తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది

x
Highlights

కాంగ్రెస్ లో పునరుత్తేజం కనిపిస్తోందా? అందరూ కలిస్తే తప్ప అధికార పార్టీని ఎదుర్కోలేమన్న మానసిక స్థితి నుంచి ఒంటరిగానైనా ఎదిరిస్తామని చెప్పగలిగిన...

కాంగ్రెస్ లో పునరుత్తేజం కనిపిస్తోందా? అందరూ కలిస్తే తప్ప అధికార పార్టీని ఎదుర్కోలేమన్న మానసిక స్థితి నుంచి ఒంటరిగానైనా ఎదిరిస్తామని చెప్పగలిగిన స్థితి ఎక్కడ నుంచి వచ్చింది? టీ-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుకోసం అనుసరిస్తున్న విధానాలేంటి? తాను సక్సెస్ ఫుల్ నేతగా అనిపించుకునేందుకు ఆయన ఏం చేస్తున్నారు?

తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. పార్టీలో ఎన్ని ఇబ్బందులున్నా తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకొని ప్రజల్లో పర్యటిస్తోంది. ప్రజా చైతన్య బస్సుయాత్రకు మంచి స్పందన వస్తూండడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే విమర్శలు చేస్తూ ముందుకు సాగుతోంది. ప్రజల్లో అధికార పార్టీకి తామే ప్రత్యమ్నాయం అనే సంకేతాన్ని ఇవ్వడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

సాధారణ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన ప్రతిపక్షం దూకుడు పెంచింది. గతంలో కేవలం ప్రభుత్వ తప్పిదాలపైనే ప్రచారం చేస్తూ పార్టీ కార్యాలయాలకే పరిమితం అయ్యే పార్టీ ఇప్పుడు ప్రజాక్షేత్రాన్ని ప్రభావితం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అధిష్టానంతో పాటు రాష్ట్ర పార్టీ కూడా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని భావించి ప్రజల్లో పర్యటిస్తోంది. ఫిబ్రవరి 26న ప్రజాచైతన్య యాత్ర పేరుతో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన బస్సుయాత్రను మొత్తం 45 రోజులకు ప్లాన్ చేసుకున్నారు. యాత్ర ప్రారంభించిన మూడురోజులకే ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని నేతలు భావిస్తున్నారు.

కేసీఆర్ ఫ్యామిలీలో ముఖ్య నేతలపై ప్రత్యేక నిఘా?
ఇక ఈ బస్సుయాత్రలో టిఆర్ఎస్ ప్రభుత్వ హామీల పైన్నే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ప్రతి నియోజికవర్గం కేంద్రంగా జరుగుతున్నబస్సు యాత్రలో స్థానిక సమస్యలతో పాటు ప్రధానంగా ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, అమరవీరులకు ఉద్యమ పార్టీ చేస్తున్న ద్రోహం, నిరుద్యోగులు నేటికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోయారన్న అంశాలపై ఫోకస్ చేస్తున్నారు. ఈ అంశాలను అస్త్రాలుగా మార్చుకొని టీ-పీసీసీ చీఫ్ ఉత్తం తన ప్రసంగానికి పదునెక్కిస్తున్నారు.

టిఆర్ఎస్ లో జరుగుతున్న అవినీతినీ టీ-కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా కేసీఆర్ కుటుంబంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మంత్రుల శాఖలపై కాంగ్రెస్ నేతలు ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల్లో అవినీతిని పదే పదే ప్రజల్లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి జరిగిందని ప్రజలకు చెప్పగలిగితే ఓట్లను మలచుకోవడం ఈజీ అవుతుందనే భావనలో టీ-కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు సమాచారం. అందుకే ప్రజా చైతన్య యాత్రలో ఆ అంశంపై ప్రత్యకంగా దృష్టి సారించినట్లు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories