Top
logo

పార్కింగ్‌లో బైక్‌ కనిపిస్తే మాయమే ... ఒక్క కంపెనీవే 190 బైక్‌లు చోరీ

పార్కింగ్‌లో బైక్‌  కనిపిస్తే మాయమే ...  ఒక్క కంపెనీవే 190 బైక్‌లు చోరీ
X
Highlights

ప్రొఫెషనల్‌ దొంగను మించిపోయాడు. లొకేషన్‌ ఏదైనా... మనసుపడ్డ మోడల్‌ కోసం వేషం మారుస్తాడు. పగలు ఉద్యోగం...

ప్రొఫెషనల్‌ దొంగను మించిపోయాడు. లొకేషన్‌ ఏదైనా... మనసుపడ్డ మోడల్‌ కోసం వేషం మారుస్తాడు. పగలు ఉద్యోగం రాత్రిపూట తాను అనుకున్న ఐడియాను ఫాలో చేస్తాడు. చుట్టూ జనం ఉన్నా... తన పని మాత్రం సైలెంట్‌గా చేసుకుపోతాడు. మూడో మనిషికి డవుట్‌ రాకుండా మనసు పడ్డ దాన్ని కూల్‌గా మాయం చేస్తాడు. జస్ట్‌ అలా వస్తాడు ఇలా తీసుకుపోతాడు. అతగాడి స్టైల్‌ చూస్తే... ఎవరైనా సరే కేటుగాళ్లకే కేటుగాడు అని ఫిక్స్‌ అయిపోతారు. మోసగాళ్లకే మోసగాడైన అతగాడి వయ్యారమేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే.

పార్కింగ్‌లో హీరోహోండా బండి కనిపిస్తే చాలు కూల్‌గా వచ్చి మాయం చేస్తాడు. ఇలా వరుసగా దొంగతనాలు చేస్తూ విశాఖ పోలీసులకు సవాల్ గా మారిన దొంగను పక్కా స్కెచ్ తో పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా దేవరాపల్లికి చెందిన వీరయ్య చౌదరి... ఇంటర్‌ చదివాడు. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ మెకానిజం నేర్చుకునేందుకు 2007లో హైదరాబాద్‌ వెళ్లాడు. అక్కడ ఇనిస్టిట్యూట్‌లో 4 కంప్యూటర్లు చోరీ చేసి చంచల్‌గూడ జైలు కెళ్లాడు. ఆ జైల్లోనే అతగాడి దొంగతనాలకు అసలైన బీజం పడింది. హీరోహోండా బైక్‌లు ఆరు నెలలకే తాళం అరిగిపోయి.. వదులైపోయి.. ఏ తాళం పెట్టినా స్టార్ట్‌ అవుతాయని తోటి ఖైదీల ద్వారా తెలుసుకున్న వీరయ్య... బయటకు వచ్చాక దొంగ అవతారం ఎత్తాడు.ఐదేళ్లలో 190 బైక్‌లు కొట్టేశాడంటే... అతగాడి స్పీడ్‌ ఎంటో అర్థమవుతోంది.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, గుంటూరు , ఒంగోలు జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడి పోలీసులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు వీరయ్య చౌదరి. పలుమార్లు జైలుకు వెళ్లివచ్చిన వీరయ్యపై 118 కేసులు ఉన్నాయి. విశాఖలో ఓ ఫార్మాసిటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయన ఖమ్మం జిల్లాయువతిని పెళ్లాడాడు. అయినా.. దొంగబుద్దులు మరిచిపోలేదు. సీసీ కెమెరాలు లేని లోకేషన్‌ను ఎంచుకుని మరీ సైలెంట్‌గా మాయం చేస్తాడు.

పరవాడలో ఓ వ్యక్తి బైక్‌ విడిభాగాలు విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో గాజువాక పోలీసులు వీరయ్యను, అతనికి సహకరించిన నాగేశ్వరరావు, బాబీలను కూడా అరెస్టు చేశారు. పార్క్ చేసి వున్న హీరోహోండా బైక్‌ కనిపిస్తే చాలు డూప్లికేట్ తాళాల సాయంతో కొట్టేయడంలో సిద్ధహస్తుడని పోలీసులు చెబుతున్నారు. వీరయ్య చౌదరి గ్యాంగ్‌ నుంచి 130 ద్విచక్ర వాహనాలు, ఐదు ఇంజన్లు, పలు విడిభాగాలు, 90 వేల నగదు, 5 లక్షల విలువ చేసే 167 గజాల స్థలం డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

స్టీల్‌ప్లాంట్‌ స్టేషన్‌ పరిధిలో బైక్‌ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేసిన పలువురిని పిలిచి వాహనాలను చూపించగా, తమవేనని గుర్తించారు. ప్రొఫెషనల్‌ దొంగను మించిపోయిన దొంగను పట్టుకున్న పోలీసులను వారు అభినందించారు. వీరయ్య దొంగలించిన బైకులన్నీ హీరోహోండాకి చెందినవే కావడంతో జనం అవాక్కయ్యారు. అంతేకాదు బైకులను రికవరీ చేసిన పోలీసులు వాటిని ఓ మైదానంలో ప్రదర్శనలో ఉంచడం హాట్‌టాపిక్‌గా మారింది.


Next Story