logo
జాతీయం

యోగిని సీఎం పీఠం నుంచి తప్పిస్తారా?

యోగిని సీఎం పీఠం నుంచి తప్పిస్తారా?
X
Highlights

యూపీ జంగిల్‌ రాజ్‌కు పాతరేసి, రామరాజ్యానికి పునరుద్దిస్తానన్నాడు. కానీ అరాచక రాజ్యం సాగుతోంది. యూపీ రూపురేఖలు...

యూపీ జంగిల్‌ రాజ్‌కు పాతరేసి, రామరాజ్యానికి పునరుద్దిస్తానన్నాడు. కానీ అరాచక రాజ్యం సాగుతోంది. యూపీ రూపురేఖలు మారుస్తానన్నాడు. కులంమతం గొడవలతో రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతోంది. గోరఖ్‌పూర్‌ను ఏలినట్టే, రాష్ట్రాన్ని పాలిస్తాడని ఆశించారు. కానీ అవన్నీ అడియాశలేనని, పిల్లల మరణమృదంగం సాక్షిగా అర్థమైంది. వివక్షపై దళిత ఎంపీలు తిరగబడుతున్నారు. అగ్రకులాలకేనా ప్రాధాన్యత, కనీస మర్యాద ఇవ్వరా అని, భాగస్వామ్య పార్టీలు కన్నెర్రజేస్తున్నాయి. యూపీ బైపోల్ సాక్షిగా, బీజేపీకి బీపీ పెరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్‌, పాలనపై ఒక్క ఏడాదిలో ఎందుకింత వ్యతిరేకత పెరుగుతోంది?

యోగి ఆదిత్యనాథ్‌. కాషాయదళం బ్రహ్మాస్త్రాల్లో ఒకరు. నరనరాన హిందూత్వ జీర్ణించుకున్న యోగి, గతేడాది మార్చి 19న యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో దశాబ్దాల తర్వాత యూపీ పీఠంపై బీజేపీ కూర్చోవడం, అందలోనూ, యోగి సింహాసనం అధీష్టించడంతో, సహజంగానే అంచనాలు పెరిగాయి. జంగిల్ రాజ్‌ పాలనకు చరమగీతం పాడి, ఇక పాలనలో, పెనుమార్పులు, అభివృద్దిలో, ప్రజల జీవన ప్రమాణాల్లో మెరుగైన దశ మొదలవుతుందన్న ఆశలు. 2019లోనూ, అత్యధిక ఎంపీ స్థానాలు ఇక్కడి నుంచే గెలవాలని బీజేపీ అంచనాలు. ఏడాది గడిచింది యోగి పాలనకు. కానీ ఆశలు, అంచనాలు పటాపంచలవుతున్నట్టు కనిపిస్తోంది యూపీలో. ఏడాదిలో యోగి పాలనపై వ్యతిరేకత తారాస్థాయికి చేరిందనడానికి, సిట్టింగ్‌ ఎంపీ స్థానాలైన, గోరఖ్‌పూర్‌, పూల్‌పూర్‌లో ఘోర ఓటమే నిదర్శనం. తాజాగా, దళిత ఎంపీలు, మిత్రపక్షాలు కూడా యోగిపై కన్నెర్రజేశాయి.

యోగిపై నలుగురు దళిత ఎంపీలు, నిరసనాస్త్రం సంధించారు. సీఎం తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారని, తమను లెక్క చేయడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఇటు యోగి కూడా దళితులపై దాడులు జరిగినా, పట్టించుకోవడం లేదని, బెహ్రయిచ్‌ దళిత ఎంపీ సావిత్రిబాయి ఫూలే సంచలన ఆరోపణలు చేశారు. అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు యూపీ సీఎంను కలవడానికి వెళ్లిన తనను గెంటి వేశారని, దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని రాబర్ట్స్‌గంజ్‌ ఎంపీ చోటేలాల్‌ మోడీకి లెటర్ రాశారు.

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలో మార్పులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో, యూపీలో నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. పలువురు చనిపోయారు కూడా. ఇప్పుడు ఇదే ఆందోళనను అడ్డంపెట్టుకుని, దళితులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని బీజేపీ దళిత ఎంపీలు, సొంత సీఎంపై ఆరోపణలు చేశారు.

ఇక తాజాగా బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌పై, లైంగిక దాడి ఆరోపణలు వెల్లువెత్తినా, యోగి ఆదిత్యనాథ్‌ ఆ‍యనను, రక్షించేందుకు ప్రయత్నించడం కూడా వివాదమవుతోంది. ఉనాలో ఓ మైనర్‌పై కుల్దీప్‌ సింగార్‌ అత్యాచారం చేశాడని, ఆరోపణలొచ్చాయి. బాధితురాలు, యోగి నివాసం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమె తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె తండ్రి, లాకప్‌లోనే చనిపోయారు. పోలీసులు చితకబాదడంతోనే, తన తండ్రి చనిపోయాడని బాలిక ఆరోపిస్తోంది. దీనిపై యూపీలో పెద్ద దుమారమే రేగుతోంది.

నేరగాళ్లను అరెస్ట్‌ చేయడానికి బదులు యూపీ బీజేపీ సర్కార్‌, బాధితులను అరెస్ట్‌ చేస్తోందని, అక్కడ గూండాల పాలన సాగుతోందని కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ ఆరోపించాయి. అత్యాచార బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించడం, పోలీసు కస్టడీలో ఆమె తండ్రి మరణించడం అత్యంత హేయమని మండిపడ్డాయి. మరోవైపు దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ విజయవంతం కావడంతో బీజేపీ భయపడిందని, అందుకే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులను వేధిస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు.

ఈ పరిణామాలు చూస్తుంటే, యోగి వ్యతిరేకంగా పావులు కదులుతున్నాయని అర్థమవుతోంది. ఇంకా యూపీ పీఠంపై యోగినే ఉంటే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సగం సీట్లు రావని, బీజేపీ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇంతలోనే యోగిపై ఎందుకంత వ్యతిరేకత పెరిగింది యోగి పీఠం కదలడం ఖాయమా? యోగి పాలనలో దొర్లిన తప్పులేంటి? అందుకు మూల్యమేంటి?

అన్నం ఉడికిందో లేదో, ఒక మెతుకుతోనే తెలిసిపోతుందన్నట్టుగా, పాలనాపగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే, యోగి దక్షత తేలిపోయింది. కోటలుదాటే మాటలు తాటాకుచప్పుళ్లేనని, ప్రభుత్వాసుపత్రుల్లో చిన్నపిల్లల మరణ మృదంగంతో బోధపడింది. తాను వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచిన గోరఖ్‌పూర్‌ ప్రభుత్వాసుపత్రిలోనే, ఆక్సిజన్ అందక పిల్లలు, పిట్టల్లా రాలిపోయారు. ఏదో చేస్తాడని భావించిన యోగి ఆదిత్యనాథ్‌‌, పాలన ఇంతేనా అని పిల్లలు పోగొట్టుకున్న తల్లులు రోదించారు. వారి వేదన, ఆవేశం ఓట్ల రూపంలో యోగిపై దండెత్తి, గోరఖ్‌పూర్‌ ఉప ఎన్నికల్లో దారుణంగా ఓడించింది.

బీజేపీ తన మేనిఫెస్టోలో అన్నదాతలకు అనేక హామీలిచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని పక్కనపెట్టేశాడు యోగి. రైతు రుణమాఫీ పూర్తిగా అమలుకాలేదు. పంటలకు కనీస ధర కల్పించడంలో విఫలమైంది. గోరఖ్‌పూర్, పూల్‌పూర్‌లో, రైతులు ఆందోళనలు చేసినా, యోగి పట్టించుకోలేదు. ఉపఎన్నికల్లో తమ కోపమేంటో యోగికి చూపించారు రైతులు.

సీఎంగా యోగి పగ్గాలు చేపట్టాక, యూపీలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన యోగి, తన వర్గానికే చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లను అందలమెక్కించాడు. రాజ్‌పుత్‌ ముఠాలు కూడా చెలరేగిపోయాయి. దళితులు, యాదవ్‌లపై అమానుషం పెరిగింది. గూండారాజ్‌కు పాతరేసి, రామరాజ్యాన్ని స్థాపిస్తానన్న యోగి, తన అనుచరుల దౌర్జన్యాన్ని పట్టించుకోలేదు. అంతెందుకు, తాజాగా ఉన్నావ్‌లో, మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సింగార్, బాధితురాలు తక్కువ కులానికి చెందిందని, మీడియా ముఖంగా లెక్కలేకుండా మాట్లాడాడు. కానీ ఇవన్నీ యోగికి కనపడ్డంలేదు. మరి ఇన్ని అరాచకాలు యథేచ్చగా సాగిపోతుంటే, వ్యతిరేకత పెరగకుండా ఉంటుందా?

అభివృద్దిలో అట్టడుగున ఉన్న యూపీ రూపురేఖలు మారుస్తా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తా, అహర్నిశలు మీ సేవలోనే తరిస్తానని ప్రమాణం చేశాడు యోగి. కానీ యూపీని వదిలేసి, దేశమంతా చుట్టేస్తున్నాడు. తన కంటే, గొప్ప మొనగాడు లేడన్నట్టుగా విర్రవీగుతూ కేరళ, కర్ణాటక, గుజరాత్‌లో తెగ తెరిగేశాడు. సొంతరాష్ట్రాన్ని గాలికొదిలేశాడు. ఇన్ని సమస్యలున్నా, పిల్లలు చచ్చిపోతున్నా, రైతులు రోదిస్తున్నా, నిరుద్యోగులు అల్లాడిపోతున్నా, శాంతిభద్రతలు దారితప్పుతున్నా, అవినీతి పెరుగుతున్నా, అన్నీ వదిలేసి అయ్యగారు దేశం మీదపడ్డారు. ఇది యూపీ ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

అంతేకాదు, యూపీ ప్రభుత్వంలో భాగస్వామి, ఎన్డీయే మిత్రపక్షం సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ, కూడా యోగిపై అమిత్‌ షాకు ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్‌ మాధ్యమిక విద్యా బోర్డులో ఇటీవల చేపట్టిన నియామకాలను ఆ పార్టీ తప్పుపట్టింది. సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌..అనే బీజేపీ నినాదం స్ఫూర్తిని యూపీలో అమలు చేయడం లేదని, అగ్రకులాలకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకుల బంధువులనే ఆ బోర్డులో నియమించారని ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో వెనకబడిన తరగతులు, షెడ్యూల్డు కులాల గతి ఏమిటని ప్రశ్నించింది. కేబినెట్‌ సమావేశంలో అందరి అభిప్రాయాలూ వింటారు...కానీ, నలుగురైదుగురు చెప్పిన మాటలను బట్టే నిర్ణయాలు తీసుకుంటారని, సమాజ్‌ పార్టీ సీరియస్‌ అయ్యింది. భారత్‌ బంద్‌లో దళితులపై లాఠీఛార్జ్, కేసులు, తాజాగా దళిత ఎంపీల నిరసనాస్త్రాలు, యోగి మీద దళిత వ్యతిరేక ముద్రను బలంగా వేస్తున్నాయి. యూపీలో అంబేడ్కర్ పేరుకు తండ్రి రామ్‌జీ పేరునూ జతచేయాలని, ఆదేశాలిచ్చి దుమారం రేపాడు యోగి.

యోగి తీరుపై మోడీ, అమిత్‌లు కూడా రగిలిపోతున్నారని తెలుస్తోంది. కేవలం ఐదుసార్లు గెలిచి, ఇక మోడీ తర్వాత బీజేపీకి దిక్కు తానేనన్నట్టుగా విర్రవీగుతున్నాడని పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోంది. పాలనాపరంగా దుందుడుకు నిర్ణయాలు, నిర్లక్ష్యం, పార్టీకే నష్టం తెస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. దీనికి గోరఖ్‌పూర్ అపజయమే నిదర్శనమని అంటున్నారు.

యోగి పాలనాతీరు, యూపీలో ఎస్పీ, బీఎస్పీ జట్టుకట్టడం, మోడీపై పెరుగుతున్న వ్యతిరేకత, దూరమవుతున్న మిత్రపక్షాలు, తనకు ఆయువుపట్టయిన యూపీపై బీజేపీకి ఆశలు సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో కష్టమని భావిస్తున్న బీజేపీ, యోగిని సీఎం పీఠం నుంచి తప్పించడమే మేలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో యోగి పీఠం కదలడం ఖాయమని సమాచారం. కానీ యోగిని తప్పిస్తే, యూపీ బీజేపీ నిట్టనిలువునా చీలుతుందన్న భయమూ, కాషాయదళంలో గూడుకట్టుకుంది. ఇలా యోగిపై ఏడాదిలోనే ఇంతవ్యతిరేకత కనీసం ముందు ముందు తన తీరులో యోగి మార్పులు చేసుకుంటాడో లేదంటే జనమే తిరగబడి మార్చే పరిస్థితులు తెచ్చుకుంటాడో.

Next Story