Top
logo

సిట్‌కు సవాలుగా మారిన వివేకా మర్డర్ కేసు

సిట్‌కు సవాలుగా మారిన వివేకా మర్డర్ కేసు
X
Highlights

వైఎస్‌ వివేకా మర్డర్ కేసు సిట్‌కు సవాలుగా మారింది. హత్య జరిగి ఆరు రోజులవుతున్నా హంతకులెవరో గుర్తించడం...

వైఎస్‌ వివేకా మర్డర్ కేసు సిట్‌కు సవాలుగా మారింది. హత్య జరిగి ఆరు రోజులవుతున్నా హంతకులెవరో గుర్తించడం కష్టతరంగా మారింది. మరోవైపు మొదటిసారి నిన్న మీడియా ముందుకొచ్చిన వివేకా కుమార్తె సునీతారెడ్డి మీడియాలో వస్తున్న కథనాలు, ఊహాగానాలు తమకు మరింత వేదనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా ఏది పడితే అది రాసుకుంటూ పోతే సరైన దర్యాప్తు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సిట్‌ను స్వతంత్రంగా పని చేయనివ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్‌ తర్వాత ఆయన కుటుంబీకులు ఫస్ట్‌ టైమ్‌ నోరు విప్పారు. నాన్న చనిపోయిన బాధలో తాముంటే మీడియాలో వస్తున్న కథనాలు, ఊహాగానాలు మరింత వేదనను కలిగిస్తున్నాయని వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి అన్నారు. వివేకా ఎంతో హుందా బతికారని, ఆయన గురించి చెడుగా ప్రచారం చేయొద్దని కోరారు. ఇలా ఏది పడితే అది రాసుకుంటూ పోతే సరైన దర్యాప్తు ఎలా జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దొరికిన లేఖలో చేతి రాత వివేకాదో కాదో ఫోరెన్సిక్‌ నివేదికలో తేలుతుందన్నారు. తమ డిమాండ్‌ ఒక్కటేనన్న వివేకా కుమార్తె సిట్‌ను స్వతంత్రంగా పని చేయనివ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కిరాతకానికి పాల్పడిందెవరో గుర్తించాలి వారికి శిక్షపడాలన్నారు. అయితే పెద్ద నాయకులే ఊహాగానాలు ప్రచారం చేస్తుంటే సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.

తమది 7వందల మంది ఉండే పెద్ద కుటుంబమని, అలాంటి బిగ్ ఫ్యామిలీలో అభిప్రాయభేదాలు ఉండటం సహజం అంతమాత్రాన ఒకరినొకరం చంపుకుంటామని కాదు కదా అన్నారు. ఇది అర్ధం చేసుకోవడానికి కొంతైనా మానసిక పరిపక్వత ఉండాలన్నారు. అయితే వివేకా కుమార్తె వ్యాఖ్యలు టీడీపీ నేతలకు కౌంటరేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివేకా మర్డర్‌‌పై రాజకీయ దుమారం చెలరేగడం, ఇది ఇంటి దొంగల పనేనంటూ, జగన్‌ టార్గెట్‌గా కడప నడిబొడ్డున చంద్రబాబు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతోనే సునీతారెడ్డి మీడియా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, వివేకా హంతకులెవరో తేల్చేందుకు సిట్‌ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే 20మందికి పైగా అనుమానితులను విచారించిన సిట్‌ ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే వివేకా పీఏ కృష్ణారెడ్డి తానేమీ చెప్పలేనంటూ మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, నేరచరిత్ర అధికంగా ఉన్న పరమేశ్వర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డితోపాటు ఎర్ర గంగిరెడ్డిపైనే అనుమానాలు బలపడుతున్నాయి. వివేకా హత్య జరిగిన రాత్రి ఎర్ర గంగిరెడ్డికి పరమేశ్వర్‌రెడ్డి పదేపదే ఫోన్లు చేసినట్లు పోలీసుల గుర్తించారు. వివేకా మర్డర్‌కు ఆర్ధిక, భూ లావాదేవీలే కారణమని ఒక అంచనాకి వచ్చిన సిట్‌ అధికారులు అవేంటో వెలికితీసే పనిలో ఉన్నారు. మొత్తానికి వివేకా హత్య కేసు సిట్‌కు సవాల్‌గా మారింది.

Next Story