logo
జాతీయం

ఏ పార్టీ ఏ కూటమి వైపు?

ఏ పార్టీ ఏ కూటమి వైపు?
X
Highlights

ఫ్రంట్‌లు కట్టడంలో, ఎవరికివారే ఫ్రంట్‌ ఉండేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇటు కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటుంటే,...

ఫ్రంట్‌లు కట్టడంలో, ఎవరికివారే ఫ్రంట్‌ ఉండేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. ఇటు కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటుంటే, మమతా బెనర్జీ కూడా మొదట మద్దతు పలికారు. కానీ తాను వేరుగా, నేరుగా ఢిల్లీలో పార్టీల నాయకులతో చర్చలు జరిపారు మమతా బెనర్జీ. ఇటు కేసీఆర్‌ కూడా ఫెడరల్‌ ఫ్రంట్‌పై వేగం పెంచారు. ఇంతకీ కేసీఆర్ ఫ్రంట్, మమత ఫ్రంట్‌ వేరువేరా....ఒక్కటేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమికి కేసీఆర్‌ ప్రయత్నాలు
70ఏళ్ల స్వతంత్ర భారతావనిలో, కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు చేసిందేమీలేదంటున్న, టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో దేశంలో గుణాత్మక మార్పు తెస్తామంటున్నారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటించగానే, తనకు మమతా బెనర్జీతో పాటు పలువురు ప్రాంతీయ పార్టీల నాయకులు ఫోన్‌లు చేశారని చెప్పారు కేసీఆర్. తర్వాత కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీని కలిశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఇరువురూ ఆసక్తి వ్యక్తం చేశారు.

మమత సొంతంగా ఫ్రంట్‌ ప్రయత్నాలు దేనికి సంకేతం?
మమతా బెనర్జీని కలిసిన తర్వాత, ఫెడరల్‌ ఫ్రంట్‌పై కాస్త వేగం తగ్గించినట్టు కనిపించారు కేసీఆర్. అటు మమతా బెనర్జీ ఢిల్లీ వెళ్లి, వివిధ పార్టీల నాయకులను కలిశారు. కేసీఆర్‌తో ప్రమేయం లేకుండా ఆమె సొంతంగా కూటమి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడుతున్నారు. అయితే కేసీఆర్‌ ఫెడరల్‌ కూటమిపై చర్చ తగ్గుముఖం పట్టిన సమయంలో, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌, హైదరాబాద్‌ వచ్చి కేసీఆర్‌ను కలవడంతో మరోసారి ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చ మొదలైంది.

ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశాలు, లక్ష్యాలను సోరెన్‌కు వివరించిన కేసీఆర్ ..ప్రగతిభవన్‌లో సోరెన్‌కు సాదర స్వాగతం పలికారు కేసీఆర్. దేశ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశాలు, లక్ష్యాలను సోరెన్‌కు కేసీఆర్ వివరించారని తెలిసింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా, ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్‌కు ఆలోచనచేశామని సీఎం తెలిపారు. మమతాబెనర్జీతో సమావేశ విశేషాలను సోరెన్‌తో పంచుకున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై ఆలోచన చాలా బాగుందని చెప్పారు సోరెన్.

త్వరలో మరిన్ని పార్టీల లీడర్లతో కేసీఆర్ సమావేశం
త్వరలో మరిన్ని పార్టీలతో సమావేశం కాబోతున్నారు కేసీఆర్. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అజిత్‌జోగిని కలవబోతున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనపై జోగి సానుకూలంగా స్పందించారని, హేమంత్‌కు వివరించారు కేసీఆర్. అలాగే ఢిల్లీ వెళ్లి మరిన్ని పార్టీల లీడర్లతో సమావేశం కాబోతున్నారు. ఆమ్‌ఆద్మీ ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, ఇలా చాలా పార్టీల నాయకులతో సమావేశం కాబోతున్నారు కేసీఆర్.

కవులు, కళాకారులు, రచయితలు
రాజకీయ ఎజెండా కాకుండా ప్రజల ఎజెండానే ఫ్రంట్ ఎజెండాగా ఉండాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్, ఈ క్రమంలోనే కవులు, కళాకారులు, రచయితలు, వ్యవసాయరంగ నిపుణులు, ఆలిండియా సర్వీసు మాజీ అధికారులు, మాజీ సైనికాధికారులు ఇలా ఆయా రంగాలవారీగా అభిప్రాయాలను సేకరించాలని ఆలోచన చేస్తున్నారు.

ఏ పార్టీ ఏ కూటమి వైపు?
అయితే బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ రంగంలోకి దిగింది. మిత్రపక్షాలకు సోనియా గాంధీ విందు కూడా ఇచ్చారు. ఇంకోవైపు శరద్‌ పవార్‌ కూడా కొత్త ఫ్రంట్‌ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడుతున్నా, కాంగ్రెస్‌ గూటి కిందకే అందర్నీ తేవాలన్న లక్ష్యంతో ఉన్నారని తెలుస్తోంది. ఇంకోవైపు మమత, మోడీ వ్యతిరేక కూటమి. అటు ఎన్డీయేకి రాంరాం చెప్పిన చంద్రబాబు కూడా యునైటెడ్‌ ఫ్రంట్‌‌కు శాయశక్తులా లోలోపల ప్రయత్నాలు. ఇటు కేసీఆర్ ఫెడరల్‌ ఫ్రంట్‌ రాజకీయం. మరి ఉన్నవి అవే పార్టీలు మరి ఏ కూటమి వైపు ఎవరు మళ్లుతారు...కేసీఆర్‌ చెంత ఎందరున్నారు...ఎందరొస్తున్నారు?

ఎవరికివారే ఫ్రంట్‌లు కడుతున్నారు. మమతా బెనర్జీ ఏకంగా నాలుగురోజులు హస్తినలో తిష్టవేసి అన్ని పక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. అటు శరద్‌పవార్‌ కూడా అదేపనిలోనే ఉన్నారు. కానీ మమత, శరద్‌పవార్‌లు కాంగ్రెస్‌ వైపు అన్ని పార్టీలనూ లాగేందుకే, ముందస్తుగా గ్రౌండ్‌ సిద్దం చేస్తున్నారన్న ప్రచారమూ సాగుతోంది. దీంతో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ నిలబడుతుందా, నిలబడదా అన్న అనుమానాలు పెరుగుతుంటే, మరోవైపు ఈ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు, త్వరలో ఢిల్లీకెళ్లి భావసారూప్య పార్టీల నాయకులతో సమావేశం కాబోతున్నారు. మరి ఫ్రంట్‌ రన్నింగ్‌లో ఫ్రంటున్నదెవరు?

తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్నడూ లేనంతగా థర్డ్‌ ఫ్రంట్‌‌ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. నాలుగురోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు దీదీ. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత గోపాల్ యాదవ్, డీఎంకే నేత కనిమొళి, శివసేన ఎంపీలను కలిశారు. అలాగే టీఆర్ఎస్‌, టీడీపీ ఎంపీలతోనూ మాట్లాడారు. త్వరలో లక్నో వెళ్లి అఖిలేష్‌, మాయావతిలను కూడా కలవబోతున్నారు.

మమతా బెనర్జీ టార్గెట్ బీజేపీ
మమతా బెనర్జీ టార్గెట్ బీజేపీ. కాంగ్రెస్‌పై పెద్దగా వ్యతిరేకత లేదు. ఎందుకంటే, పశ్చిమబెంగాల్‌లో తృణముల్‌ పోటీగా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మోడీ, అమిత్‌ షాలు రకరకాల వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సీబీఐని కూడా బూచిగా చూపుతున్నారు. దీంతో పశ్చిమబెంగాల్‌లో బీజేపీని నిలువరించడానికి, మోడీ వ్యతిరేకతను జాతీయస్థాయిలో చాటడానికి, అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు దీదీ.

మమత బెనర్జీ అయితే, కేసీఆర్‌ ఫ్రంట్‌లో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు. వేరేవేరుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఒకే ఫ్రంట్ కోసమేనా అన్నదీ తేలడం లేదు. అలాగని కాంగ్రెస్‌ లేదంటే చంద్రబాబు కూటమిలో జాయిన్‌ అవుతున్నట్టు చెప్పలేదు. మమత తీరును బట్టి చూస్తుంటే, అన్ని ఆప్షన్స్ ఆలోచిస్తున్నారని అర్థమవుతోంది. అంతేకాదు, కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక పక్షాల కూటమి లేదని, మరో ఫ్రంట్‌ పెట్టినా నిలబడదని, కొన్ని రోజుల ముందు దీదీ, తమ ఎంపీలతో వ్యాఖ్యానించారట. అంటే తన రాష్ట్రంలో ప్రబలశక్తిగా ఎదుగుగున్న బీజేపీని నిలువరించడానికి కాంగ్రెస్‌లాంటి బలమైన పార్టీతో జతకడితేనే బావుంటుందని మమత భావిస్తున్నారని తెలుస్తోంది. అటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిలో బీజేపీపై ముప్పేటదాడి చేయాలంటే, కాంగ్రెస్‌తోనే కలిసి నడవాలని ఆలోచిస్తున్నారట. అందుకే ఇటు పవార్, అటు మమత మోడీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేసి, తిరిగి కాంగ్రెస్‌ పంచన చేర్చేందుకే ప్రయత్నిస్తున్నారా...లేదంటే నిజంగానే కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమికి శక్తి కూడగడుతున్నారా అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే, ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు ఏ జాతీయ పార్టీవైపు మళ్లుతాయో వాటికే తెలీదు. అవసరాలు, ప్రయోజనాలే అంతిమంగా వాటి నడకను నిర్ణయిస్తాయి. కానీ కలిసికట్టుగా పోరాడితేనే బీజేపీని నిలువరించొచ్చని యూపీ బైపోల్‌ ఫలితం నిరూపించడమే, కూటమి రాజకీయాలకు మరింత బలాన్నిచ్చింది.

ఏప్రిల్ 2,3 తేదీల్లో హస్తిన చంద్రబాబు
అటు చంద్రబాబు కూడా ఏప్రిల్ 2,3 తేదీల్లో ఢిల్లీ వెళ్తున్నారు. విపక్షాలతో భేటి అయ్యి, అవిశ్వాస తీర్మానంపై మద్దతివ్వాల్సిందిగా కోరే అవకాశముంది. పనిలో పనిగా యునైటెడ్‌ ఫ్రంట్‌పై ఏకాభిప్రాయంకూడగట్టే ఛాన్సుంది. ఇలా ఎవరికి వారు ఫ్రంట్‌లు కట్టే ప్రయత్నాలు. కానీ ప్రతి ప్రాంతీయ పార్టీ అధినేత ప్రధాని వంటి పెద్దపెద్ద పదవులపై కలలుకంటున్నవారే. అందుకే ఈ మూడో కూటమి ప్రయత్నాలు కొంతవరకు రాజకీయ సమీకరణలపై చర్చ మొదలెట్టినా, చివరికి వరకూ ఈ పార్టీలు ఒకేతాటిపై నిలబడతాయన్న గ్యారంటీ లేదు. మూడో కూటమి ముచ్చటగా మిగిలిపోతోందని, చరిత్రలో జరిగిన పరిణామాలే నిదర్శనం.

Next Story