Dragon Fruit Farming: బిడ్డ అనారోగ్యం.. డ్రాగన్ పండ్ల సాగుకు శ్రీకారం

Dragon Fruit Farming in Telugu BY Saidulu Goud
x

Dragon Fruit Farming: బిడ్డ అనారోగ్యం.. డ్రాగన్ పండ్ల సాగుకు శ్రీకారం

Highlights

Dragon Fruit Farming: తన బిడ్డకు డెంగ్యూ వచ్చింది చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు.

Dragon Fruit Farming: తన బిడ్డకు డెంగ్యూ వచ్చింది చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. ప్లేట్ లెట్స్ పెరగాలంటే డ్రాగన్ ప్రూట్ తినాలని వైద్యులు సూచించారు. నిజంగా డ్రాగన్ ప్రూట్ లో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా.? ఈ పండుకు ఎందుకు అంత డిమాండ్ ఉంది. మనదగ్గర ఎందుకు దొరకడం లేదు దొరికినా ఎందుకు అంత ధర పలుకుతోంది అన్న ప్రశ్నలు నల్గొండ జిల్లాకు చెందిన యువరైతు తండు సైదులు మెదడులో మెదిలాయి. దీంతో ఓవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు తన బిడ్డ కోసం డ్రాగన్ ప్రూట్ పండించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా డ్రాగన్ ప్రూట్ సాగు మొదలుపెట్టాడు. ఈ పండులోని పోషకాలను సంపూర్ణంగా పొందాలన్న ఉద్దేశంతో పూర్తి సేంద్రియ విధానాలనే అనుసరించాడు. తన కుటుంబ అవసరం కోసం ప్రారంభించిన ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు నేడు రైతుకు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జించిపెడుతోంది.

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన తండు సైదులు గౌడ్ ఓ రాజకీయవేత్త. మాజీ జడ్పీటిసి అయిన సైదులు ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలక పాత్రను పోషిస్తూనే మరోవైపు వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండ్ల సాగు చేస్తున్నాడు. గతంలో తన బిడ్డకు డెంగ్యూ వచ్చింది చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు సైదులు. ప్లేట్ లెట్స్ పెరగాలంటే డ్రాగన్ ప్రూట్ తినాలని వైద్యులు సూచించారు. దీంతో ఈ పండులోని పోషకాల స్థాయిలను తెలుసుకుని, మార్కెట్ లో దీనికున్న డిమాండ్ ను గుర్తించి తన క్షేత్రంలోనే తన చేతులతోనే సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.

అద్దంకి జాతీయ రహదారి పక్కనే తండు సైదులుకు దాదాపు 50 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నా రైతుకు అంతంత మాత్రంగానే లాభాలు అందివచ్చేవి. దానికి కారణం రసాయనాల సేద్యమేనని గుర్తించిన ఈ యువరైతు సేంద్రియ సేద్యంపై దృష్టి సారించాడు. ఐదెకరాలు మినహా మిగతా భూమిలో శ్రీగంధం, ఎర్రచందనం, బత్తాయి, మామిడి వంటి పంటలను సేంద్రియ విధానంలోనే పండిస్తున్నాడు. ఈ క్రమంలో మిగిలి ఉన్న ఐదు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా విదేశీ పంటైన డ్రాగన్ ఫ్రూట్ సాగు మొదలు పెట్టాడు.

గుంటూరు వివిధ ప్రాంతాల నుంచి నారు మొక్కలను కొనుగోలు చేశాడు సైదులు. ఒక్కో మొక్కను 60 రూపాయలకు కొనుగోలు చేశాడు. ఎకరాకు 400 సిమెంట్ పోల్స్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో పోల్ కు నాలుగు మొక్కలు నాటుకున్నాడు. అలా ఎకరం విస్తీర్ణంలో 1600 మొక్కలు నాటాడు. ఒక్కో పోల్ ఖరీదు 300 రూపాయలు ఉంటుందని రైతు చెబుతున్నాడు. నీరు అందించేందుకు డ్రిప్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా ఆధునక సాగు పద్ధతులకు, మొక్కలకు సిమెంట్ పోల్స్ కు అన్నింటికి కలిపి ఎకరాకు 4నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతోందని రైతు తెలిపాడు. అంత ఖర్చు చేసినా పంట నుంచి వచ్చే ఫలాలు సిరులు కురిపిస్తున్నాయని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు. వరి, పత్తి వంటి పంటలు వేసి నష్టాలను చవిచూసేకంటే మార్కెట్ లో డిమాండ్ ఉన్న ఇలాంటి పండ్లను సాగు చేసుకుంటే ప్రతి రైతు తప్పక లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చని సూచిస్తున్నాడు సైదులు.

చౌడు నేలలు తప్ప అన్ని నేలల్లో డ్రాగన్ ప్రూట్ సాగవుతుంది. చీడపీడల బెడద పెద్దగా ఉండదు. తక్కువ నీటితోనే పంటను సాగు చేసుకోవచ్చు. ఒకసారి పంట వేస్తే సుమారు 30 ఏళ్ల వరకు పంట వస్తుందని ఈ యువరైతు చెబుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతున్న పండ్లను రసాయనాల ద్వారా పండిస్తున్నారని అందుకే పండ్ల పరిమాణం పెద్దదిగా ఉంటుందంటున్నాడు సైదులు. తన తోటలో చిన్నసైజులో పండ్లు వచ్చినా వాటి రుచి అద్భతంగా , పోషకాలు పుష్కలంగా లభిస్తాయంటున్నాడు. అందుకు కారణం సేంద్రియ విధానంలో పంటను సాగు చేయడమేనని సైదులు తెలిపాడు. సేంద్రియ విధానాలను అనసరిస్తుండటం వల్లనే తన తోటలో కాసిన పండ్లకు మంచి డిమాండ్ వస్తోందంటున్నాడు ఈ రైతు.

గతేడాది డ్రాగన్ సాగు మొదలుపెట్టాగా ఏడాది తిరిగేలోపే పండ్లు చేతికొచ్చాయి. ప్రస్తుతం రోజుకు టన్నుకు పైగా డ్రాగన్ పండ్లను రైతు విక్రయిస్తున్నాడు. పండ్లను అమ్మేందుకు ఎక్కడికో పట్నానికి పోవడం లేదు ఈ యువరైతు. తన పొలం పక్కనే ఉన్న రహదారిపైనే ఓ చిన్న బల్లను ఏర్పాటు చేసుకుని అమ్ముతున్నాడు. అటుగా వేళ్లే ప్రయాణికులు పండ్ల గురించి తెలుసుకుని వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలకే పంటంతా అమ్ముడుపోతోందని రైతు తండు సైదులు గౌడ్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. బత్తాయి సాగులో ఎకరాకు 50 వేలు మించి ఆదాయం లేదని. కానీ డ్రాగన్ సాగులో ఏడాదిలోనే 3 లక్షల వరకు ఆదాయం అందివచ్చిందంటున్నాడు. జూన్ లో మొదలైన కాపు అక్టోబర్ వరకు ఉంటుందని తెలిపాడు. లాభాల మాట అటుంచితే తమ కుటుంబంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన పండ్లను అందించాలన్నదే తన అసలు ఉద్దేశమంట్టున్నాడు సైదులు.

చూసారు కదా ఓవైపు రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే మరోవైపు డ్రాగన్ పంటను సాగు చేసి లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నాడు యువ రైతు తండు సైదులు గౌడ్. యువ రైతులు ,సన్న చిన్న కారు రైతులు సైతం నష్టాల సాగును వీడి కాస్త పెట్టుబడి పెట్టి లాభాలను అందించే డ్రాగన్ పండ్ల సాగు పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories