పసికందు కిడ్నాప్‌ కేసులో పురోగతి

పసికందు కిడ్నాప్‌ కేసులో పురోగతి
x
Highlights

ఆరు రోజుల పసికందు అపహరణ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న మధ్యాహ్నం 12గంటల సమయంలో కోఠి మెటర్నటీ ఆస్పత్రి నుంచి పసికందును ఎత్తుకెళ్లిన మహిళ...

ఆరు రోజుల పసికందు అపహరణ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న మధ్యాహ్నం 12గంటల సమయంలో కోఠి మెటర్నటీ ఆస్పత్రి నుంచి పసికందును ఎత్తుకెళ్లిన మహిళ తెలంగాణ ఆర్టీసీ బస్సులో బీదర్‌ వెళ్లినట్టు గుర్తించారు. ఎంజీబీఎస్‌లోని సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా బస్సు నెంబర్‌ను ట్రేస్‌ చేశారు. బీదర్‌ వెళ్లిన టీఎస్‌ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు కండక్టర్‌ను పోలీసులు విచారించారు.

పసికందును తీసుకొని ఎంజీబీఎస్‌లో బస్సు ఎక్కిన మహిళ బీదర్‌లో దిగినట్టు కండక్టర్‌ పోలీసులకు తెలిపాడు. టిక్కెట్‌ కోసం మహిళ కన్నడలో మాట్లాడినట్టు బస్సు కండక్టర్‌ చెబుతున్నారు. కిడ్నాపర్‌ కోసం బీదర్‌ చేరుకున్న తెలంగాణ పోలీసులు అక్కడి పోలీసుల సాయంతో కిడ్నాపర్‌ కోసం గాలిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఏడు పోలీస్‌ బృందాలు, మరో నాలుగు బీదర్‌ పోలీసు బృందాలు కిడ్నాపర్‌ కోసం వేట కొనసాగిస్తున్నాయి. కిడ్నాపర్‌ వెంట ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 35ఏళ్ల వయస్సున్న ఓ గుర్తు తెలియని మహిళ పాప తల్లి దగ్గరకు వచ్చి టీకాలు వేయించావా అని అడిగింది. వేయించలేదని, ఆ విషయం తనకు తెలియదని తల్లి చెప్పడంతో టీకాలు వేయిస్తానని పాపను తీసుకెళ్లింది. పాపతో పాటు కేషీట్‌ కూడా తీసుకెళ్లింది.

కొద్దిసేపటి తర్వాత వచ్చిన భర్త పాప ఏదని అడగ్గా, టీకాలు ఇప్పించేందుకు ఆస్పత్రికి చెందిన ఓ మహిళ తీసుకెళ్లిందని తల్లి చెప్పింది. అయితే, సమయం గడుస్తున్నా పాపను తీసుకురాకపోవడంతో భర్త వార్డులో ఉన్న వైద్యలును సంప్రదించారు. తాము పాపను తీసుకురమ్మనలేదని చెప్పడంతో పాప కిడ్నాప్‌ గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని ఆస్పత్రిలోని సీసీఫుటేజ్‌ను పరిశీలించారు. పాపను బ్లూకలర్ చీర ధరించిన మహిళ ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతం బీదర్‌ చేరుకున్న హైదరాబాద్‌ పోలీసులు టీఎస్‌ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ ఇచ్చిన సమాచారంతో అక్కడి పోలీసుల సాయం తీసుకొని కిడ్నాపర్‌ కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories