నెలకు రూ.1.50 లక్షల నికర ఆదాయం

నెలకు రూ.1.50 లక్షల నికర ఆదాయం
x
Highlights

ఏదో సాధించాలనే తపనతో కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. అయితే ఆరంభంలో అంతగా అవగాహన లేక నష్టాలను చవిచూసాడు. ఒకేసారి పెద్ద మొత్తంతో కోళ్ల పెంపకం చేపట్టి చేతులు...

ఏదో సాధించాలనే తపనతో కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు. అయితే ఆరంభంలో అంతగా అవగాహన లేక నష్టాలను చవిచూసాడు. ఒకేసారి పెద్ద మొత్తంతో కోళ్ల పెంపకం చేపట్టి చేతులు కాల్చుకున్నాడు. ఆ ఓటమి నుంచే మంచి గుణపాఠం నేర్చుకుని అత్యంత శ్రద్ధతో అసీల్ నాటు కోడి పిల్లల పెంపకం చేపట్టాడు. ఓటమే రేపటి విజయానికి నాంది అనడానికి నిదర్శనంగా నిలిచాడు మహబూబ్‌నగర్ జిల్లా రైతు లక్ష్మణ్‌.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదరీ పల్లి గ్రామంలో నాటు కో‌ళ్ళను వ్యాపార సరళిలో పెంచి నాణ్యమైన ఉత్పత్తిని సాధిస్తున్నారు యువరైతు లక్ష్మణ్‌. పెంపకానికి దేశీ బ్రీడ్‌ అసీల్‌ను ఎంచుకున్నాడు ఈ రైతు. మొదట్లో అవగాహన లోపంతో నాటుకోళ్ల పెంపకంలో నష్టాలను చవిచూసిన లక్ష్మణ్ ఆ తరువాత పూర్తి స్థాయి మెళకువలను నేర్చుకుని అసీల్ దేశీ జాతి కోడి పిల్ల ఉత్పత్తిని ప్రారంభించాడు. ఇందులో ప్రతే నెల లక్షా 50 వేల రూపాయల నికర ఆదాయాన్ని పొందుతున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

సాధారణంగా కోళ్ల పెంపకం చేపట్టాలనుకునే రైతులు ఒకేసారి పెద్ద మొద్దంలో ప్రారంభిస్తారు ఇలా చేయడం వల్ల నష్టాలు తప్పవని అంటున్నాడు రైతు లక్ష్మణ్‌. రైతులు ముందు జాగ్రత్తతో తక్కువ మొత్తంలో కోళ్ల పెంపకం చేపట్టి పెట్టుబడులను తగ్గించుకుని ప్రతీ నెల నికర ఆదాయాన్ని పొందాలంటున్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగానే ఉత్పత్తి చేపట్టాలని సూచిస్తున్నాడు. అప్పుడే రైతుకు లాభాలు అందుతున్నాయంటున్నాడు.

అసీల్ అంటే స్వచ్ఛత అని అర్థం. ఈ జాతి కోళ్లనే లక్ష్మణ్ పెంచుతున్నాడు ఇవి బాగా బలంగా, ఠీవితో , అలాగే రోగాలను తట్టుకునే శక్తి ఎక్కువగా, దెబ్బలాడే గుణం కలిగి ఉంటాయి. ఈ జాతి కోళ్ళకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పుట్టినిల్లు. ఈ కోళ్ళ చాలా పెద్దవిగా, అందంగా ఉంటాయి. పుంజులు 3 నుంచి 4 కిలోల వరకు బరువు ఉండి, పెట్టలు 2 నుంచి 3 కిలోల బరువు ఉంటాయి. అసీల్ జాతి కోళ్లలోనూ మూడు రకాలు ఉన్నాయి.

బ్రీడ్ సెలక్షన్ తో పాటు కోడిని పెంచే పద్ధతి కూడా ఎంతో ముఖ్యం. తన ఫాంలో 900 స్క్వేర్ ఫీట్్లలో షెడ్డును నిర్మించుకుని ఒక్కో షెడ్డులో 60 కోళ్ళను పెంచుతున్నాడు. క్రాసింగ్ విధానంలోనూ ప్రత్యేక పద్ధతులను పాటిస్తున్నాడు. గుడ్లు పెట్టడానికి షెడ్డులోనే ప్రైవేట్ స్పేస్ ను ఏర్పాటు చేసాడు. పెట్టెలు గుడ్లు పెట్టేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాడు. సీజనల్‌ వారీగా వచ్చే మార్పులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ కోళ్లను సురక్షితంగా పెంచుతున్నాడు లక్ష్మణ్.

వ్యాపార సరళిలో మాంసం ఉత్పత్తి చేస్తున్నాము కాబట్టి కోడి పిల్ల బరువు గురించి తప్పక ఆలోచించాలంటున్నాడు లక్ష్మణ్‌. పుట్టినప్పటి నుంచి ప్రత్యేక శ్రద్ధతో పోషకాలతో కూడిన దాణాను అందించాలంటున్నాడు. నాటు కోళ్ల పెంపకంలో ప్రతీ రైతు విజయం అనేది నాటు కోడి పిల్లల మీదే ఆధారపడి ఉంటుందని పిల్ల వయస్సులో మంచిగా పెంచగలిగితే ప్రతీ రైతుకు లాభాలు దక్కుతాయని అంటున్నాడు.

కోడి గుడ్లను సహజ పద్ధుతుల్లో పొదిగించడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకనే ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసుకుని సురక్షితంగా గుడ్లను పొదిగిస్తున్నాడు లక్ష్మణ్. పిల్లలు వచ్చిన తరువాత మొదటి 21 రోజులు బ్రూడింగ్, వ్యాక్సినేషన్, దాణా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఈ యువరైతు. బ్రూడింగ్ విధానంలో కేజ్ సిస్టమ్ పద్ధతిని అనుసరిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories