Top
logo

అందుకే విజయారెడ్డిని హత్య చేశాను: సురేశ్‌

అందుకే విజయారెడ్డిని హత్య చేశాను: సురేశ్‌
X
Highlights

తీవ్ర సంచలనం సృష్టించిన తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. ఉస్మానియా...

తీవ్ర సంచలనం సృష్టించిన తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న నిందితుడు సురేష్ నుంచి వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు ఈ ఘాతుకం వెనుక ఇంకెవరున్నారో తేల్చే పనిలో పడ్డారు. అసలు సురేష్ ఏం చెప్పాడు? విజయారెడ్డి హత్యకు కారణమేంటి?

తహశీల్దార్‌ విజయారెడ్డి హత్యకు భూవివాదమే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం గౌరెల్లి గ్రామంలో 11మంది రైతులు 1954లో రాజా ఆనందరావు నుంచి భూములు కొనుగోలు చేయగా, 1996లో ఆయా కుటుంబాల సభ్యులు ఆర్‌వోఆర్‌ చట్టం కింద పట్టా పాసు పుస్తకాలు తీసుకున్నారు. అప్పట్నుంచి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు, సాగుదారులుగా కొనసాగుతున్నారు. అయితే, 2014లో సడన్‌గా తెరపైకి వచ్చిన అహ్మద్ హయత్‌ తన దగ్గర రక్షిత కౌలుదారుల చట్టం కింద హక్కులు ఉన్నాయంటూ కోర్టుకెళ్లడంతో అప్పటివరకు సాగు చేసుకుంటున్న రైతులకు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. రెవెన్యూ అధికారులు విచారణ తర్వాత ఆ భూమిపై అహ్మద్‌ హయత్‌తోపాటు ఇతరులకు హక్కులు కల్పిస్తూ 2016 అక్టోబర్ 25న ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం ఆ భూమిని అహ్మద్ హయత్‌ ఇద్దరు రియల్టర్లకు విక్రయించాడు. అయితే, అప్పటివరకు సాగుదారులుగా ఉన్న రైతులు కోర్టును ఆశ్రయించగా, ఆర్డీవో ఆదేశాలనే సమర్ధించడంతో తిరిగి హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉండగా, సర్వే నెంబర్ 87 నుంచి 101 వరకున్న దాదాపు 130 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతోంది. అయితే, ఇటీవల సర్వే నెంబర్ 92, 93, 94, 96ల్లో 40 ఎకరాల భూమిని ఓ రాజకీయ నేతకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరగడంతో ఆ భూములకు చెందిన 11 కుటుంబాలు హైకోర్టులో మరో కేసు వేశారు. ఈ కేసులపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే మరోవైపు రెవెన్యూ అధికారులు లంచాలకు కక్కుర్తిపడి ఇతరుల పేరు మీద దస్తావేజులు చేసినట్లు తెలుస్తోంది. ఈ 40 ఎకరాల్లో నిందితుడు సురేష్‌, అతని పెదనాన్నకు 8 ఎకరాల భూమి కూడా ఉండటంతో స్థానిక తహశీల్దార్ విజయారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆ భూములు కోర్టు పరిధిలో ఉన్నందున తాను కలుగజేసుకోలేని విజయారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగైతే, ఆ భూములను ఇతరుల పేరు మీద ఎలా పాస్ పుస్తకాలు ఇస్తారని, డాక్యుమెంట్లు ఎలా చేస్తారని గ్రామ సభల్లో బాధితులు రెవెన్యూ అధికారులతో అనేకసార్లు గొడవకి దిగినట్లు తెలుస్తోంది.

అయితే, వివాదంలో ఉన్న ఈ భూములు హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉండటం అలాగే, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండటంతో రాజకీయ నేతలు, కబ్జాదారులు, రియల్టర్ల కన్ను వీటిపై పడింది. దాంతో, ఆ భూములు ఇక తమకు దక్కవేమోనన్న ఆందోళనతో పథకం ప్రకారమే తహశీల్దార్‌ను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. విజయారెడ్డికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో కార్యాలయం చుట్టూ తిరిగితిరిగి విసిగిపోయి కోపంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు నిందితుడు సురేష్ వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. అలాగే, రెవెన్యూ అధికారులు రియల్టర్లకు అనుకూలంగా పనిచేసినట్లు సురేష్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. గ్రామసభల్లోనూ రెవెన్యూ అధికారులతో ఎన్నోసార్లు గొడవ పడ్డామని, కానీ పట్టించుకోలేదని, దాంతో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, కానీ క్షణికావేశంలో విజయారెడ్డిపైనా పెట్రోల్ పోసి తగలబెట్టానని పోలీసులకు తెలిపారు నిందితుడు.

Next Story