ఎన్నికల బడ్జెట్‌గా.. తెలంగాణ బడ్జెట్!

ఎన్నికల బడ్జెట్‌గా.. తెలంగాణ బడ్జెట్!
x
Highlights

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్.. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తైంది....

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్.. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు దాదాపు పూర్తైంది. ఈసారి బడ్జెట్ లక్షా 70 వేల కోట్లు దాటే చాన్స్ ఉంది. బడ్జెట్‌లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు నిరుద్యోగులకు 2 వేల నిరుద్యోగ భృతి ఇచ్చే పథకం ప్రకటించే చాన్స్ ఉంది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 14న ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉండటంతో ఈ బడ్జెట్ ఎన్నికల బడ్జెట్‌గా ఉండబోతుందన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది లక్షా 49 వేల 646 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది లక్షా 72 వేల కోట్లకు పెరిగే చాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది. రైతు ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా రాష్ట్రంలో ఉన్న 72 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి ఇచ్చే పథకానికి బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేయనున్నారు. ప్రతి సీజన్లో ఎకరాకు 4 వేలు చెల్లిస్తే 12 వేల కోట్లు అవసరమవుతాయని సీఎం కేసీఆర్ ఇదివరకే చెప్పారు. దీంతో వ్యవసాయరంగానికి అధిక నిధుల కేటాయింపులు ఉండేలా బడ్జెట్ రూపకల్పన చేస్తోంది ఆర్థికశాఖ.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జూన్‌ వరకు 50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చి కేసీఆర్ సర్కార్ కొత్త చరిత్ర సృష్టించాలనుకుంటోంది. ఇందుకోసం బడ్జెట్‌లో దాదాపు 30 వేల కోట్లు కాళేశ్వరానికి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రతి ఇంటికి తాగునీరందించేందుకు మిషన్ భగీరథకు 25 వేల కేట్లు కేటాయించే అవకాశం ఉంది. గిరిజనుల ఇంట్లో ఆడపిల్ల పుడితే పాప పేరుమీద బ్యాంకులో లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఇక వచ్చే ఎన్నికల నాటికి నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం నెలకు 2 వేల నిరుద్యోగ భృతి ఇచ్చే విషయంపై ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఇప్పుడు చెల్లిస్తున్న 75 వేలను లక్షకు పెంచనున్నారు. ఆసరా పించన్ల పెంపుతో పాటు దాని పరిధిని కూడా పెంచే యోచనలో ఉంది ప్రభుత్వం. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కూడా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించే చాన్స్ ఉందని ఆర్థికశాఖ అధికారులు చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories