ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కోవిడ్ వైరస్.. అనంతలో లాభాలబాటలో మల్బరీసాగు

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కోవిడ్ వైరస్.. అనంతలో లాభాలబాటలో మల్బరీసాగు
x
Highlights

యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కోవిడ్ వైరస్ ఎన్నో రంగాలను దెబ్బతీస్తోంది. అయితే ఈ కోవిడ్‌ వైరస్‌తో అనంతపురం జిల్లాలో మల్బరీ సాగు లాభాలబాట పట్టింది....

యావత్ ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కోవిడ్ వైరస్ ఎన్నో రంగాలను దెబ్బతీస్తోంది. అయితే ఈ కోవిడ్‌ వైరస్‌తో అనంతపురం జిల్లాలో మల్బరీ సాగు లాభాలబాట పట్టింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ వైరస్‌ చైనా సిల్క్‌ దిగుమతులపై ప్రభావం చూపుతోంది. కొన్నేళ్లుగా పట్టురైతులను దెబ్బతీస్తున్న చైనా సిల్క్‌ దిగుమతుల తగ్గుదలతో స్వదేశీ సిల్క్‌ ధరలు పెరిగాయి. పట్టుగూళ్ల ధరలు పెరగడంతో రైతులకు కలిసి వస్తోంది. నెలరోజుల నుంచి క్రమంగా స్వదేశీ పట్టుకు డిమాండ్‌ పెరగడంతో పట్టుగూళ్ల మార్కెట్లో అదే స్థాయిలో ధరలు పెరుగుతున్నాయి.

అనంతపురం జిల్లా హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. అనంతపురం జిల్లాలో ప్రధానంగా హిందూపురం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు, ఉరవకొండ, కదిరి, పుట్టపర్తి సహా పలుప్రాంతాల్లో పెద్దఎత్తున మల్బరీ సాగు కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రముఖమైన పట్టుగూళ్ల మార్కెట్ అయిన హిందూపురంలో నిన్నటి వరకు ఆశించిన మేరకు ధరలు లేకపోవడంతో అంతంత మాత్రంగానే విక్రయాలు జరిగేవి. రైతులకు ఆశించిన మేరకు లాభాలు వచ్చేవికావు. కిలో పట్టుగూళ్ల ధర 200 నుంచి 300 రూపాయలు వచ్చేవి. ఆశించిన మేరకు డిమాండ్ లేకపోవడంతో పట్టు రైతులకు పెద్దగా లాభాలు వచ్చేవి కాదు.

సాధారణంగా కిలో బైవోల్టిన్‌ పట్టుగూళ్ల ధర సగటున 450 లోపు ఉండగా, ప్రస్తుతం కిలోపై 150కు పైగా ధర పెరిగింది. జనవరి నుంచి పట్టుగూళ్లు క్రమంగా పెరుగుతూ నాలుగు రోజుల కిందట బైవోల్టిన్‌ ధర గరిష్టంగా కిలో 613 పలికింది. దీంతో అటు రైతులు, ఇటు రీలర్లలో ఆనందం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పట్టుగూళ్ల మార్కెట్‌గా పేరొందిన హిందూపురంలో రోజుకు సగటున ఐదు టన్నుల పట్టుగూళ్లు వచ్చేవి. వారం నుంచి గూళ్ల రాక పెరిగి మంగళవారం ఏకంగా 11.6 టన్నులు వచ్చాయి. ఇందులో కూడా 99 శాతం బైవోల్టిన్‌ రకం పట్టుగూళ్లు వచ్చాయి. పట్టుగూళ్ల పెరుగుదలతో రైతుల్లో పట్టుపురుగుల పెంపకం మరింతగా ఉత్పత్తి చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాలో గత ఏడాది పెద్ద ఎత్తున వర్షాలు కురిసినప్పటికీ వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లలో నీళ్లు తగ్గుముఖం పట్టడంతో మల్బరీ సాగు విస్తీర్ణం తగ్గుతుంది. గతంలో నాలుగు ఎకరాలు సాగు చేస్తున్న రైతు రెండు ఎకరాలకు పరిమితమయ్యారు. హంద్రీనీవా నీటిని వినియోగించుకుని చెరువుల్లో భూగర్భ జలాలు ఇంకే విధంగా చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. చెరువుల్లో బోరు బావులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కోవిడ్‌ వైరస్ ప్రభావంతో చైనా సిల్క్ పూర్తిగా నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. పట్టుగూళ్ల ధరలు భారీగా పెరిగాయని పెరుగుదల ఇంకా కొనసాగుతుందంటున్నారు. సుమారు రెండు సంవత్సరాలు వరకు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో పట్టుగూళ్ల ధర పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వేసవిలో సాగునీటి సమస్యలతో ఇబ్బంది పడ్డ రైతులకు మార్కెట్లో ధరలు పెరగడం కొంత ఊరట నిస్తుంది. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకు రావాలని నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే మరింత లాభదాయకంగా ఉంటుందని రైతు సంఘం నేతలు రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories