అంతులేని ఆత్మవిశ్వాసం అతని సొంతం

అంతులేని ఆత్మవిశ్వాసం అతని సొంతం
x
Highlights

అప్పుల బాధతాలతోనే లేక. వ్యవసాయంలో నష్టం వచ్చిందనో వేసిన బోర్లలో నీరు రాలేదనో ఎందరో రైతులు తమ తనువు చాలిస్తున్న రోజులివి అలాంటి వారకి స్పూర్తిగా...

అప్పుల బాధతాలతోనే లేక. వ్యవసాయంలో నష్టం వచ్చిందనో వేసిన బోర్లలో నీరు రాలేదనో ఎందరో రైతులు తమ తనువు చాలిస్తున్న రోజులివి అలాంటి వారకి స్పూర్తిగా నిలుస్తున్నాడు ఈ రైతు. అంగవైకల్యం అతడిని వెక్కిరించినా తోటి వారు అతనిని సూటిపోటి మాటలతో వేధించినా అవేమీ పట్టించుకోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా సేద్యం చేస్తూ సాఫీగా జీవనం సాగిస్తున్నాడు అంతులేని ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన ఆదర్శ రైతు వెంకటేశ్వరరెడ్డి విజయగాథను తెలుసుకుందాం.

దేశంలోని రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతు వెంకటేశ్వరరెడ్డి. ఆయన చేసిన గొప్పేమిటి అతను సాధించిన విజయమేమిటనేగా మీ ఆలోచన అతను వైకల్యాన్ని జయించాడు. రైతు వైఫల్యాలను అధిగమించాడు అంగవైకల్యం ఉందనే బాధ లేకుండా కెరటంలా సాగులో ముందుకు సాగుతున్నాడు. కష్టనష్టాలు వచ్చాయి ఆర్ధికంగా చితికిపోయామని తోటి రైతుల్లా తనవు చాలించలేదు ఎంతటి విపత్కరపరిస్థితులనైనా సరే గుండె ధైర్యంతో ఎదురించవచ్చని నిరూపించాడు.

చిత్తూరు జిల్లా కెవి పల్లె మండలంలోని మంచాల మంద ఓ చిన్న గ్రామం. కడప జిల్లాకు సరిహద్దు గ్రామం ఇది. చుట్టూ కొండలు, పచ్చని నేల. పదిహేనేళ్ల క్రితం వరకు విద్యుత్‌ సరఫరా కూడా లేని గ్రామమది. ఒకప్పుడు అన్నలకు నెలవైన ప్రాంతమిది. ఈ ప్రాంతానికి చెందిన రైతే వెంకటేశ్వరరెడ్డి.

రైతు వెంకటేశ్వర రెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నాడు. వ్యవసాయం చేయడం తప్ప మరేమీ తెలియదు. అయితే ఆర్ధిక పరిస్థితుల దృష్ట్య తెలిసిన వారి సాయంతో కొన్నాళ్లు ప్రైవేటు జాబ్ చేసాడు అప్పట్లో తనకున్న భూమితో పాటు మరికొంత భూమిని కొనుగోలు చేశాడు. తమ్ముడు సీఏ చదవాలన్న బలమైన ఆకాంక్షలకు వెన్నుదన్నుగా నిలిచాడు. ఆ తరువాత చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టి వ్యవసాయం వైపుకే వచ్చాడు. అప్పట్లో వ్యవసాయంలో గిట్టుబాటు కాలేదు. దీంతో సొంతంగా ఓ ఆటో కొనుగోలు చేసి తిరుపతి చేరాడు. అక్కడా అంతో ఇంతో సంపాయించాడు. కానీ పొలం మీద మక్కువ అతన్ని లాగుతోంది. వ్యవసాయం చేయాలన్న తపన అతన్ని వెంటాడుతూనే ఉంది. దీంతో తిరిగి వ్యవసాయం చేయడానికి సొంతూరొచ్చాడు. భార్య, పిల్లలు, కుటుంబం, పొలం ఇదే అతని ప్రపంచంగా మారింది.

ఇంత వరకు బాగానే ఉన్నా ఆ తరువాత జరిగిన ప్రమాదం రైతును కోలుకోలేని విధంగా కాటేసింది. పొలం పనుల్లో భాగంగా తన పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్‌తో వెంకటేశ్వరరెడ్డి కాలిపోయాడు. అయితే ఇతనిది మొండి ప్రాణం . శరీరం మొత్తం కాలిపోయినా అతని గుండె ధైర్యం ఎంతో గొప్పది అందుకే అంతటి ప్రమాదం ఏర్పడినా ప్రాణాలతో బయటపడ్డాడు కానీ జరిగిన ఈ ప్రమాదంలో అతని రెండు చేతులు కోల్పోయాడు.

ఉన్నది చిన్న గ్రామం ఆదాయం లేని పొలం అయినా అప్పులు చేశారు. ఇంట్లో బంగారం మొదలు, పశువులు వరకు అన్నీ అమ్మేసి వెంకటేశ్వర రెడ్డి ఆసుపత్రి బిల్లులు కట్టారు. అసలే కుంగిపోయిన వెంకటేశ్వర రెడ్డికి ఈ మద్యలో ఎన్నో అవమానాలు వచ్చిన వారి జాలి చూపులతో పాటు సూటిపోటి మాటలు ఇవేమీ అతన్ని కృంగదీయలేదు. మానసిక స్థితిని సడలనివ్వలేదు. మొండి వాడిగా మార్చింది. పట్టుదలను రెట్టించేలా చేసింది. కన్నబిడ్డలకు, కట్టుకున్న భార్యకు, కన్నవారికి, ఐనవారికి భారంగా కాకుండా బాధ్యుడుగా నిలవాలనుకున్నాడు. కసితో పని రాక్షసుడుగా మారాడు. చేతులు లేకపోయినా ట్రాక్టర్ స్టీరింగ్ పట్టాడు. కాలితో గేర్లు మార్చి, వైద్యులు తీసివేయగా మిగిలిన మొండి చేతులతో ట్రాక్టర్ నడుపడం మొదలు పెట్టాడు. దుక్కి దున్నుతాడు, ఇతరుల పొలాల దున్నడానికి వెళ్ళి అంతో ఇంతో సంపాదిస్తాడు.

రెండు చేతులూ లేకున్నా తానే సొంతంగా వ్యవసాయం చేస్తున్నాడు వెంకటేశ్వర రెడ్డి. ట్రాక్టరెక్కి పొలం దున్నుతాడు పదెకరాలలో చుట్టుపక్కల ఏ రైతూ పండించలేని విధంగా ఆదర్శవంతంగా వ్యవసాయం చేస్తున్నారు.

ఉన్నది భుజానికి వేలాడుతూ కనిపించే ఒక మొండి చేయ్యే అయినా పొలానికి నీళ్లు పెడతాడు. ఒక్క మనిషి తోడుంటే చాలు అన్ని పనులూ చేసేసుకుంటాడు. కొండలు గుట్టలుగా ఉన్న భూమిని చదును చేసి వ్యవసాయం చేస్తున్నాడు. 2012వ సంవత్సరంలో ప్రమాదం జరిగింది. అతను కోలుకోవడానికి నాలుగేళ్ళు పట్టింది. మరో ఏడాది అతను నిలదొక్కుకోవడానికి పట్టింది. రెండేళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఉన్న పదెకరాల పొలంలో రకరకాల పంటలు సాగు చేస్తున్నాడు. అన్నీ బాగున్న రైతులు సైతం ఔరా అనేలా పంట సాగు చేస్తున్నాడు.

పొలంలో రెండు బోర్లు వేశాడు. పంట సంజీవని కుంటలు ఏర్పాటు చేసుకున్నాడు. బోర్లు ఎండిపోతే తనకున్న తెలివితేటలతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి బోర్లలో నింపి అందులోంచి నీటిని మళ్ళీ పొలాలకు మళ్ళించే వాడు. ఇలా పైరును కన్నబిడ్డల్లా కాపాడుతూ సాగు చేశాడు. ఏడెకరాల పొలంలో 240బస్తాల వేరుశెనగ పండించాడు. లాభాలమాట ఎలా ఉన్నా దిగుమడి మాత్రం ఘనంగా తీస్తున్నాడు. తనకున్న మామిడి తోటకు డ్రిప్ సిస్టమ్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నాడు.

వరి, టమోటా, వంకాయ, వేరుశెనగ ఇలా అన్ని పంటలూ పండించి శభాష్ అనిపించుకుంటున్నాడు ఈ రైతు. తనకోసం అమ్మేసిన పశువుల స్థానంలో మరికొన్ని పశువులను కొనుగోలు చేసి వాటి ద్వారా కూడా అంతో ఇంతో కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. పేరుకు ఆ కుటుంబంలో అతను అవిటి వాడైనా అన్నీ తానై నడిపిస్తున్నాడు. వ్యవసాయంలో లాభాలు లేకపోయినా ప్రాణాలు వదులుకోవాల్సిన అవసరం లేదని నేలతల్లిని నమ్ముకున్న వాడు ఎన్నడూ చెడిపోడని తోటి రైతులకు సూచిస్తున్నాడు. అధైర్యం మనిషిని కృంగదీస్తుందంటున్న వెంకటేశ్వర రెడ్డి అలియాస్ బాబూ తన కోసం ఓ ట్యాగ్ లైన్ కూడా రాసుకున్నాడు. బార్న్ టు విన్, బట్ నాట్ టు ఫెయిల్ అని నమ్ముతున్నాడు. తనకున్న ట్రాక్టర్ పై కూడా రాసుకున్నాడు.

చిన్నపాటి సాయం అందిస్తే తాను అద్భుతాలే చేయగలనంటున్నాడు ఈ రైతు. తనకో ట్రాక్టర్, దానికి కొన్ని పనిముట్లు కొంత ఆర్థిక సాయం అందిస్తే అప్పులు తీర్చుకుంటానంటున్నాడు. తాను ఇలా కాదు ఎలా ఉన్నా వ్యవసాయమే చేస్తానని ధీమాగా ఉన్నాడు. పులి ఎంత ఆకలిగా ఉన్నా గడ్డి తినదు అలాగే రైతు భూమిని వదులుకోకూడదు అంటున్నాడు. తన కోసం అన్ని వదులుకుని సేవలందిస్తున్న తన భార్యకు మాత్రం ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటే బాగుంటుందని కోరుతున్నాడు. పిల్లల చదువులకు ఆమె ఆసరాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories