వైసీపీ ఎమ్మెల్యే వర్సెస్‌ కలెక్టర్‌

x
Highlights

నెల్లూరు జిల్లాలో సరికొత్త వివాదం నెలకొంది. నిన్నమొన్నటివరకూ సోమిరెడ్డి వర్సెస్‌ కాకానిగా సాగిన వైరం ఇప్పుడు యూటర్న్‌ తీసుకుంది. రాజకీయ క్రీడలో...

నెల్లూరు జిల్లాలో సరికొత్త వివాదం నెలకొంది. నిన్నమొన్నటివరకూ సోమిరెడ్డి వర్సెస్‌ కాకానిగా సాగిన వైరం ఇప్పుడు యూటర్న్‌ తీసుకుంది. రాజకీయ క్రీడలో అధికారులు పావులుగా మారడంతో వివాదం కాస్తా కలెక్టర్ వర్సెస్‌ కాకానిగా మారింది. ఇంతకీ కలెక్టర్‌కు కాకానికి మధ్య వైరమేంటి?. కలెక్టర్‌, కాకాని వివాదంలో టీడీపీ ఎందుకు తలదూర్చింది? సింహపురిలో అసలేం జరుగుతోంది?

నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకూ మంత్రి సోమిరెడ్డి వర్సెస్‌ ఎమ్మెల్యే కాకానిగా సాగుతోన్న రాజకీయ యుద్ధం ఇప్పుడు యూటర్న్‌ తీసుకుంది. అభివృద్ధి పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందన్న కాకాని గోవర్దన్‌‌రెడ్డి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు టార్గెట్‌‌గా విమర్శలు గుప్పించారు. కలెక్టర్ అలసత్వం, అసమర్ధత కారణంగానే మంత్రి సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించడంతో వివాదం కాస్తా కలెక్టర్‌ వర్సెస్‌ కాకానిగా మారింది. సోమిరెడ్డి అవినీతిపై పదేపదే నివేదికలిచ్చినా కలెక్టర్ ముత్యాలరాజు పట్టించుకోలేదంటున్న కాకాని అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ జేసీ కమలకుమారికి నివేదిక సైతం అందజేశారు.

అయితే కాకాని గోవర్దన్‌రెడ్డి కలెక్టర్‌ను టార్గెట్‌ చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహించాయి. కాకానిపై దాడికి సైతం యత్నించారు. అదే సమయంలో కలెక్టర్‌కు అండగా టీడీపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా జిల్లా కలెక్టర్‌పైనే ఆరోపణలు చేయడం నెల్లూరు జిల్లా చరిత్రలోనే ఎన్నడూ జరగలేదన్న టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రయాదవ్‌ ప్రభుత్వాధికారులను బెదిరించి ఏమీ సాధించలేరంటూ వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్‌రెడ్డికి హితవు పలికారు. కాకాని వర్సెస్‌ కలెక్టర్ వివాదంతో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్న సమయంలోనే వెంకటాచలం మండల గ్రీవెన్స్‌ సెల్‌కు కాకాని రావడంతో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే పోలీసుల విజ్ఞప్తి మేరకు గ్రీవెన్స్‌ సెల్‌ నుంచి కాకాని వెళ్లిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories