వెలుగులోకి వ‌చ్చిన నీర‌వ్ మోడీ తమ్ముడి కుంభ‌కోణం

వెలుగులోకి వ‌చ్చిన నీర‌వ్ మోడీ తమ్ముడి కుంభ‌కోణం
x
Highlights

పంజాబ్ నేషనల్ బ్యాంక్.. జాతీయస్థాయిలో భూకంపం సృష్టించింది. అక్రమార్కుడికి దొడ్డిదారిన వేల కోట్ల సొమ్మును కట్టబెట్టి బ్యాంకింగ్ సెక్టార్ లో భారీ...

పంజాబ్ నేషనల్ బ్యాంక్.. జాతీయస్థాయిలో భూకంపం సృష్టించింది. అక్రమార్కుడికి దొడ్డిదారిన వేల కోట్ల సొమ్మును కట్టబెట్టి బ్యాంకింగ్ సెక్టార్ లో భారీ స్కాంకు తెరతీసింది. అయితే అంతకు మించిన కుంభకోణం అదీ ఓ గ్రామీణ బ్యాంకులో చోటు చేసుకుంది. అవును లక్షల కోట్ల డిపాజిట్లు ఉండే బ్యాంకులో వేల కోట్లు స్కాం జరిగింది. కానీ ఓ గ్రామీణ బ్యాంకులో వంద కోట్లు కూడా ఉండని బ్యాంకులో ఏకంగా 9 కోట్ల రూపాయలను ఒకే ఒక్క ఉద్యోగి నొక్కేశాడు. డిపాజిటర్లకు పంగనామాలు పెట్టాడు. ఆ కథేంటో ఆ బిగ్గెస్ట్ బ్యాంక్ స్కాం ఎలా జరిగిందో ఓసారి చూద్దాం.

పంజాబ్ దాకా ఎందుకు.. గ్రామీణ బ్యాంకుల్లోనే సేమ్ సీన్
నీరవ్ మోడీ.. లలిత్ మోడీ.. విజయ్ మాల్యా.. ఈ లెవెల్లో పేరు మార్మోగకపోయినా.. ఇతగాడి పేరు మాడి జైపాల్‌రెడ్డి. కానీ వీళ్ల దారిలోనే.. ఏంచక్కా బ్యాంకుకు కన్నం వేశాడు. కంచే.. చేను మేసినట్టుగా.. బ్యాంకులో పనిచేస్తూనే.. డిపాజిట్ దారుల సొమ్మును తన జేబులో వేసుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేసిన మాడి జైపాల్ రెడ్డి.. విధులు నిర్వహిస్తూనే ఈ స్కాంకు తెరతీశాడు. తన దగ్గరకు వచ్చే టర్మ్ డిపాజిట్ రశీదులను రకరకాల పద్దతుల్లో ఫోర్జరీ చేసేవాడు. రశీదుపై ఉన్న అంకెల్లో ఒకదాన్ని మాయం చేసి రికార్డుల్లో జమ చేసేవాడు. అలాగే ఖాతాదారుల నుంచి డిపాజిట్ డబ్బులు తీసుకుని.. నకిలీ రశీదులు కూడా ఇచ్చేవాడు. అదేవిధంగా బ్యాంకు వెలుపల ఖాతాదారుల నుంచి డబ్బులు తీసుకొని వారి పాస్‌ పుస్తకాల్లో సంతకాలు చేసేవాడు. ఇలా తేడా వచ్చిన సొమ్మును జైపాల్ రెడ్డి తన ఖాతాలో వేసుకునే వాడు.

2010 జులై నుంచి 2018 జనవరి వరకు బ్యాంకులో ఉద్యోగం చేసినన్ని రోజులూ జైపాల్ రెడ్డి ఈ తరహా మోసాలకు పాల్పడ్డాడు. ఇలా సంపాదించిన మొత్తం 8 కోట్ల 94 లక్షల సొమ్మును మరో బ్యాంకుకు బదిలీ చేసుకున్నాడు. బ్యాంకు మేనేజర్‌తో పాటు సిబ్బంది సహకారంతోనే ఈ చీటింగ్ కు పాల్పడినట్లు తేలింది. అయితే తాను డిపాజిట్ చేసిన సొమ్ముకు సంబంధించి ఇచ్చిన రశీదులో లోపాలున్నాయని అజీజ్‌నగర్‌కు చెందిన రాంరెడ్డి అనే ఖాతాదారుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బ్యాంకు అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. దీంతో రాంరెడ్డి చేసిన ఆరోపణలతో పాటు జైపాల్‌రెడ్డి హయాంలో జరిగిన మోసాలన్నీ వెలుగుచూశాయి.

తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్‌ మండల రవీందర్‌రెడ్డి ఈ వ్యవహారంపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అందిన ఫిర్యాదు మేరకు ప్రధాన సూత్రదారి అయిన జైపాల్‌రెడ్డితోపాటు అప్పటి బ్రాంచి మేనేజర్లు మోజెస్‌, లక్ష్మినర్సయ్య, చంద్రయ్య, శ్రీనివాసరావు, రాజన్న, రవికాంత్‌, రిటైర్డ్ అయిన రామారావు, అకౌంటెంట్‌ గురుప్రసాద్‌ తో పాటు మొత్తం 11 మందిపై అధికారులు కేసు నమోదు చేశారు. అయితే విచారణలోనే అన్ని విషయాలు బయటపడుతాయని ప్రస్తుతానికి తన దగ్గర ఈ స్కాంపై ఎలాంటి సమాచారం లేదని ప్రస్తుత బ్యాంకు మేనేజర్ చెబుతున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు దగ్గరకొచ్చి ఆందోళన చేపట్టారు. తాము మోసపోయామని తమ డబ్బులు పోయాయంటూ కన్నీరు పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories