తెలంగాణకు మరో యోగి... ?

x
Highlights

తెలంగాణ బీజేపీలోకి మరో యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నారా? ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో యోగి పాత్ర విజయవంతం కావడంతో కాషాయదళం ఇక్కడ కాషాయధారిని రంగంలో దించాలని...

తెలంగాణ బీజేపీలోకి మరో యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నారా? ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో యోగి పాత్ర విజయవంతం కావడంతో కాషాయదళం ఇక్కడ కాషాయధారిని రంగంలో దించాలని యోచిస్తుందా..? దేశవ్యాప్తంగా యోగి ఆదిత్యనాథ్ ప్రభావం కనిపిస్తుండడంతో దక్షిణాదిలో కూడా ఇదే ప్రయోగం చేయాలని పార్టీ భావిస్తోందా..? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే అనిపిస్తుంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఊహకందని విధంగా విజయం సాధించిన బీజేపీ అదే వ్యూహాన్ని దక్షిణాదిన అమలు చేయడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఆయన ఇప్పుడు అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా వెలుగుతున్నారు. యోగి సభలకు ప్రజలు సైతం విపరీతంగా వస్తుండడంతో తెలంగాణలో అదే ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కమలదళం ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే తెలంగాణ బీజేపీ పరిపూర్ణనంద స్వామి పై కన్నేసినట్లుంది. ఇటీవల ఆయన తెలంగాణలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు భారీగా జనం తరలివచ్చారు. డిసెంబర్ లో 108 పడులతో భారీగా అయ్యప్ప మహా వైభవ పడిపూజ నిర్వహించారు. ఎన్జీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా స్వాములు హాజరయ్యారు.

ఇక ఇటీవల నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో భారతమాతకు మహా హారతి కార్యక్రమానికి విపరీతమైన స్పందన రావడంతో కమలం పార్టీ ఆయనని పార్టీలో చేర్చుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వెంటనే పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేయాలని స్వామితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. భారతమాతకు మహా హారతి కార్యక్రమం రోజే పార్టీ నేతలు పరిపూర్ణానంద ముందు ఈ ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే పరిపూర్ణానంద స్వామి మాత్రం బీజేపీ ఇచ్చిన ఆఫర్ ను ఓకే చేయాలా వద్దా అనే సంశయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తన అత్యంత సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తాను స్థాపించిన రాష్ట్రీయ హిందూ సేన పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిపూర్ణనంద.. దానినే పార్టీగా రిజిస్టర్ చేసుకొని ప్రజల్లోకి వెళ్లాలని భావించినా.. కేవలం హిందూ కార్డుతో పార్టీ పెడితే బతికి బట్టగట్టే పరిస్థితి తెలంగాణలో లేదు కాబట్టి బీజేపీ ఆఫర్ గురించి ఆలోచిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి పరిపూర్ణానంద స్వామి ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని కొన్ని నెలల క్రితమే ప్రయత్నాలు ప్రారంబించారు. తన RHS ద్వారా కార్యక్రమాలు నిర్వహించినా.. ఎన్నికల నాటికి బీజేపీ టిక్కెట్టు కేటాయించడం కష్టమనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇవాళ స్వామీజీ RSS పెద్దలతో కీలక సమావేశం జరుపుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ అంశం జాతీయ నాయకత్వం దృష్టిలో ఉన్నా.. స్వామీజీ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర పార్టీతో చర్చిస్తుందనే చర్చ జరుగుతోంది. కానీ ఇప్పటికే హిందూత్వవాదాన్ని తలకెత్తుకొని తిరుగుతున్నవాళ్లు బీజేపీలో ఇమడలేకపోతున్నారనే చర్చ ఉంది. మరి పరిపూర్ణానంద పార్టీలోకి వస్తే సర్దుకోగలరా అనేది ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories