Vakka Sagu: వక్క సాగుతో అధిక లాభాలు..

Betel Nut Farming Profit in Telugu
x

Vakka Sagu: వక్క సాగుతో అధిక లాభాలు..

Highlights

Vakka Sagu: హిందూ సంప్రదాయంలో వక్క లేదా పోక చెక్కకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.

Vakka Sagu: హిందూ సంప్రదాయంలో వక్క లేదా పోక చెక్కకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. శుభకార్యాల్లో విరివిగా వీటిని వినియోగిస్తారు. అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న వక్క సాగు మాత్రం స్థానికంగా పెద్దగా లేదు. పక్క రాష్ట్రాల నుంచే వక్కను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడుతోంది. ఈ క్రమంలో పెద్దగా సాగులో లేని వక్కను గత 25 ఏళ్లుగా పండిస్తూ చక్కటి ఆదాయాన్ని పొందుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాగుదారు.

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని కవ్వగుంట గ్రామంలో వక్కను అంతర పంటగా సాగు చేస్తున్నారు దావులూరి విజయ సారథి. 1993 వరకు తాను చేస్తున్న వ్యాపారానికి స్వస్తిపలికి వ్యవసాయంలో కాలుమోపారు ఈ సాగుదారు. అప్పటి నుంచి మూడేళ్ల వరకు కొబ్బరి, కోకో, మిరియం, కాఫీ లాంటి పంటలను సాగు చేశారు. ఆ తరువాత స్థానికంగా వక్క కు ఉన్న డిమాండును గుర్తించి 1996లో 38 ఎకరాల్లో అంతరపంటగా వక్కను సాగు చేయడం మొదలు పెట్టారు.

విజయ సారధి కొబ్బరిలో అంతరపంటగా వక్కను సాగు చేస్తున్నారు. సాళ్ల మధ్య 11 అడుగులు, సాళ్లలో మొక్కల మధ్య 6 అడుగుల దూరం ఉండేటట్లుగా సాగు చేస్తున్నారు. తోటలో క్రమంగా కోకో, కాఫీ మొక్కలను పూర్తిగా తొలగించారు. వక్క సాగులో దీర్ఘకాలంగా సేంద్రియ పద్ధతిని ఆచరిస్తుండటం వల్ల సుస్థిర దిగుబడులను పొందుతున్నారు ఈ సాగుదారు. ఎకరాకు గాను 550 మొక్కలు నాటారు. క్రమంగా 700లకు వాటి సంఖ్యను పెంచారు. మొక్కల సంఖ్య పెరగటంతో దిగుబడులు గణనీయంగా పెరిగింది.

అయితే ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో వక్క మొక్కల లభ్యత లేకపోవడంతో కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి మంగళ, శ్రీమంగళ, సుమంగళ, మంగళ ఇంట్రెసా, మోతీనగర్ లాంటి సంకరజాతి మొక్కలు తెప్పించి పొలంలో నాటారు. వాటి సాగు విధానాన్ని తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలకు తరచుగా వెళుతుండేవారు విజయసారథి. వక్క సాగులో అనుభవం సంపాదించిన తర్వాత హైబ్రిడ్ వక్క రకాలకు స్వస్తి పలికి మోతీ అనే దేశవాళీ రకంపై దృష్టి పెట్టారు.

రెండు, మూడేళ్ల కిందటి వరకు పొలంలో కోకో చెట్లుండేవి. వాటి నుంచి రాలే టన్నుల కొద్దీ ఆకులను వరుసల మధ్య గుట్టలుగా పేర్చి, అవి త్వరగా కుళ్లటం కోసం వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని పిచికారీ చేసేవారు. చెట్ల నుంచి రాలిన కొబ్బరి, వక్క ఆకులు కూడా ఇలాగే గుట్టలుగా పేర్చి కుళ్లిపోయేలా చేసేవారు. తోటలోనే ఆవులను పెంచుతూ వాటి పేడ, మూత్రంతో పంచగవ్య, జీవామృతం, ఘన జీవామృతాలను తయారుచేసి చెట్లపై పిచికారి చేయడం లేదా మొదళ్లలో పోయడం చేస్తున్నారు. హానికారక రసాయనాలను వాడకపోడం వల్ల కొబ్బరి, వక్క, మిరియం ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోందని రైతు తెలిపారు. రైతులకు మాత్రమే కాదు అధికారులకు, శాస్త్రవేత్తలకు విజయసారథి సిరివనం ప్రదర్శన క్షేత్రంగా మారింది. ఆయన చేస్తున్న సేద్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories