జయహో జవాన్

జయహో జవాన్
x
Highlights

దేశం లోపల మనం ఇంత భద్రంగా, ప్రశాంతంగా ఉన్నామంటే, అందుక్కారణం దేశం సరిహద్దుల్లో మన వీర సైనికుల పహారా. భూతలం, గగనతలం, సాగరంలోనూ, మన సైనికులు రాత్రనకా,...

దేశం లోపల మనం ఇంత భద్రంగా, ప్రశాంతంగా ఉన్నామంటే, అందుక్కారణం దేశం సరిహద్దుల్లో మన వీర సైనికుల పహారా. భూతలం, గగనతలం, సాగరంలోనూ, మన సైనికులు రాత్రనకా, పగలనకా ప్రాణాలకు తెగించి గస్తీ కాస్తున్నందుకే స్వేచ్చావాయువులు పీల్చుకోగలుగుతున్నాం.

భారతదేశ భూభాగ సరిహద్దు పొడవు 15,200 కి.మీ.
భారతదేశ భూభాగ సరిహద్దు పొడవు 15,200 కి.మీ అయితే, తీరరేఖ పొడవు 6,100 కి.మీ. మనకు మొత్తం ఏడు సరిహద్దు దేశాలున్నాయి. చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక. వీటిలో అత్యంత కట్టుదిట్టమైనవి, నిత్యం అలజడులు చెలరేగే సరిహద్దులు పాకిస్తాన్, చైనా. ఇందులో మొదట చెప్పుకోవాల్సిన అత్యంత ప్రమాదకరమైన సరిహద్దు సియాచిన్‌ గ్లేసియర్.
భారత్-పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న సియాచిన్ ప్రాంతం ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రం. దీన్ని మృత్యుక్షేత్రమని కూడా అంటారు. ఎందుకంటే వందలాది మంది సైనికులను పొట్టనపెట్టుకుంది ఈ సియాచిన్ గ్లేసియర్.

22వేల అడుగుల ఎత్తైన సియాచిన్
దాదాపు 22వేల అడుగుల ఎత్తైన మంచుశిఖరం సియాచిన్. ఇక్కడ ఉష్ణోగ్రత ఎంతో తెలుసా మైనస్ 45 డిగ్రీలు. అంటే ఎముకలే కాదు రక్తమూ గడ్డకట్టుకుపోయే చలి. ప్రతికూల పరిస్థితులకు పరాకాష్ట. మైనస్‌ వన్‌ డిగ్రీ అంటేనే, మనం వణకిపోతాం. మరి మైనస్ 45 డిగ్రీలంటే, మామూలు విషయం కాదు. అందుకే సియాచిన్‌లో పహారా కాయడమంటే, జీవితాలను పణంగా పెట్టడం. ఎప్పుడు మంచుచరియలు విరిగిపడతాయో తెలీదు. ఎప్పుడు మంచు తుపాను చెలరేగుతుందో తెలీదు. నిత్యం మారే వాతావరణం. అయినా ప్రాణాలు పణంగాపెట్టి, దేశం కోసం పహారా కాస్తుంటారు జవాన్లు.

1984 నుంచి సియాచిన్‌లో భారత సైనికుల పహారా
వాస్తవానికి స్వాతంత్ర్యం తర్వాత, మూడున్నర దశాబ్దాల వరకు సియాచిన్‌లో భయానక వాతావరణం దృష్ట్యా సైనికులను గస్తీకి ఉంచలేదు. అయితే పాకిస్తాన్‌ చొరబాట్లకు ప్రయత్నించడం, యుద్ధ కవ్వింపులు, వ్యూహాత్మక ప్రాంతం నేపథ్యంలో, 1984 నుంచి సియాచిన్‌లో మన సైనికుల కవాతు మొదలైంది. ప్రతి ఏడాది మూడు బెటాలియన్ల నుంచి 3,000 మంది నుంచి 4 వేలమంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలు అందిస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు గస్తీ కాస్తుంది.

సియాచిన్‌లో దాదాపు 900 మంది జవాన్ల వీరమరణం
ముందే చెప్పినట్టు సియాచిన్‌ యుద్ధక్షేత్రమే కాదు, మృత్యుక్షేత్రం కూడా. ఇప్పటివరకూ దాదాపు 900 మంది భారత జవాన్ల వీరమరణం పొందారు. మొన్న లాన్స్ నాయక్ హనుమంతప్ప కూడా ఇలాగే ప్రాణాలు త్యాగం చేశాడు. పొరుగుదేశం కాల్పులే కాదు, విభిన్న వాతావరణ పరిస్థితులు, మంచు చరియలు విరిగిపడటం, ఇలా ఎన్నో కారణాలకు ప్రాణాలు కోల్పోయారు జవాన్లు. అందుకే ప్రపంచంలో అత్యంత భయంకరమైన యుద్ధక్షేత్రాల్లో ఒకటి సియాచిన్‌ గ్లేసియర్.

నిత్యకురుక్షేత్రం కాశ్మీర్‌లో రక్షణదళాలు
ఇక జమ్మూకాశ్మీర్‌ కూడా క్లిష్టమైన బోర్డర్స్‌లో ఒకటి. పాకిస్తాన్‌ నుంచి నిత్యం ఉగ్రవాదుల చొరబాట్లు, పాక్ సైనికుల కాల్పులు, స్థానికంగా కొందరు ఛాందసుల నుంచి ప్రతిఘటనలు. భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మకమైన కాశ్మీర్‌లో విధులు నిర్వహించే సైనికులకు ఇది నిత్యకురుక్షేత్రం.

ఇండో-చైనా బోర్డర్‌లో భారత సైనికుల పహారా
ఇక ఇండియా, చైనా సరిహద్దు 4,062 కి.మీ. అరుణాచల్, సిక్కిం, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్, చైనాకు సరిహద్దు రాష్ట్రాలు. కానీ చైనా ప్రతిరోజు, మన భూభాగంలోకి చొచ్చుకొస్తూ, కవ్విస్తోంది. డ్రాగన్‌ సైనికులను, ఎప్పటికప్పుడు తరిమేస్తున్నారు భారత సైనికులు.

ఆకాశంలో సగం. అంతేకాదు. ఇప్పుడు సమరంలోనూ సగం. తొలినాళ్లలో సరిహద్దులను కాపాడే వీర నారీమణులు..శత్రువుల గుండెల్లో దడ పుట్టించే రణధీరలు..నింగిని జల్లెడపట్టే సివంగులు..సంద్రంలో అలలతో పోటెత్తే అతివలు..యుద్ధభూమిలో తొడగొట్టే మగువలు..ఆర్మీలో పురుషులతో పోటీగా మహిళా సైనికులు

ఇండో టిబెటన్ బోర్డర్. అత్యంత కీలకమైన సరిహద్దు ప్రాంతం. ఎత్తైన పర్వతాలు. ఎముకలు గడ్డకట్టే చలి. శత్రు దేశాలు, ఉగ్రవాదులు కయ్యానికి కాలుదువ్వే ప్రాంతం. ఈ సరిహద్దుకు కాపాలాదారుల్లో, పురుషులతో పాటు మహిళలూ ఉన్నారు. మాతృదేశ రక్షణలో ప్రాణాలర్పిచండానికి తెగించిన మగువలు. ర్యాపిడ్‌ ఫైర్‌తో విరుచుకుపడుతున్న మహిళలను చూశారా. ఐటీబీపీలో తొలి మహిళా కానిస్టేబుల్స్. హమ్‌ ఐటీబీపీకి షాన్‌ హై అంటూ నినదిస్తూ, కదం తొక్కుతున్నారు. యుద్ధానికి సిద్దమంటూ సమరనాదం చేస్తున్నారు. పురుషులతో సమానంగా ట్రైనింగ్. టార్గెట్‌ గురితప్పకుండా ర్యాపిడ్‌ ఫైరింగ్. డేరింగ్, డాషింగ్‌, స్టన్నింగ్, దటీజ్ వుమన్ రైజింగ్.

ఐటీబీపీలో మహిళలకు ప్రత్యేక శిక్షణేమీ ఉండదు. పురుషులతో పాటే అన్ని సాహసాలు, వ్యాయామాలు చేయాల్సిందే. పర్వతాలు, శీతలప్రదేశాల్లో పని చేయాల్సి ఉన్నందుల్లా, టఫ్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఈ కఠినాతి కఠినమైన ట్రైనింగ్‌, మొదట్లో కొంచెం కష్టమనిపించినా, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేశామంటోంది విజేత. ఐటీబీపీలోని మహిళా వింగ్‌లో చాలా రాష్ట్రాల లేడీస్‌ ఉన్నారు. పర్వతాల రాష్ట్రం ఉత్తరాఖండ్‌ అమ్మాయిలే ఎక్కువ. పర్వతాలు ఎక్కిదిగాలి. ఇలాంటి విభిన్న, విపత్కర పరిస్థితుల్లో ఒక మహిళ పని చేయడమంటే, చాలామంది అబ్బో అంటారు. గడపదాటేందుకూ నిరాకరణకు గురైన స్త్రీ, దేశ గడపలో పహారా కాయడమంటే ఆషామాషీ కాదంటూ ఆశ్చర్యపోతారు. ఐటీబీపీ తొలి మహిళా బ్యాచ్‌లో దాదాపు 500 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. 44 వారాల పాటు అత్యంత కఠినమైన ట్రైనింగ్ పొందారు. చిమ్మచీకటిలోనూ సరిహద్దు కాపలా. భయం లేదు. వణుకు లేదు. గుండెలనిండా దేశం పట్ల ప్రేమ. శత్రువుల నుంచి దేశాన్ని రక్షించాలన్న పట్టుదల. ఇవే ఐటీబీపీ మహిళా కానిస్టేబుల్స్‌ ను ముందుకు నడిపిస్తున్న మోటో.

Show Full Article
Print Article
Next Story
More Stories