logo
జాతీయం

ఉద్ధవ్‌‌తో కమలంలో ఎవరిని ఉద్ధరించడానికి? వ్యూహకర్త అమిత్‌షా ఆలోచనేంటి?

ఉద్ధవ్‌‌తో కమలంలో ఎవరిని ఉద్ధరించడానికి? వ్యూహకర్త అమిత్‌షా ఆలోచనేంటి?
X
Highlights

బీజేపీ వ్యూహకర్తగా పేరొందిన అమిత్ షా ఇప్పుడు ఒక మెట్టు దిగారు. కర్నాటక ఎన్నికల్లో తమ వ్యూహం ఫలించినప్పటికీ,...

బీజేపీ వ్యూహకర్తగా పేరొందిన అమిత్ షా ఇప్పుడు ఒక మెట్టు దిగారు. కర్నాటక ఎన్నికల్లో తమ వ్యూహం ఫలించినప్పటికీ, ఆశించిన ఫలితం రాకపోవడంతో బీజేపీ కాస్త తగ్గింది. 2019 ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా మిత్రపక్షాలతో తిరిగి చర్చలను ప్రారంభించింది. ముంబైలో శివసేన అధిపతి ఉద్ధవ్ థాకరే తో, చండీగఢ్ లో శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ తోనూ అమిత్ షా చర్చలు జరిపారు. మిత్రపక్షాలతో అమిత్ షా చర్చలు జరపడం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కర్నాటకలో బీజేపీ కి అధికారం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్ ఎంతో వేగంగా స్పందించింది. జేడీఎస్ తో చేతులు కలిపింది. తాజాగా బీహార్ లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎన్డీయే నుంచి వైదొలిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే తెలుగుదేశం బీజేపీకి దూరమైపోయింది. శివసేన ఎప్పటి నుంచో బీజేపీ పై విమర్శనాస్ర్తాలు సంధిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వివిధ పార్టీలతో తన మిత్రబంధాన్ని పటిష్ఠం చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించింది.

దేశంలో 2019 సాధారణ ఎన్నికలు దగ్గర పడిన నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో కదలికలు, వ్యూహాలు మొదలయ్యాయి. ఎన్డీయే లో బీజేపీ పెద్దన్నగా ఉన్న నేపథ్యంలో దానితో జరిపే బేరసారాలతో వీలైనన్ని ఎక్కువ సీట్లు రాబట్టుకోవాలని మిత్రపక్షాలు ఆశిస్తున్నాయి. అదే సందర్భంలో ఎన్నికల సంవత్సరంలో తమ రాష్ట్రాలకు వీలైనన్ని ఎక్కువ ప్యాకేజీలు, ప్రయోజనాలు దక్కించుకోవాలని కూడా అవి ఆశిస్తున్నాయి. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్ జనశక్తి పార్టీ నేత రాం విలాస్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఈ డిమాండ్ చేశాయి. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యపడదనే విషయం తెలిసినా.... పాశ్వాన్ ఈ డిమాండ్ చేయడం వెనుక బలమైన వ్యూహమే ఉంది. అసాధ్యమైన డిమాండ్ ను చేయడం ద్వారా వీలైనంత ఎక్కువ పథకాలు, ప్యాకేజీలను కేంద్రం నుంచి రాబట్టుకోవాలని రాం విలాస్ పాశ్వాన్ ఆశిస్తున్నారు. ఈ అంశంపై ఆయనతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చర్చించారు. ఇక బీహార్ సీఎం నితీశ్ కుమార్, జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీలతో కూడా అమిత్ షా చర్చించనున్నారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ తోనూ భేటీ అయ్యారు. బాదల్ కుమారుడు, పార్టీ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది పంజాబ్ లో ఎన్డీయే కూటమి పరాజయం రెండు పార్టీల సంబంధాలను కొంత ప్రభావితం చేసింది. రెండు పార్టీల మధ్య విభేదాలు లేవని శిరోమణి అకాలీదళ్, బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. 2019 లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిందిగా తమ కార్యకర్తలను కోరారు. బీజేపీకి శాశ్వత నేస్తంగా ఉంటామని సుఖ్ బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. ఆరు నెలల్లో జరుగబోయే కలసి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలసి కట్టుగా ఉంటూ విభేదాలను తొలగించుకోవాలని సూచించారు. మూడు దశబ్దాలుగా ఈ రెండు పార్టీల కూటమి పంజాబ్ లో అధికారంలో ఉండింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. మరో వైపున ఆమ్ ఆద్మీపార్టీ అక్కడ 20 సీట్లు గెలిచి అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ లో బీజేపీ, శిరోమణి అకాలీదళ్ లకు పొత్తు ఎంతో కీలకంగా మారింది. మరి ఈ ప్రయత్నాలు సఫలమవుతాయా?

Next Story