ఆ కుటుంబాలు ఎక్కడికెళ్లినట్టు..?

ఆ కుటుంబాలు ఎక్కడికెళ్లినట్టు..?
x
Highlights

దాడి చేశారు కనబడ్డ కొద్దిమంది పిల్లలను నరకం నుంచి విముక్తి కల్పించారు ఇళ్లకు తాళాలు వేశారు కేసులు నమోదు చేశారు. తర్వాత ఇంకేముంది చేతులెత్తేశారు....

దాడి చేశారు కనబడ్డ కొద్దిమంది పిల్లలను నరకం నుంచి విముక్తి కల్పించారు ఇళ్లకు తాళాలు వేశారు కేసులు నమోదు చేశారు. తర్వాత ఇంకేముంది చేతులెత్తేశారు. ఆపరేషన్ ముస్కాన్‌పై పోలీసుల తీరు ప్రశ్నార్థకంగా మారింది. కేవలం 15 మంది పిల్లలను తప్పించిన పోలీసులు కనీసం వారి వలలో ఇంకెంతమంది చిన్నారులున్నారో తెలుసుకునే ప్రయత్నమే చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

ఆపరేషన్‌ ముస్కాన్ పవిత్ర యాదగిరిగుట్ట కింద జరుగుతున్న అపవిత్ర కోణాలను వెలుగులోకి తెచ్చిన ఉదంతం. ముక్కుపచ్చలారని పిల్లలను చీకటి వ్యాపారాలకు బలి చేస్తున్న దారుణాలను కళ్లకు కట్టింది. డబ్బు, బంగారం దాచుకునేట్టుగా ఆడపిల్లలను నేలమాళిగల్లో దాచేసి వారి జీవితాలకు భవిష్యత్తే లేకుండా చేస్తున్న దుండగులు బండారం బట్టబయలైన ఈ ఘటనలో ఎన్నో చీకటి దారుణాలు బయటపడ్డాయి. అయితే ఈ కేసులో పోలీసుల తీరే ప్రశ్నార్థకంగా మారింది. విచారణ సాగే పద్దతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దశాబ్దాలుగా సాగుతున్న ఈ దందాపై పోలీసులు సరైన రీతిలో విచారణ చేపట్టకపోవడం వల్లే ఇంతటి దారుణాలు కళ్లజూడాల్సి వచ్చిందనే ఆరోపణలున్నాయి. 15 మంది పిల్లలను రక్షించి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్న ఆర్ ఎంపీ డాక్టర్‌ సహా మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఓ వైపు కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే గుట్టకింద ఉన్న దాదాపు 100 కుటుంబాలు కంటికి కనిపించకుండా పారిపోయాయి. ఇళ్లకు తాళాలేసి అకస్మాత్తుగా మాయమయ్యాయి. దీంతో పోలీసులు అక్కడితో తమ దర్యాప్తును నిలిపేసినట్లు కనిపిస్తోంది. కనీసం ఆ కుటుంబాలు ఎక్కడికి వెళ్లినట్టు..? వారి చెరలో ఇంకెంతమంది ఎంతమంది చిన్నారులున్నారనే దిశగా విచారణ సాగినట్లు కనిపించడం లేదు.

అయితే వీరున్నచోట దాడి చేస్తే మరోచోటికి వెళ్లడం లేదా తాత్కాలికంగా అజ్ఞాతంలోకి వెళ్లడం వీరికి పరిపాటిగా మారింది. దీంతో గుట్టకు చెందిన దాదాపు వంద కుటుంబాలు కూడా అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీరి దగ్గర మరో వంద మంది చిన్నారులున్నట్లు స్వచ్ఛంధ సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే వీరిని తప్పించే చర్యలు తీసుకోవడం లేదు. అందుకు అనుగుణంగా అడుగులు కూడా వేయడం లేదని తెలుస్తోంది. ముఠాలో చిక్కుకున్న వారిని రక్షించే అవకాశం ఉన్నా పోలీసులు ప్రదర్శిస్తున్న ఉదాసీనత విమర్శలకు తావిస్తోంది.

వ్యభిచారం వృత్తినే వంశపారంపర్యంగా నిర్వహిస్తూ వస్తున్న ఓ కులానికి చెందిన వారు ఒంటరి ఆడవాళ్లు, చిన్నారులు, అనాధలను ఈ రొంపిలోకి దించి వ్యాపారం చేయిస్తున్నారు. గిరిజన తండాల్లోని పేదవారి నుంచి పిల్లలను కొనుగోలుచేసి ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలను అపహరించి ఈ దారుణమైన వృత్తిలోకి దించుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories