇదంతా పాత పద్ధతి ఇప్పుడు చేతికి మట్టి అంటే పనిలేదు వానలు కురవలేదన్న బాధ లేదు. కలుపు మొక్కల దిగులు లేదు. చీడపీడల బెడద అంతకన్నా లేదు. ఎకరాల లెక్కల పొలం లేదన్న చింతా లేదు. ఉన్న కాస్త నేల అయినా పర్లేదు ఏడాది పొడవునా పచ్చని పంటలను పండించవచ్చు. లాభాలు పొందవచ్చు. అయితే ఇది సామాన్య రైతులు చేసే పద్ధతి మాత్రం కాదు సుమా నగరాల్లోని రైతులు నేల విడిచి చేస్తున్న సాగు అదే హైడ్రోపోనిక్స్ వ్యవసాయం ఈ సాగు విధానం ఇప్పుడిప్పుడే భారత్‌లోనూ విస్తరిస్తోంది.
ఒకప్పుడు కొన్నిరకాల పండ్లను , కూరగాయలను , పూలను పొలాల్లో సాగు చేసేవారు. సాంకేతిక విజ్ఞానంలో పురోగతి కారణంగా అధిక ఆదాయం ఇచ్చే పండ్లను, కూరగాయలను, పూలను పాలీహౌస్‌లో సాగు చేసేవారు. అయితే ఇప్పుడు పాలీహౌస్ కంటే అధునాతన పద్ధతుల్లో కొన్నిరకాల కూరగాయలు, పూలు, పండ్లను సాగు చేస్తున్నారు. ఆ అధునాత పద్ధతుల్లో ప్రముఖమైంది హైడ్రోపోనిక్స్ సాగు.
గ్రీక్ బాషలో హైడ్రో అంటే నీరు పోనిక్ అంటే పనిచేయడం లేదా సాగు చేయడం అని అర్ధం. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మట్టి లేకుండా ఖనిజ పోషకాలను ఉపయోగించి మొక్కలను పెంచడమే ఈ హైడ్రోపోనిక్ సాగు విధానం. ఈ విధానాన్ని 1930 లో ప్రపంచ యుద్ధంలో సైనికులకు ఆహారం అందించడం కోసం రూపొందించారు. సాధారణ నేలల్లో పెరిగేమొక్కలు మట్టిలో నుంచి వాటికి కావాల్సిన పోషకాలను పీల్చుకుంటాయి. కానీ ఈ విధానంలో మట్టి బదులు ఒక జడ పదార్ధం ఉపయోగించి మొక్కకు కావాల్సిన పో షకాలను పోషక ద్రావణం ద్వారా మొక్కలకు అందిస్తారు.
హైడ్రోపోనిక్స్ ను ఆహారోత్పత్తికి ఒక ప్రత్యామ్నాయ మార్గంగా భావించవచ్చు. నేలలో సాగుతో పోల్చితే ఈ వధానం ద్వారా మంచి నాణ్యత, అధిక దిగుబడి గల పంటను పొందవచ్చు. సాధారణ పంట పండటానికి నేల వాతావరణం అనుకూలంగా లేని ప్రదేశాల్లో కూడా పంటలను పండించవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ విధానం ద్వారా పూలు, కూరగాయల సాగు జోరుగా ఊపందుకుంటుంది.
హైడ్రోపోనిక్స్ వల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు ఉంటాయి. అందులో మొదటిది అధిక పంట దిగుబడి కాగా రెండోది సాధారణ వ్యవసాయం సాధ్యం కాని చోట ఈ విధానం అనుసరించి పంటను పొందడం. ఇవే కాకుండా సాధారణ సాగుతో పోల్చితే ఇంకా కొన్ని అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. నేలలో పండిన అదే మొత్తం పంటను ఈ విధానంలో చాలా తక్కువ విస్తీర్ణంలో పొందవచ్చు. ఇందులో మొక్క వేర్లకు యాంత్రిక అడ్డు లేకపోవడం, మొక్కకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభించడం, మొక్కకు కావాల్సిన కాంతిని కృత్రిమంగా లైట్ల ద్వారా అందించడం వల్ల మొక్క వేగంగా పెరిగి తక్కువ వ్యవధిలోనే చేతికి అందుతుంది.
తక్కువ శ్రమ , యాజమాన్య పద్ధుతులు తక్కువగా ఉండటం, నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం మొత్తం యాంత్రీకరించడం వల్ల సాగు పనులు సులువుగా చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నీటి పొదుపు కూడా ఎక్కువవుతుంది. సాధారణ పొలంలో సాగుకయ్యే నీటిలో 20వ వంతు నీటితోనే సాగు చేసుకుని నీటిని ఆదా చేసుకోవచ్చు. ఈ విధానంలో పోషక ద్రావణాన్ని పునర్వినియోగించుకోవడం వల్ల నేల కాలుష్యం అరికట్టి సాగు వ్యయాన్ని తగ్గించుకుని నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు కలుపు సమస్యను కూడా అరికట్టవచ్చు. సాధారణంగా అసలు కలుపు అనేది ఉండదు.
చీడపీడలు, ఇతర వ్యాధులు బెడద ఈ పద్ధతి సాగులో చాలా అరుదు. వచ్చినా సులభంగా నియంత్రించవచ్చు. వేరువ్యవస్థ, ఉష్ణోగ్రత, తేమశాతం, వెలుతురు శాతం మార్చుకోవడానికి వీలుగా ఉండటం వల్ల మొక్క వేరువ్యవస్థ మీద ఎక్కువ పట్టు సాధించవచ్చు. సాధారణ పొలం సాగుతో పోలిస్తే ఇందులో మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండటం, మొక్క కాల వ్యవధి తక్కువగా ఉండటం వల్ల అధిక దిగుబడిని పొందవచ్చు. బయటి వాతావరణంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా సాగు చేయడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చు. దుమ్ము, ధూళి, వాసన లేని అత్యధిక నాణ్యమైన పంటను పొందవచ్చు.
హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మొక్కకు పోషకాలను ఏ విధంగా అందిస్తారు.? పంటకు అవసరమైన ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం ఏమిటి? వాయు ప్రసరణ ఏవిధంగా ఉండాలి?
హైడ్రోపోనిక్ విధానంలో మట్టి వాడకం ఉండదు కాబట్టి పోషక ద్రావణంలో మొక్కలు కొట్టుకుని వెళ‌్లకుండా ఒక ఊతంలా ఉండడానికి ఒక జడ పదార్ధం అవసరం ఉంటుంది. మనం సాగు చేసే పంటను బట్టి రాక్ పూల్ , పెర్లైట్, వెర్మికులైట్, ఇసుక మొదలైన వాటిని ఎంచుకోవచ్చు
మొక్కకు కావాల్సిన పోషకాలను ద్రవరూపంలో మొక్క వేర్లకు అందిస్తాం. ఈ పోషక ద్రావణం మనం ఎంచుకున్న పంటను బట్టి ఉంటుంది. కూరగాయలకు ఒక విధంగా, పూలకు ఒక విధంగా, పూలలో గులాబీలకు ఒక మోతాదులో, చామంతులకు ఒక మోతాదులో పోషక ద్రవణం అందించాలి.
సాగు కోసం ఎంచుకున్న పంటకు అవసరమైన ఉష్ణోగ్రతను సమయానుసారంగా హెచ్చుతగ్గులు లేకుండా పాటించాలి. తద్వారా మంచి దిగుబడిని అనుకున్న సమయానికి పొందవచ్చు. సాగుకు ముందు మనం ఎంచుకున్న పంట సాగుకు అనువైన పగటి, రాత్రి ఉష్ణోగ్రత, దానిని నియంత్రించే విధానం గురించి తెలుసుకోవడం తప్పనిసరి.
హైడ్రోపోనిక్స్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న ప్రదేశంలో వాయు ప్రసరణ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా మొక్కలకు చీడపీడలు ఆశించకుండా మంచి దిగుబడిని పొందవచ్చు. ఈ విధానంలో మొక్క వేరుచుట్టూ నిరంతరం పోషక ద్రావణం ప్రసరణ ఉండాలి. కాబట్టి దానికి సంబంధించిన మోటార్లు, పైపులు, ఉదజని శాతం మొదలైన వాటిని కొలిచే పరికరాలు, ఇతర ఎరువులన్నింటిని దగ్గర ఉంచుకోవాలి.
హైడ్రోపోనిక్స్ సాగు విధానంలో నీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సాగుకు అవసరమైన నీటిని తగిన మోతాదులో నిల్వ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడా నీటి నాణ్యత చాలా ముఖ్యం. హైడ్రోపోనిక్స్ సాగులో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుతున్న పదార్థం రాక్ వూల్, ఈ పదార్థం సురక్షితం. క్యాన్సర్ కలిగించే గుణాలు ఏమీ లేకపోవడంతో సమర్థమైన పదార్థంగా నిరూపొతమైంది. దీంతోపాటు పెర్లైట్, వెర్మిక్యూలైట్, ఇసుక, కొబ్బరిపీచు కూడా వాడవచ్చు. హైడ్రోపోనిక్స్ సాగును పెద్ద ఎత్తున చేస్తున్న రైతులు కొబ్బరిపీచును వాడి మంచి దిగుబడిని పొందుతున్నారు .
హైడ్రోపోనిక్స్ పద్ధతిలో మట్టి లేకుండా సాగు చేయడం వల్ల ఆహారోత్పత్తుల కొరత తీరడమే కాకుండా తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు. ఈ విధానంలో మొక్కలు 20 నుంచి 50 శాతం వేగంగా పెరుగుతాయి. హైడ్రోపోనిక్స్‌లో అన్నీ మన ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి సీజన్, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా వివిధ రకాల పంటలను పండించుకోవచ్చు. మరి హైడ్రోపోనిక్స్ లోనూ సుమారు ఆరు పద్ధతుల్లో పంటల సాగు చేసుకోవచ్చు. మనం సాగు చేయాలనుకున్న పంట, విస్తీర్ణం, సాగు ప్రదేశాన్ని బట్టి ఏదో ఒక పద్ధతిని ఎన్నుకోవచ్చు.
మట్టి లేకుండా మొక్కల్ని పెంచవచ్చని పదహారో శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే ప్రయోగశాలలకే పరిమితమైన ఈ పరిశోధనని పంట పొలాలవరకూ తీసుకురావడం కొంతకాలంక్రితం మాత్రమే మొదలైంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో రైతులు ఈ విధానంలో కూరగాయల్నీ ఆకుకూరల్నీ పండిస్తున్నారు. పండ్లతోటల్నీ సాగుచేస్తున్నారు. ఆ స్ఫూర్తితోనే మనదేశంలోనూ పలువురు విద్యావంతులు గత కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. కొందరు వ్యాపారస్థాయిలో పనిముట్లను తయారుచేసి విక్రయించడమూ, ఆసక్తి కలవారికి శిక్షణ ఇవ్వడమూ ప్రారంభించడంతో ఇప్పుడు ఔత్సాహికులు చాలామంది హైడ్రోపోనిక్స్ బాటపడుతున్నారు.
ఒక్క అమెరికాలోనే దాదాపు 10 లక్షలమంది ఇళ్లలో హైడ్రోపోనిక్స్ సాగుచేస్తున్నారని అంచనా. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవలే ఒక హైడ్రోపోనిక్ ఫార్మ్ ప్రారంభమైంది. ఆటోమేటెడ్ విధానంలో నిర్మించిన ఈ ఫార్మ్‌లో 15 మంది మాత్రమే సిబ్బంది ఉంటారు. మిగిలిన పని అంతా రోబోలే చేస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోపోనిక్ ఫార్మ్ నిర్మాణాన్ని దుబాయ్‌లో ప్రారంభించారు. 900 ఎకరాల ఈ ఫార్మ్‌లో రోజుకు 5.3 టన్నుల కూరగాయలు పండించనున్నారు. ఇందులో 100 చదరపు అడుగుల వైశాల్యంలో 320 గేలన్ల నీటితో పండించే పంటకు సంప్రదాయ సేద్యంలో అయితే 8,27,640 చదరపు అడుగుల నేలా 2,50,000 గేలన్ల నీరూ అవసరమవుతాయని అంచనా.
హైడ్రోపోనిక్స్ లోనూ సుమారు ఆరు పద్ధతుల్లో పంటల సాగు చేసుకోవచ్చు అందులో మొదటిది విక్ విధానం. ఇది చాలా సులభమైంది. తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ విధానంలో మొక్క వేర్లకు పోషక ద్రావణం అందించడానికి ఎలాంటి మోటార్లు వాడరు. ద్రవాన్ని పీల్చుకుని వేరువ్యవస్థకు అందించే పొడవాటి గొట్టాలను ఉపయోగిస్తారు. పోషకాలు, తేమ తక్కువ అవసరమయ్యే చిన్న చిన్న మొక్కలకు ఈ విధానం బాగా పనిచేస్తుంది.
ఇక రెండవది ఎబ్ అండ్ ఫ్లో ఈ విధారంలో ద్రావణ ట్యాంక్ లో ఒక పంపును ఉంచి దాని ద్వారా మొక్కలకు ద్రావణం సరఫరా చేసి మళ్లీ వాడిన ద్రావణాన్ని తిరిగి ట్యాంక్‌లోకి మళ్లిస్తారు. ఇది ఒక టైమర్‌ను ఉపయోగించి చేసే నిరంతర ప్రక్రియ. ఇక మూడవది న్యూట్రియంట్ ఫిల్మ్ హైడ్రోపోనిక్స్ విధానాల్లో ఇది ఎంతో ముఖ్యమైంది. ప్రపంచ వ్యవప్తంగా శాస్త్రీయంగా దీనిని పాటిస్తున్నారు. ఈ విధానంలో మొక్క వేర్లను ఒక ట్రేలో వేలాడదీసి వేర్లచుట్టూ నిరంతరం పోషక ద్రావణం ప్రసరణ జరిగేలా చూస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇందులో టైమర్ల వాడకం ఉండదు.
డ్రిప్ విధానంలో మొక్కలను జడ పదార్థంతో నింపిన బెడ్లలో ఉంచి సాధారణ డ్రిప్ విధానం ద్వారా పోషక ద్రవాన్ని మొక్కవేర్లకు అందే విధంగా చేస్తారు. ఈ విధానం భారీ ఎత్తున సాగు చేయాలనుకునే వారికి ఎంతో అనుకూలం. గ్రోబ్యాగ్ విధానం ఇటీవల కాలంలో బాగా ప్రాచూర్యంలో ఉంది. ఇందులో మొక్కలను గ్రోబ్యాగ్స్ లో పాతుకుని వాటికి కావాల్సిన ద్రవాన్ని డ్రిప్ ద్వారా అందిస్తారు. ఈ విధానం ద్వారా సాగుకు ఎక్కువ స్థలం లేని చోట పరిమిత స్థలంలో ఇంటి పైకప్పు మీద మొక్కలను పెంచవచ్చు. రాక్‌పూల్ విధానంలో మొక్కలను హార్టికల్చర్ గ్రేడ్ రాక్‌పూల్ బ్లాక్‌లలో పెంచి వాటికి పైపుల ద్వారా పోషక ద్రావణాన్ని అందిస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రీయంగా సాగులో ఉన్న హైడ్రోపోనిక్స్ విధానం.
హైడ్రోపోనిక్స్ సాగు ద్వారా ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, పూల సాగును చేయవచ్చు. పండ్ల మొక్కల్లో స్ట్రాబెర్రీ, కూరగాయల్లో టమాటో, మిర్చి, వంగ, బీట్‌రూట్, క్యాబేజీ, ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, లెట్యూస్, పూల మొక్కల్లో బంతి , గులాబీ, కర్నేషన్, చామంతి , జిప్సోఫిల్ల ,లిల్లీ, వంటి వాటితో పాటు పశుగ్రాసాలను కూడా సాగు చేసుకోవచ్చు.
సంప్రదాయ వ్యవసాయంతో పోల్చితే హైడ్రోపోనిక్స్ సాగుతో ఎన్నో విశేషాలు, లాభాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అందుల ముఖ్యంగా దీని ఏర్పాటు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. సాగు చేసే వారికీ దీని గురించి ఎంతో పరిజ్ఞానం, నైపుణ్యం అవసరం. ఈ విధానంలో అన్ని మొక్కలకు ఒకే పోషకద్రావణం ప్రసరణ అవడం వల్ల కొన్ని అంటువ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిల్లో ఎంతో జాగ్రత్త వహించాలి. ఈ సాగులో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉండాలి.
రైతులు తరతరాలుగా ఒకే పొలంలో సాగు చేయడం వల్ల నేల నిస్సారమై దిగుబడిపై ప్రభావం చూపుతోంది. రసాయనాల ఎరువుల వాడకం వల్ల కూడా నేల కాలుష్యం పెరిగి భూమిలో సారం తగ్గిపోతోంది. అంతే కాదు పెరుగుతున్న పట్టణీకరణ వల్ల సాగులో ఉన్న భూమి క్రమంగా తగ్గుతోంది. ఇలాంటి సమయంలో రైతులు నూతన సాగు విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి పద్ధతుల్లో హైడ్రోపోనిక్స్ పద్ధతి ఒకటి. రైతులు సాగులో మూసదోరణిలో వెళ్లకుండా కొత్త విధానాలు పాటించి మంచి దిగుబడి, ఆదాయం పొందుతారని ఆశిద్దాం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire