స్థానికత రజినీకి మైనస్ అవుతుందా?

స్థానికత రజినీకి మైనస్ అవుతుందా?
x
Highlights

దేవుడు ఆదేశిస్తాడు...అరుణాచలం పాటిస్తాడని, నాడు సినిమాలో నేడు, పొలిటికల్‌ లైఫ్‌లోనూ చెప్పాడు రజినీకాంత్. ఆధ్యాత్మిక పాలిటిక్స్ చేస్తానంటున్న రజినీని,...

దేవుడు ఆదేశిస్తాడు...అరుణాచలం పాటిస్తాడని, నాడు సినిమాలో నేడు, పొలిటికల్‌ లైఫ్‌లోనూ చెప్పాడు రజినీకాంత్. ఆధ్యాత్మిక పాలిటిక్స్ చేస్తానంటున్న రజినీని, ఆదేశించింది దేవుడు కాదు, నరేంద్ర మోడీ అంటున్నవారి విమర్శలూ అనేకం. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత...రజినీకాంత్‌కు ప్లస్సులేనా...మైనస్‌లూ ఉన్నాయా?

ఆధ్యాత్మిక రాజకీయమే నా లక్ష్యం-రజినీ
కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన..అంటూ భగవద్గీత శ్లోకాన్ని చెప్పారు రజినీకాంత్. న్యాయంగా, ధర్మంగా సాగే ఆధ్యాత్మిక రాజకీయమే నా లక్ష్యం అంటూ, రజినీ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి. ఆధ్యాత్మిక రాజకీయాలంటే ఏంటన్న డిస్కషన్ జోరుగా సాగుతోంది.

రజినీ వ్యాఖ్యలు ద్రవిడ ఉద్యమాలకు ఛాలెంజేనా?
భగవద్గీత శ్లోకాలు, ఆధ్యాత్మిక రాజకీయాలంటూ రజినీ చేసిన వ్యాఖ్యలు, తమిళ రాజకీయాల్లో 60 ఏళ్లుగా ప్రధాన పాత్ర పోషిస్తున్న ద్రవిడ ఉద్యమాలకు పెను సవాల్‌గా మారనుందనే చర్చ మొదలైంది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు ‘ద్రవిడ’ భావానికి పరీక్షగా మారనున్నాయన్న చర్చ జరుగుతోంది.

తమిళనాడులో బలంగా నాస్తికవాద పునాదులు
తమిళనాడులో గుళ్లూ, గోపురాలు ఎన్నున్నాయో, అదేస్థాయిలో నాస్తికవాదం కూడా గట్టిపునాదులు వేసుకుంది. సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి ప్రారంభించిన ద్రవిడ ఉద్యమ స్ఫూర్తి మతం, ఆధ్యాత్మికతను తీవ్రంగా వ్యతిరేకించింది. భగవద్గీత, వర్ణవ్యవస్థ, ఆర్య–ద్రవిడ సిద్ధాంతం, తమిళ సంస్కృతి వంటి అంశాలపై ఇక్కడి ప్రజలకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. రాముడు లేడు, రామసేతులేదని విస్పష్టంగా ప్రకటించారు. తమిళనాడు సీఎంల వ్యక్తిగత ఆలోచనలు ఎలా ఉన్నా, హేతువాదాన్ని బాగా ప్రోత్సహించారు. 60 ఏళ్లుగా రాజకీయాల్లో ఆధ్మాత్మికత గురించి ఎవరూ మాట్లాడే ధైర్యం చేయలేదు సరికదా.. తమ సిద్ధాంతాలను వెల్లడించే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ ధైర్యం ఇప్పుడు రజినీ చేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో ద్రవిడ సిద్దాంతాలు-ఆధ్యాత్మిక మధ్య జరగబోతున్నాయా...స్పిరిచువాలిటీని రజినీ అస్త్రంగా ప్రయోగించబోతున్నాడా...జనం ఆదరిస్తారా...లేదంటే రజినీకి బూమరాంగ్‌ అవుతుందా?

బీజేపీ, మోదీ అండ రజినీకి ఉన్నాయా?
ఆధ్యాత్మిక రాజకీయాలు మాటపై ఇంకా అనేక విశ్లేషణలు సాగుతున్నాయి. బీజేపీ భావజాలానికి రజినీ దగ్గరయ్యాడని, నరేంద్ర మోదీ ఒత్తిడి, అండతోనే రాజకీయాల్లోకి వస్తున్నాడన్న చర్చ కూడా నడుస్తోంది. ఇదే జరిగితే రజినీకాంత్‌కు మైనస్సే. ఎందుకంటే, జాతీయపార్టీలను తమిళ ప్రజలు ఎప్పుడో బొందలో పెట్టారు. హిందూత్వవాదం, జాతీయవాదం కంటే, ప్రాంతీయవాదానికే జనం ఓటెస్తారిక్కడ. అయితే మొత్తం 234 స్థానాలకు పోటీ చేస్తామని రజినీ చెప్పడం, బీజేపీతో పొత్తులేదన్న సంకేతం పంపడమేనని విశ్లేషకులు అంటున్నారు.

స్థానికత రజినీకి మైనస్ అవుతుందా?
స్థానికత. రజినీకాంత్‌ పుట్టింది, పెరిగింది కర్ణాటకలో. బెంగళూరులో స్థిరపడిన మరాఠి కుటుంబం. తలైవా వస్తున్నాడని తెలియడంతో కమల్‌ హాసన్, శరత్‌కుమార్‌లు ఆయన స్థానికతను ప్రశ్నించారు. తమిళ ప్రజలు ఇతరుల పాలన కోరుకోరని అన్నారు. జనంలో ఈ స్థానికత సెంటిమెంట్ రగిలితే, రజనీకి మైనస్ కావచ్చు. అయితే, రజినీని తమిళ ప్రజలు ఏనాడూ స్థానికేతరుడిగా చూడలేదు. ఆ మాటకొస్తే, ఎంజీఆర్, జయలలిత కూడా కర్ణాటకవాసులే. అయినా గుండెల్లో పెట్టుకుని ఆరాధించారు.

రజినీకి కమల్‌కి ఢీ అంటే ఢీనా?
కమల్‌ నాస్తికవాదం వర్సెస్ రజినీ ఆధ్యాత్మికవాదం. వచ్చే ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే కన్నా, రజినీకి పోటీ వచ్చేది కమల్‌హాసన్ అన్న చర్చ జరుగుతోంది. ఇద్దరూ మిత్రులైనా రాజకీయంగా తలపడే అవకాశముంది. కానీ ఇద్దరూ కలిస్తే మాత్రం ప్రభంజనమే.

పార్టీ నిర్మాణం కత్తిమీద సామేనా?
ఎన్నికలకు ఇంకా మూడేళ్లున్నా, ఆ సమయానికి పార్టీ నిర్మాణం కత్తిమీద సామే. అంతేకాదు, వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ పోటీ చేయడంలేదని రజినీ చెప్పారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేది, నాటి కాలమాన పరిస్థితులను బట్టి చెబుతామన్నాడు. పొలిటికల్‌ ఎంట్రీ అనౌన్స్‌మెంట్‌ జరిగిన మరుసటి రోజు, అంటే జనవరి ఫస్టున, వీడియో మెసేజ్‌ పంపిన రజినీ, పార్టీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. యాప్‌ లాంచ్ చేశాడు. అందరం కలిసి, తమిళనాడును అభివృద్ది చేద్దామన్నాడు.

రాజకీయాలంటేనే, కుట్రలు, కుతంత్రాలు ఎత్తులుపైఎత్తులు, వ్యక్తిగత విమర్శలు రజినీకాంత్‌ వీటన్నింటినీ తట్టుకుని పోరాడతాడా?
ఇవన్నీ ఒకెత్తయితే, రాజకీయాలంటేనే, కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులుపైఎత్తులు, వ్యక్తిగత విమర్శలను ఎదుర్కోవడం, దీటైన బదులివ్వడం రజినీకి సవాలే. సున్నిత మనస్కుడు, ఆధ్యాత్మికవాది అయిన రజినీకాంత్‌ వీటన్నింటినీ తట్టుకుని పోరాడతాడా, అమితాబ్‌ బచ్చన్, చిరంజీవిలా మధ్యలోనే కాడి దింపేస్తాడా అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఇలా రాజకీయ శూన్యత, తిరుగులేని పాపులారిటీ, అభిమానుల అండ వంటి అనేక సానుకూల అంశాలతో పాటు ఇంకెన్నో ముళ్లబాటలున్నాయి రజినీ ముందు. చూడాలి మున్ముందు రజినీ ఎలాంటి అడుగులు వేస్తాడో, ఎలాంటి ప్రభంజనం మోగిస్తాడో.

Show Full Article
Print Article
Next Story
More Stories