వైఎస్‌ ఆత్మకు చెక్‌ పడిందా?

x
Highlights

ఆయన ఒకప్పుడు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ను కనుసైగతో శాసించారు బలమైన సీఎంకే, బలమైన స్నేహితునిగా మెలిగారు ఆ‍యన కోరితే హైకమాండ్‌ కాదనలేదు. ఆయన కన్నెర్రజేస్తే...

ఆయన ఒకప్పుడు ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ను కనుసైగతో శాసించారు బలమైన సీఎంకే, బలమైన స్నేహితునిగా మెలిగారు ఆ‍యన కోరితే హైకమాండ్‌ కాదనలేదు. ఆయన కన్నెర్రజేస్తే స్టేట్‌ లీడర్‌ ఎవరైనా షేక్‌ అవ్వాల్సిందే. కానీ తెలంగాణ ఎన్నికల సమరంలో మాత్రం, ఆయన ఊసు వినిపించడం లేదు ఆయన హడావుడి కనిపించడం లేదు ఇంతకీ ఎవరాయన?

ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. అయితే ప్రస్తుతం ఆయన మాట కాంగ్రెస్‌ అధిష్టానం వద్ద చెల్లుబాటు కావడంలేదనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఆయనపై గత కొద్దిరోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ పార్టీలో ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన చెప్పిందే వేదం. ఇక వైఎస్ హయాంలో అయితే ఆయన షాడో సీఎంగా పనిచేశారనే చర్చ ఉండేది. వైఎస్ మరణం తరువాత ఆయన ప్రభావం కొద్దికొద్దీగా తగ్గింది. అయితే రాష్ట్ర విభజన తరువాత, రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీలలో చక్రం తిప్పే ప్రయత్నం చేసినట్లు చర్చ జరిగింది. 2014 ఎన్నికల్లోనూ, కేవీపీ చెప్పిన అభ్యర్థులకే టికెట్లు దక్కాయన్న వార్తలొచ్చాయి. దీంతో కేవీపీపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధికార టీఆర్‌ఎస్‌కు కేవీపీ పరోక్షంగా సహకరిస్తున్నారని కొంతమంది సీనియర్లు కంప్లైంట్ చేశారు. ఈ ఎన్నికల్లోనూ అభ్యర్థుల వడపోతపై ఆయన జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారని, కొందరు బాహాటంగా ఆరోపించారు. దీంతో ఇన్నాళ్లూ చూసీచూడనట్టు వ్యవహరించిన హైకమాండ్, కేవీపీకి ప్రస్తుతం చెక్‌పెట్టినట్టు సమాచారం.

దీనికి తోడు జాతీయస్థాయిలో కాంగ్రెస్-టీడీపీ చేతులు కలపడంతో, చంద్రబాబు సైతం కేవీపీ వ్యవహారాలపై ఏఐసీసీ అధినేతకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో కేవీపీకి కాంగ్రెస్ అధిష్టానం చెక్ పెట్టక తప్పలేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీని ప్రభావంతోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో, రాజ్యసభ సభ్యుడు కేవీపీ ప్రభావం కనిపించడంలేదని పార్టీలో చర్చ జరుగుతోంది.

ఈ ఎన్నికల్లోనూ తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునేందుకు కేవీపీ చాలా ప్రయత్నాలు చేశారట. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, కార్తీక్ రెడ్డి , nsui ప్రెసిడెంట్ బాలుమూరి వెంకట్‌లతో పాటు మరికొంత మంది నేతలు కేవీపీని నమ్ముకుని టిక్కెట్ కోసం భారీ ఆశలు పెట్టుకున్నారు. చివరకు ఎవ్వరికీ టిక్కెట్ రాలేదు. దీంతో నేతలంతా కేవీపీ లాబీయింగ్ అధిష్టానం వద్ద, పనిచేయడంలేదనే చర్చ గాంధీ భవన్‌లో జోరుగా సాగుతోంది. కేవీపీ మీద ఆశలుపెట్టుకుని ప్రశాంతంగా ఉన్న పొన్నాలకు టిక్కెట్ రాకపోవడంతో, ఆఖరికి గట్టిపట్టుబట్టి మళ్ళీ అధిష్టానాన్ని ఒప్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇటు టీపీసీసీ ఫిర్యాదులు, టీడీపీ అధినేత కంప్లైంట్లు, ఈ ఎన్నికల్లో కేవీపీని నామామాత్రం చేశాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు సీట్ల కేటాయింపుల్లో, అన్నీతానై నడిపిన వైఎస్‌ ఆత్మకు, ఈసారి చెక్‌పడిందని గాంధీ భవన్‌లో చర్చించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories