యువతకు ఆదర్శంగా నిలుస్తున్న గోపీ రాజా

యువతకు ఆదర్శంగా నిలుస్తున్న గోపీ రాజా
x
Highlights

వ్యవసాయంలో రసాయనాలు రాజ్యమేలుతున్నాయి రైతుల ప్రాణాలను హరింపజేస్తున్నాయి. పచ్చటి పంటలు పండించి వాటిని వినియోగదారునికి అందించే క్రమంలో రైతు తన...

వ్యవసాయంలో రసాయనాలు రాజ్యమేలుతున్నాయి రైతుల ప్రాణాలను హరింపజేస్తున్నాయి. పచ్చటి పంటలు పండించి వాటిని వినియోగదారునికి అందించే క్రమంలో రైతు తన ఆరోగ్యాన్నే పనంగా పెడుతున్నాడు. గుప్పెడు మెతుకులు పండించేందుకు రైతు తన ప్రాణాలతోనే చలగాటం ఆడుతున్నాడు అలా నిత్యం సాగులో కెమికల్స్ కారణంగా తన తండ్రి పడుతున్న బాధను చూసి తట్టుకోలేని ఓ తనయుడు ఓ కొత్త టెక్నాలజీని అందరి రైతుల ముందుంచాడు ఎరువుల పిచికారీ కోసం డ్రోన్ టెక్నాలజీని రైతుకు అందుబాటులోకి తీసుకొచ్చాడు 26 ఏళ్ళ గోపి రాజా సృష్టించిన డ్రోన్ టెక్నాజీ పై ప్రత్యేక కథనం.

సాగులో తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు ఓ కొడుకు. తన తండ్రే కాదు అందరి కడుపులు నింపుతున్న అన్నదాతలు ఆ కష్టం పడకూడదనుకున్నాడు. రాత్రనక, పగలనక శ్రమించి పంటలకు చిటికెలో రసాయనాలు పిచికారీ చేసే డ్రోన్‌కు రూపకల్పన చేసాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన గోపి రాజా

మద్దతు ధరతో పాటు కూలీల సమస్యలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి. నారుమళ్లు నాటడం, పురుగుల మందు పిచికారీ,కోతలతో పాటు ప్రతి చిన్న విషయానికి కూలీల మీద ఆధారపడాల్సి వస్తున్నది. పురుగుల మందు పిచికారీ చేయాలంటే కూలీలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఎకరం పొలానికి పురుగుల మందు పిచికారీ చేయాలంటే కూలీలకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాజా రూపొందించిన డ్రోన్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ డ్రోన్‌తో కేవలం పది నిముషాల్లో ఎకరం పొలానికి పురుగుల మందు చల్లవచ్చు. రోజుకు 30 ఎకరాల పంటకు డ్రోన్‌ ద్వారా పురుగుల మందు పిచికారీ చేసే వీలుంది.

డ్రోన్‌ సాయంతో, ఎలాంటి ప్రమాదం లేకుండా రైతులు పురుగుల మందును పిచికారీ చేసుకోవచ్చు. రైతుల అవసరాన్ని బట్టి వివిధ సామర్థ్యాలు కలిగిన డ్రోన్‌లను రూపొందించారు రాజా. ఇంటినే కార్యాలయంగా మలుచుకుని ఓ సంస్థను ఏర్పాటుచేసి చిన్న, సన్నకారు రైతులకు డ్రోన్‌ సేవలు అందిస్తున్నాడు. పలువురు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నాడు.

డ్రోన్‌ ద్వారా పురుగుల మందు పిచికారీ విధానాన్ని రైతులకు మరింత చేరువ చేయాలంటున్నాడు రాజా. ప్రస్తుతం ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటుందో అదే విధంగా 2028 నాటికి ప్రతి రైతు కుటుంబంలో డ్రోన్‌ ఉండే విధంగా చేయడమే తన ప్రధాన లక్ష్యం అని అంటున్నాడు. యువతకు కూడా ఈ టెక్నాలజీని నేర్పించేందుకు డ్రోన్ పైలటింగ్ పై శిక్షణను అందిస్తున్నానంటున్నాడు ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదించవచ్చంటున్నాడు.

మొక్కజొన్న పంటను దెబ్బతీస్తున్న కత్తెర పురుగు పాలిట డ్రోన్‌ యమకింకరుడిగా మారింది. ఒక్క మొక్కజొన్న పంటలోనే కాదు వరి, చెరకు, కొబ్బరితోటలు, అరటి, పామాయిల్‌, మామిడి, బత్తాయి ఇలా ఎంత ఎత్తైన పంటలకు పట్టిన పురుగులనైనా తరిమికొట్టడంలో ఈ డ్రోన్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. డ్రోన్ ద్వారా రైతుకు ఎంతో మేలు జరుగుతుంది.

కృషి, పట్టుదలకి నిలువెత్తు నిదర్శనం గోపి రాజా. ఇంజినీరింగ్‌ పట్టా అందుకోగానే అందరిలా ఉద్యోగం వైపు అడుగులు వేయకుండా సాగులో తన తండ్రి కష్టాన్ని చూసి పరిశోధనలవైపు మళ్లాడు. రేయింబవళ్లు శ్రమించి డ్రోన్ల తయారీలో విజయంసాధించాడు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories