Broccoli Cultivation: ఇటలీ పంటకు ఇక్కడ గిరాకీ.. కిలో ధర రూ.200..

Broccoli Cultivation Guide For Beginners
x

Broccoli Cultivation: ఇటలీ పంటకు ఇక్కడ గిరాకీ.. కిలో ధర రూ.200..

Highlights

Broccoli Cultivation: పోషక విలువల్లో మొదటి స్థానంలో ఉండే కూరగాయ మొక్క బ్రకోలి.

Broccoli Cultivation: పోషక విలువల్లో మొదటి స్థానంలో ఉండే కూరగాయ మొక్క బ్రకోలి. క్యాబేజి, కాలీఫ్లవర్ కుటుంబానికి చెందిన ఈ కూరగాయ ఇక్కడిది కాదు. ఇటలీ దేశానికి చెందినది. ఇందులో ఉండే ఔషధగుణాలు, పోషక విలువల దృష్ట్యా ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరుగుతోంది. పాత పద్ధతులను అనుసరిస్తూ నష్టపోయిన రైతులు మార్కెట్‌లో ఉన్న గిరాకీ ని గుర్తించి ఈ కొత్త పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో బ్రకోలి పంటను ఏ సీజన్‌లో సాగు చేసుకోవాలి? ఎలాంటి రకాలు ఎన్నుకోవాలి? నాటే విధానాలు, నీటి యాజమాన్య పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం.

క్యాబేజీ, కాలిఫ్లవర్ జాతికి చెందిన పంట బ్రకోలి. ఇతర దేశాల్లో ఈ పంటను ఏడాది పొడవునా సాగు చేసినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చలికాలం మాత్రమే బ్రకోలి సాగు చేయాలి. బ్రకోలిలో ఉన్న ఔషధ గునాల వల్ల ఈ మధ్యకాలంలో మార్కెట్ లో దీని గిరాకీ పెరిగింది. దీంతో రైతులు సైతం బ్రకోలి సాగు పైపు ఆసక్తి చూపుతున్నారు. బ్రకోలి చూడటానికి ఆకుపచ్చ రంగులో ఉండే పువ్వు. దీనిలో ఎన్నో పోషక విలువలున్నాయి. కాల్షియం, ఫొలేట్, బీటాకెరోటిన్, ఆంటీ యాక్సిడెంట్స్, క్యాన్సర్‌ను నిరోధించే గుణం ఉండటం వల్ల అమెరికా, యూరప్ లాంటి దేశాలలో దీనికి మంచి డిమాండ్ ఉంది. దీనిని సలాడ్, సూప్ గానే కాకుండా కూరగాను వండుకోవచ్చు.

బ్రకోలిలో ఊదా, తెలుపు, లేత, ముదురు ఆకుపచ్చరంగు పువ్వుగల రకాలు అందుబాటులో ఉన్నాయి. పూసా కె.టి.ఎస్‌-1. పలామ్‌ సమృద్ధి, పలామ్ విచిత్ర, పలామ్ కాంచన్‌, పంజాబ్ బ్రకోలి, ఇటాలియన్ గ్రీన్ రకాలు ఉన్నాయి. వీటిలో పూసా కె.టి.ఎస్‌-1 తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇసుకతో కూడిన బంక నేలలు బ్రకోలి సాగుచేసేందుకు అనుకూలం. పి.‍హెచ్‌. లెవల్ 5.5- 6.5 గల నేలలు అనుకూలం.

బ్రకోలి 12 నుంచి 18 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా మించితే పువ్వు సరిగా ఏర్పడదు. పెరిగే దశలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పూలు, కాండాల మధ్య ఎక్కువగా ఖాళీలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల నాణ్యత తగ్గిపోతుంది.

ఎకరాకు 120 నుంచి 160 గ్రాముల విత్తనం అవసరం. విత్తడానికి ముందు విత్తన శుద్ధి తప్పనిసరి. బాగా ఆరబెట్టిన తరువాతనే విత్తనాలను నారుమడిలో విత్తుకోవాలి. నారును ప్రోట్రేలలో పెంచితే నాణ్యమైన నారు వచ్చే అవకాశం ఉంటుంది. బ్రకోలి సాగు చేసుకోవాలనుకునే వారు విత్తనాన్ని నారుమడిలో ఆగస్టు నుంచి సెప్టెంబరు మాసాల్లో విత్తుకుని ఆ తరువాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. పొలాన్ని 3నుంచి 4 సార్లు బాగా దున్నుకోవాలి. దుక్కిలో 10 టన్నుల వరకు పశువుల ఎరువును వేసుకోవాలి. పచ్చిరొట్ట పైర్లను పెంచుకుని బాగా ఎదిగిన తరువాత పొలంలో కలియదున్నడం వల్ల నేలలో పోషకలోపోలు తొలగి సారం పెరుగుతుంది.

ఇలా నేలను బాగా చదును చేసిన తరువాత కాలువలు, బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. 30 నుంచి 40 రోజుల వయస్సుగల నారును పొలంలో నీరు పెట్టి నాటుకోవాలి. నాటేదూరం రకాన్ని బట్టి మారుతుంటుంది. స్వల్పకాలిక రకాలు 60 ఇంటు 30 లేదా 45 ఇంటు 45 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. మధ్యకాలిక రకాలు 60 ఇంటు 45 సెంటీమీటర్లు, దీర్ఘకాలిక రకాలు 60 ఇంటు 60 సెంటీమీటర్ల ఎడంతో బోదెల పక్కన నాటుకోవాలి.

బ్రకోలి సాగులో పువ్వు పెరిగేదశే కీలకం. నేల స్వభావాన్ని బట్టి నీరు అందిస్తుండాలి. నల్లరేగడి నేలల్లో పది రోజులకు ఒకసారి నీరు అందించాలి అదే తేలిక నేలల్లో 6 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. పువ్వు కోతకు వచ్చే ముందు నీటిని ఆపివేయాలి. స్వల్పకాలిక రకాలు నాటిని 40 నుంచి 45 రోజుల్లో కోతకు వస్తాయి. అదే మధ్యకాలిక రకాలు 60 నుంచి 100 రోజులకు, దీర్ఘకాలిక రకాలను నాటిన వంద రోజులకు కోత కోసుకోవచ్చు. పూతకు వచ్చిన 20 నుంచి 25 రోజుల్లో పువ్వు కోతకు సిద్ధమవుతుంది. పువ్వు మొత్తం ముదురు ఆకుపచ్చ రంగుకు వచ్చిన తరువాతనే కోత చేపట్టాలి. ఎకరాకు సుమారు 6 టన్నుల వరకు దిగుబడి వచ్చే వీలుంది. మార్కెట్ లో కిలో బ్రకోలి ధర 200 పలుకుతోంది. ధర చాలా ఆశాజనకంగా ఉన్నా మార్కెటింగ్ కు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే దీనిని సాగు చేయాలి. అప్పుడే రైతుకు లాభం దక్కుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories