అమ్మకానికి ఊరు

x
Highlights

దొంగలు..దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారన్నది పాతకాలపు సామెత. కొత్త సామెత ఏమిటంటే దొంగలు దొంగలు కలిసి రుణంపేరుతో ఓ గ్రామాన్నే తాకట్టుపెట్టారు. కేంద్ర...

దొంగలు..దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారన్నది పాతకాలపు సామెత. కొత్త సామెత ఏమిటంటే దొంగలు దొంగలు కలిసి రుణంపేరుతో ఓ గ్రామాన్నే తాకట్టుపెట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థతో కుమ్మకై ఓ కంపెనీ భారీ లోన్ తీసుకుంది. ఒకటి, రెండు కోట్లు కాదు ఏకంగా 332 కోట్ల రూపాయల లోన్ కొట్టేసింది. ఎంతకీ ఆ కంపెనీ రుణం చెల్లించకపోవడంతో గ్రామాన్ని అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వ సంస్థ లేఖ రాయడంతో తెలంగాణ అధికారులు ఖంగు తింటున్నారు. గ్రామస్తులు అవాక్కు అవుతున్నారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ..? ఆ కేటుగాళ్లు ఎవరని తెలుసుకోవాలనుకుంటున్నారా..? వాచ్ దిస్ స్టోరీ...

ఓ కంపెనీకి..ఆ ఊరితో కాదు కదా.. తెలంగాణ రాష్ట్రంతోనూ సంబంధం లేదు. కానీ, రంగారెడ్డి జిల్లాలోని ఖరీదైన భూములపై కన్నేసిన మోసగాళ్లు..ఏకంగా ఆ ఊరునే తాకట్టు పెట్టి వందల కోట్ల రుణం తీసుకున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా 1820 ఎకరాల ప్రభుత్వభూముల్ని తనఖా పెట్టి దాదాపు 332 కోట్ల రూపాయలు నొక్కేశారు. ఈ లోన్ ఇచ్చిన సంస్థ ఏదో ఆషామాషీ సంస్థేమీ కాదు కేంద్ర వాణిజ్య శాఖలోని విభాగానికి సంబంధించినది.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ గ్రామ జనాభా మూడు వేల వరకు ఉంటుంది. ఈ ఊరిని అమ్ముకుంటామని, అందుకు అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నుంచి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ వచ్చింది. దీంతో షాక్ కు గురైన అధికారులు ఊరు మొత్తాన్నీ అమ్ముకోవడం ఏమిటని ఎంక్వయిరీ చేస్తే భారీ భూ కుంభకోణం బయటపడింది.

గోవా కేంద్రంగా పనిచేసే పైసీస్‌ ఎగ్జిమ్‌ ఇండియా లిమిటెడ్‌ 2009 నవంబరులో మైనింగ్‌, లాజిస్టిక్స్‌, స్టీల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ట్రేడింగ్‌ వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రవీణ్‌కుమార్‌, శ్యామ్‌లాల్‌ రాథోడ్‌, శంతన్‌ శర్మ, సౌమిత్‌ రంజన్‌, ప్రీతి జెనా తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారు. పైసీస్‌ కంపెనీ విస్తరణ పేరిట వీళ్లు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థకు వల వేశారు. విదేశీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ది ప్రాజెక్ట్‌ అండ్‌ ఎక్వి‌ప్ మెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ లోని కొందరు ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకున్నారు. వందల కోట్లు కొల్లగొట్టేందుకు పక్కా ప్లాన్ తయారు చేసుకున్నారు.

ప్లాన్ లో భాగంగా 332 కోట్ల రుణం కోసం పీఈసీ సంస్థకు పైసీస్‌ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. వెంటనే ఫైల్‌ వేగంగా కదిలింది. భారీ రుణం తీసుకోవాలంటే ఏదో ఒక ఆస్తి తనఖా పెట్టాల్సి ఉంటుంది. అది కోట్లలో ఉండాలి. అంత ఆస్తిని ఎక్కడి నుంచి తీసుకు రావాలని ఆలోచించిన పైసీస్‌ కంపెనీ డైరెక్టర్లు.. కొత్వాల్‌గూడను తాకట్టు పెట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని ఎం.శివ భూషణ్‌ అనే వ్యక్తిని థర్డ్‌ పార్టీగా సృష్టించారు.

కొత్వాల్‌గూడలో 1 నుంచి 170 వరకు సర్వే నంబర్లలో శివ భూషణ్‌కు 1,820 ఎకరాల భూమి ఉందని చూపించారు. ఈ భూములను 1977లో సయ్యద్‌ మహ్మద్‌ హసన్‌ నుంచి శివ భూషణ్‌ కొనుగోలు చేసి 1979 జూన్‌ 14వ తేదీన రిజిస్టర్‌ చేసుకున్నాడని చూపించారు. దారుణమైన విష‍యం ఏమిటంటే, కొత్వాల్‌గూడలో ఉన్నవే 174 సర్వే నంబర్లు.. వాటిలో నాలుగు మినహా మిగిలినవన్నీశివభూషణ్‌వేనని చూపించారు. శివభూషణ్‌ కు చెందిన 1,820 ఎకరాల భూమిని పీఈసీ సంస్థకు లోన్ కు పూచీకత్తుగా చూపించారు. 2014 మే రెండో తేదీన రిజిస్ట్రేషన్‌ చేశారు. ప్లాటు ఏదైనా ఉంటే రుణం సులభతరం అవుతుంది. సరూర్‌నగర్‌లోని సర్వే నంబరు 9లో 500 గజాల ప్లాటును కూడా తనఖా పెట్టారు పైసీస్‌ ఎగ్జిమ్‌ ఇండియా లిమిటెడ్‌ డైరెక్టర్లు.

ఒక వ్యక్తికి వరుసగా 170 సర్వే నంబర్లలో 1820 ఎకరాల భూమి ఉంటుందా ? అది ప్రభుత్వ భూమా? పట్టా భూమా? అనే వివరాలు ఏవీ పట్టించుకోకుండానే పీఈసీ సంస్థ ఏకంగా 332 కోట్ల రుణం ఇచ్చేసింది. 1820 ఎకరాల భూమిని కేవలం 10 లక్షలకే తనఖా పెట్టారు. కానీ భూమి విలువ మాత్రం 364 కోట్ల రూపాయలుగా చూపెట్టారు. రిజిస్ట్రేషన్ శంషాబాద్ లో ఐతే దొరికిపోతామని భావించి యల్బీ నగర్ రిజిస్టార్ ఆఫీసును ఎంచుకున్నారు. ఇందుకు పీఈసి సంస్థ అధికారులు పైసీస్‌ కంపెనీ డైరెక్టర్లకు అన్నిరకాలుగా సహకరించారు.

332 కోట్ల రుణం తీసుకున్న తర్వాత పైసీస్‌ కంపెనీ నుంచి ఉలుకూ లేదు పలుకూ లేదు. మూడున్నర ఏళ్లలో వడ్డీతో సహా లోన్ 568 కోట్లకు చేరుకుంది. పీఈసి సంస్థ నోటిసులకు స్పందనే లేదు. తిరిగి లోన్ డబ్బులు కట్టే మాటనే ఎత్తడం లేదు పైసీస్‌ కంపెనీ. బేజారెత్తిన పీఈసి సంస్థ...కొత్వాల్ గూడ గ్రామాన్ని అమ్ముకుంటామని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. పీఈసీ సంస్థ లేఖతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తలలుపట్టుకుంటే, కొత్వాల్ గూడ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు.

పీఈసి సంస్థ నుంచి తీసుకున్న పైసీస్‌ ఎగ్జిమ్‌ ఇండియా లిమిటెడ్‌ తీసుకున్న 332 కోట్ల రుణం వడ్డీలతో కలిసి 568 కోట్లకు చేరుకుంది. ఆ కంపెనీ ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందనలేదు. మూడున్నర ఏళ్ల తర్వాత మేలుకున్న పీఈసి సంస్థ తమ వద్ద తనఖా పెట్టిన భూముల్ని అమ్ముకోవాలనుకుంటున్నామని..ఆ భూముల్లో ఏవైనా ప్రభుత్వ భూములు కానీ వివాదస్పద భూములు కానీ ఉన్నాయా..? చెప్పాలంటూ ఆ సంస్థ చీఫ్ మార్కెటింగ్ బ్రాంచ్ మేనేజర్ జీవై దూపటే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ భూముల్ని రిజిస్టర్ చేసింది కూడా మీ ప్రభుత్వ రిజిస్ట్రారే అని లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు.

పీఈసీ సంస్థ లేఖతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. కేంద్ర రంగసంస్థ గుడ్డిగా చేసిన తప్పుకు తామేది చేసేదంటూ మండిపడుతున్నారు. యల్బీనగర్ రిజిస్టార్ కాసులకు కక్కుర్తి పడి థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయించటం ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఈ పాయింట్ నే ప్రధానంగా చూపుతూ పీఈసీ సంస్థ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

తమ గ్రామాన్ని తాకట్టు పెట్టిన విషయం తెలుసుకున్న కొత్వాల్ గూడ గ్రామస్థులు లబోదిబోమంటున్నారు. మా భూములు ముక్కు ముఖం తెలియనివారు ఎలా తనఖా పెడ్తారని ప్రశ్నిస్తున్నారు. మా భూముల్ని అమ్మటానికి పీఈసీ సంస్థకు హక్కు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఈ స్కాం లోని పాత్రదారులు, సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories