ఉద్యమాలే ఉప్పెనలైన వేళ... దీక్షతో దద్దరిల్లిన నేల

ఉద్యమాలే ఉప్పెనలైన వేళ... దీక్షతో దద్దరిల్లిన నేల
x
Highlights

ఎన్నో పోరాటాలు... ఎన్నో ఉద్యమాలు... మరెన్నో ఆందోళనలు... ఇంకెన్నో నిరసనలు.. ఇలా తెలంగాణ ఉద్యమ పంథా ఎప్పటికప్పడు మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే...

ఎన్నో పోరాటాలు... ఎన్నో ఉద్యమాలు... మరెన్నో ఆందోళనలు... ఇంకెన్నో నిరసనలు.. ఇలా తెలంగాణ ఉద్యమ పంథా ఎప్పటికప్పడు మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఎజెండా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి... ప్రత్యేక రాష్ట్రం కోసం చేయని పోరాటం లేదు. ఎక్కని గడపలేదు. కలవని రాజకీయ నాయకుడు లేడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాలను ఓ సారి చూద్దాం.

2001 ఏప్రిల్ 27... హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఉన్న జలదృశ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో పార్టీ రాజకీయ చదరంగంలోకి దూకిన సందర్భం. అదే తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రత్యేక రాష్ట్ర సాధన అనే ఎజెండాతో పరుగెత్తిన తన 14 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఉత్థాన పతనాలను చవి చూసిన పార్టీ. ఇప్పుడు తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తి. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సారథ్యంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగింది. తెలంగాణ కోసం వైరివర్గాలను కూడా కలుపుకుపోయిన కేసీఆర్‌ 2004లో కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు కుదుర్చుకున్నారు. ఈ ఐదేళ్లలో కాంగ్రెస్‌ మోసం చేసిందంటూ 2009లో టీడీపీతో సయోధ్యకు వచ్చారు. 2009 సెప్టెంబర్‌లో వైఎస్‌ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమ పంథా పూర్తిగా మారిపోయింది.


2009 నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ అగ్ని గుండమైంది. 2009, డిసెంబర్‌7న తొలి అఖిలపక్షంలో అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు తమ అంగీకారాన్ని తెలిపాయి. దాని ఫలితమే 2009 డిసెంబర్‌ 9 ప్రకటన. మొత్తానికి తెలంగాణ ఉద్యమానికి ముందు తనను తాను మారిన మనిషిగా ప్రకటించుకున్న కేసీఆర్‌... 1969లో జరిగిన పోరాటాన్ని తలదన్నేలా ఉద్యమం నడిపించారు. తెలంగాణ సాధనకు ఉద్యమమే శరణ్యం అన్న కేసీఆర్‌ ఫ్రీజోన్ వివాదాన్ని అందిపుచ్చుకుని తెలంగాణ మొత్తాన్ని ఉద్యమ వేదికగా మార్చేసారు. కేసీఆర్ సచ్చుడో...తెలంగాణ వచ్చుడో...అంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష ఆ పార్టీ చరిత్రలో కీలకఘట్టం. ఈ దీక్షతో తెలంగాణ ఉద్యమంలో ఉద్వేగాలు ఉప్పెనలుగా మారి యూనివర్సిటీ మైదానాలు కదన రంగాలుగా మారిపోయాయి. విశ్వవిద్యాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ తెలంగాణ అంశంతో అట్టుడికిపోయింది. చివరకు ఢిల్లీ దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసింది.

ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఎన్నో ఉద్యమాలు... మరెన్నో ఉప్పెనలు. ఏమైనా తెలంగాణ ఉద్యమాన్ని, టీఆర్‌ఎస్‌ పార్టీని విడదీయలేని పరిస్థితి నాటిది. అరవైఏళ్ల ఉద్యమం.. నలభై ఏళ్ల నాటి ఆందోళనలు.. అన్నీ ఓ ఎత్తు.. కేసిఆర్ నడిపిన పోరాటం ఒక ఎత్తు.. కేసిఆర్ ప్రణాళికలోనే విజయం దాగుంది.. తెలంగాణవాదులు ఎంతమంది ఉన్నా తనది మాత్రమే నికార్సయిన తెలంగాణ వాదమనే బ్రాండ్ తెచ్చుకోగలిగారాయన. యుద్ధంలో అయినా... సంధికి విలువుంటుందేమో కానీ... రాజకీయంలో మాత్రం గెలుపునకు మరో ప్రత్యామ్నాయం లేదు... ఆ నిజం తెలిసిన వ్యక్తి కాబట్టే తెలంగాణ కలను నిజం చేసుకున్నారు.
నాలుగు కోట్ల మంది ఆకాంక్షకు అధినేతగా ఎదిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories