ఒకప్పటి కరువు ప్రాంతంలో నేడు కాసుల పంటలు

Good Profits in Cocoa Farming in Madakasira
x

ఒకప్పటి కరవు ప్రాంతంలో నేడు కాసుల పంటలు

Highlights

Cocoa Cultivation: కరువు నేలలో కమర్షియల్ పంటలతో కాసులు కురిపిస్తున్నారు రైతులు.

Cocoa Cultivation: కరువు నేలలో కమర్షియల్ పంటలతో కాసులు కురిపిస్తున్నారు రైతులు. వినూత్న ఆలోచనలతో సాంప్రదాయ పంటలకు భిన్నంగా కొత్తరకాల వాణిజ్య పంటలు సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తోటి రైతులను వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపేలా ప్రేరణగా నిలుస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా రైతులు. వక్కలో అంతర పంటగా కోకో పండిస్తూఏడాదికి లక్ష రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతం, కర్ణాటక సరిహద్దులో ఉన్న శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మడకశిర. ఒకప్పుడు ఇక్కడి రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి పంటలు పండించేవారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు సరిగా పండక పోవడంతో , కరవు కోరల్లో చిక్కి సతమతమయ్యేవారు. సేద్యంలో నష్టాలు రైతు కుటుంబాలకు కన్నీళ్లే మిగిల్చేవి. కరవుతో పల్లెల్లో దుర్భిక్షం తాండవించేది. ఇక వ్యవసాయంతో ఒరిగేదేమి లేదనుకుని ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకొని పక్క రాష్ట్రాలకు తరలిపోయేవారు రైతులు. కానీ నూతన వ్యవసాయ పద్ధతులు, వాణిజ్య పంటలు ఆ రైతుల్లో మళ్లీ కొత్త ఆశలను తీసుకువచ్చాయి. వ్యవసాయ శాఖ అధికారుల చొరవతో నూతన సాగు విధానాలపై శిక్షణ తీసుకున్న సాగుదారులు వాణిజ్య పంటలు పండిస్తూ లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

రోళ్ల మండలం రత్నగిరి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ బీటెక్ చదివి బెంగుళూరులో ఉద్యోగం చేసేవాడు. అయితే అందులో సంతృప్తి లేకపోవడం కుటుంబానికి దూరంగా ఉండటం నచ్చక మళ్లీ స్వగ్రామానికి చేరుకున్నాడు. వాణిజ్య పంటల సాగులో మెళకువలను నేర్చుకుని తండ్రితో కలిసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. తమకున్న 3 ఎకరాల పొలం లో 1400 వక్క మొక్కలను నాటి అందులో అంతర పంటగా వాణిజ్య పంటైన కోకో మొక్కలను 400 నాటాడు. మొక్కలు నాటిన రెండున్న సంవత్సరం నుంచి దిగుబడి అందుతోందని రైతు చెబుతున్నాడు. కొద్దిపాటి నీటితో , ఏడాదికి 5 వేల రూపాయల ఖర్చుతో మంచి దిగుబడి అందుతోందని సాగు లాభదాయకంగా ఉందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

పంటను ఏడాదికి ఒకసారి ఏలూరు ప్రాంతంలోని మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నామని రైతు లోకేష్ తెలిపారు. పరిసర ప్రాంత రైతులు పెద్ద ఎత్తున వక్క పొలాల్లో అంతర పంటగా కోకో సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మరింత చొరవ చూపి ఇలాంటి వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించి తగిన సహాకారం అందిస్తే సాగులో అద్భుతాలు సాధిస్తామని రైతులు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories