మోడీ చేసిందేమిటి? సామాన్యుడి స్వరమేంటి?

మోడీ చేసిందేమిటి? సామాన్యుడి స్వరమేంటి?
x
Highlights

నాలుగేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు.. పదేళ్ల యూపీఏ పాలనకు తెరదించుతూ.. మోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే సర్కారు కొలువుదీరింది. ఎన్నో ఆశలతో.. మరెన్నో హామీలతో...

నాలుగేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు.. పదేళ్ల యూపీఏ పాలనకు తెరదించుతూ.. మోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే సర్కారు కొలువుదీరింది. ఎన్నో ఆశలతో.. మరెన్నో హామీలతో హస్తినలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ.. సామాన్యుడి నాడిని అందుకున్నారా..? విమర్శలతో ముప్పుతిప్పలు పెడుతున్న విపక్షాల దాడులను ఎదుర్కొంటూ.. ఐదో అడుగు వేస్తున్న చాయ్ వాలాపై సామాన్యుడి స్వరం ఏంటి..? మోడీ ఛరిశ్మా తగ్గిపోయిందంటూ సర్వేలు వస్తున్న సమయంలో.. సగటు మానవుడి మనోగతమేంటి..? టైమ్స్ గ్రూప్ నిర్వహించిన ఆన్ లైన్ పోల్‌లో వెల్లడైన ఆసక్తికరమైన వివరాలు.. హెచ్‌ ఎం టీవీ ప్రేక్షకుల కోసం..

కర్ణాటక ఎన్నికలతో దేశంలో మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా మొదలైందన్న తరుణంలో.. కాంగ్రెస్‌తో పాటు.. విపక్షాలకు మింగుడుపడని సర్వే ఒకటి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా టైమ్స్ గ్రూప్ నిర్వహించిన పల్స్ ఆఫ్ ద నేషన్.. ఆన్ లైన్ పోల్‌లో.. 2019 లో మళ్లీ నరేంద్రమోడీకే పట్టం కట్టాలని.. మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌ సర్వేలో మొత్తం 8 లక్షల 44 వేల 646 మంది పాల్గొనగా.. దాదాపు మూడొంతుల మంది.. అంటే 71.9 శాతం మంది మోడీకే జై కొట్టారు. 9 భాషల్లో మే 23 నుంచి 25 వరకు జరిగిన పోల్‌లో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా మోడీ ప్రభుత్వానికే ఓటేస్తామని.. 73.36 శాతం మంది నెటిజెన్లు తెలిపారు.

నాలుగేళ్ల మోడీ ప్రభుత్వ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు.. చాలాబాగుందని 47.4 శాతం మంది ఓటేయగా.. బాగుందని 20.6 శాతం, ఫర్వాలేదని 11.38 శాతం, బాగోలేదని 20.55 శాతం మంది ఓటేశారు. అలాగే మోడీ సర్కారు తీసుకున్న అత్యంత విజయవంతమైన నిర్ణయం ఏదన్న ప్రశ్నకు 33.42 శాతం మంది జీఎస్టీకి ఓటేశారు. ఆ తరవాత డీమానిటైజేషన్ ఉత్తమమైన నిర్ణయమని 21.9 శాతం మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులకు 19.89 శాతం మంది, జన్ ధన్ యోజన ఖాతాలకు 9.7 శాతం మంది ఓటేశారు. విదేశాంగ విధానంపై 80 శాతం మంది అనుకూలంగా ఓటేశారు.

ఇటు మోడీ సర్కారు దారుణంగా విఫలమైన అంశమేదని అడిగిన ప్రశ్నకు 28.3 శాతం మంది ఉద్యోగ కల్పన అని అభిప్రాయపడ్డారు. అయితే నిరుద్యోగ సమస్య తగ్గడానికి మోడీ ప్రభుత్వం చేసిన కృషి ఎలా ఉందన్న ప్రశ్నకు 58.4 శాతం మంది చాలాబాగుందని తెలిపారు. 36 శాతం మంది మాత్రం బాగోలేదని ఓటేశారు. మోడీ సర్కార్ విఫలమైన అంశాల్లో కశ్మీర్ సమస్య అని 14.28 శాతం మంది.. అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఎంతో ప్రధానమైన నోట్ల రద్దు కూడా అత్యంత చెత్త నిర్ణయమని 22.2 శాతం మంది ఓటేశారు. ఇక మైనార్టీల భద్రతపై అడిగిన ప్రశ్నకు.. మైనార్టీల్లో అభద్రతా భావం పెరిగిందని.. 30.01 శాతం మంది తెలపగా.. పెరగలేదని 59.41 మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలిసి పోరాడితే బీజేపీని సమర్థంగా ఎదుర్కొంటాయా అన్న ప్రశ్నకు.. 28.96 శాతం మంది అవుననగా.. 57.11 బీజేపీకి ఎదురేలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. 2019 ఎన్నికల తరవాత ఏ ప్రభుత్వం ఏర్పడొచ్చని భావిస్తున్నారన్న ప్రశ్నకు.. 73.36 శాతం మంది మోడీ సారథ్యంలోని ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం వస్తుందని 16.04 శాతం మంది ఓటేయగా.. రాహుల్ గాంధీ సారథ్యంలో ప్రభుత్వానికి 10.59 శాతం మంది ఓటేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని 11.93 శాతం మంది మాత్రమే ఓటేయగా.. మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ప్రధానమంత్రిగా అవసరం లేదని 16.1 శాతం మంది ఓటర్లు తమ మనోగతాన్ని తెలిపారు. అయితే మోదీకి వ్యతిరేకంగా ఓట్లు వేసినవారిలో.. థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని తెలిపిన వారిలో.. ఎక్కువగా తెలుగువారే ఉన్నారని టైమ్స్ గ్రూప్ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories