విజయవాడలో హవాలా సంచలనం...భారీగా పట్టుబడిన 500, 2000 నోట్ల కట్టలు

విజయవాడలో హవాలా సంచలనం...భారీగా పట్టుబడిన 500, 2000 నోట్ల కట్టలు
x
Highlights

అన్నీ 500, 2000 రూపాయల నోట్ల కట్టలే. వాటికి ఒక లెక్కాపత్రం మాత్రం లేదు. మిర్చి వ్యాపారం ముసుగులో విజయవాడలో చలామణి అవుతున్న హవాలా డబ్బు ఇది. ఎన్నికల...

అన్నీ 500, 2000 రూపాయల నోట్ల కట్టలే. వాటికి ఒక లెక్కాపత్రం మాత్రం లేదు. మిర్చి వ్యాపారం ముసుగులో విజయవాడలో చలామణి అవుతున్న హవాలా డబ్బు ఇది. ఎన్నికల సమయంలో భారీగా 1.29కోట్ల రూపాయలను పోలీసులు గుర్తించడం సంచలనం కలిగిస్తోంది. కేసును చాలా వరకు చేధించినప్పటికీ పోలీసుల్లో ఇంకా అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అభినవ్‌రెడ్డి అనే వ్యాపారి వద్ద పనిచేసే నాగరాజుపై దాడి చేసి మొత్తం 1.70కోట్లు కాజేసింది అతడి మిత్రబృందం. హైదరాబాద్‌లో ఉన్న అభినవ్‌రెడ్డి దఫదఫాలుగా ముంబైలో కొందరు వ్యాపారుల ఖాతాల్లోకి లక్షల్లో బదిలీ చేయడం, తర్వాత వెంటనే ఒక కోడ్‌ అతడికి చేరడం పోలీసుల్లో అనుమానాలకు బలం చేకూర్చుతోంది. అతడ్ని పోలీసులు ప్రశ్నించినప్పుడు విజయవాడలో కొత్తగా మిర్చి వ్యాపారాన్ని మొదలుపెట్టానని చెప్పాడు. దానికి సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను ఆయన పోలీసులకు చూపించలేదు.

అయితే, అలాంటి బ్రాంచ్‌ కార్యాలయాలేమీ ఇక్కడ లేవు. దేశవిదేశాల్లో 12 కార్పొరేట్‌ కంపెనీలు ఉన్నాయని మాత్రం చెప్పాడు. ముంబై నుంచి వచ్చిన కోడ్‌ను విజయవాడలో ఉన్న నాగరాజుకు పంపడం, అతడు యజమాని చెప్పిన వ్యాపారి వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేయడం మరో అనుమానాన్ని కలిగిస్తోంది. తర్వాత మళ్లీ ఆ డబ్బులు ముంబై ఖాతాల్లో వేయడాన్ని బట్టి ఇది కచ్చితంగా హవాలా మనీ అని గుర్తించారు. ఎన్నికలకు ఈ డబ్బులకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అంతర్గతంగా ఈ డబ్బులకు రాజకీయ లింక్‌ ఉందని మాత్రం తెలుస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విషయాన్ని నిర్ధారించలేమని పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేస్తున్నారు. నేరం జరిగిన దర్యాప్తు చేసి, సొమ్మును పోలీసులు రికవరీ చేసినప్పటికీ, కంపెనీలు, డబ్బుల విషయాన్ని తేల్చడానికి ఈడీ‌, ఐటీ శాఖలను రంగంలోకి దింపుతున్నారు. ఈ డబ్బును ఐటీ శాఖకు అప్పగించి, ఈడీకి సమాచారం ఇచ్చారు.

అభినవ్‌రెడ్డి చెబుతున్న కంపెనీలు ఏ జాబితాలో ఉన్నాయి, కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటయ్యాయా లేక డొల్ల కంపెనీలా అన్న ప్రశ్న పోలీసుల నుంచి వ్యక్తమవుతుంది. కేవలం హవాలా కోసమే అతడు ఈ కంపెనీలను ఏర్పాటు చేసి ఉంటాడా అన్న అనుమానం రేకెత్తుతోంది. అభినవ్‌రెడ్డి ముంబైకి పంపుతున్న ఖాతాల నంబర్లను పోలీసులు తెలుసుకున్నారు. దాన్ని బట్టి దర్యాప్తు సాగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్‌లో ఉన్న అభినవ్‌రెడ్డిని ఇక్కడికి రప్పించే అవకాశాలు ఉన్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో ముంబై హవాలతో విజయవాడ వ్యాపారులకు ఉన్న లింక్‌లు బయటకు రావడం ఖాయమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories