సింగరేణిలో విక్టరీ సైరన్ మోగించేదెవరు?

కోల్ బెల్ట్ ఎవరిది....బొగ్గు బావుల్లో పాగా వేసేదెవరు....సింగరేణిలో విక్టరీ సైరన్ మోగించేదెవరు...బొగ్గు...
కోల్ బెల్ట్ ఎవరిది....బొగ్గు బావుల్లో పాగా వేసేదెవరు....సింగరేణిలో విక్టరీ సైరన్ మోగించేదెవరు...బొగ్గు బావులు విస్తరించిన దాదాపు నియోజకవర్గాలను గుప్పిట పట్టేందుకు, అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదునుపెట్టాయి. సింగరేణి గనులు. తెలంగాణలోని మొత్తం ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. 10 నియోజకవర్గాలున్నాయి. సింగరేణి కుటుంబాలు, ఈ పది నియోజకవర్గాల గెలుపోటములను శాసిస్తాయి. అందుకే సింగరేణి కార్మికుల మనసు దోచేందుకు, ప్రధాన రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి రగులుకుంది. సింగరేణి పది నియోజకవర్గాల్లో, అన్ని పార్టీలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. గులాబీ అభ్యర్థులు క్యాంపెన్ హోరెత్తిస్తున్నారు. కార్మికుల సమస్యలను ప్రతిపక్ష కార్మిక సంఘాలు ఏకరువు పెడుతున్నాయి.
సింగరేణిలో కార్మికులు, అధికారులు కలిపి మొత్తం 62 వేల మంది ఉన్నారు. మొత్తంగా వారు, వారి కుటుంబాల ఓట్లు 6.5 లక్షలు. ఒక్కో నియోజకవర్గంలో సింగరేణి ప్రాంత ఓటర్లు 50 వేల నుంచి 80 వేల వరకు ఉండొచ్చని అంచనా. రిటైర్డు కార్మికులు, వారి కుటుంబాలు సుమారు 45 వేల వరకు ఉన్నాయి. ఇందులో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్, రామగుండం, మంథని, భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు నియోజకవర్గాల్లో, అభ్యర్థుల తలరాతలను మార్చబోతున్నాయి సింగరేణి కుటుంబాలు. ఒక చెన్నూర్ నియోజకవర్గం తప్ప అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లనే అభ్యర్థులుగా బరిలో నిలిపింది గులాబీ పార్టీ. అటు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల మహాకూటమికి చెందిన నాయకులు కూడా సింగరేణి స్థానాలను నిలుపుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలే, శాసన సభ సమరంలా హోరెత్తించాయి. వీటిలో పాగా వేస్తే, మొత్తం జనాభిప్రాయం తెలిసిపోతుందని భావిస్తాయి. అందుకేసంఘాలను గెలిపించుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతాయి. సీపీఐకి ఏఐటీయూసీ, కాంగ్రెస్‌కు చెందిన ఎన్‌టీయూసీ, టీడీపీకి టీఎన్‌టీయూసీ సంఘాలు సింగరేణిలో ఉన్నాయి. గత ఏడాది జరిగిన యూనియన్ గుర్తింపు ఎలక్షన్స్‌లో కలిసికట్టుగా పోటీ చేశాయి. ఆ అనుభవం ఇప్పుడు కలిసివస్తుందని భావిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంకు బొగ్గుగని కార్మికులతో అనుబంధముంది.
సింగరేణి కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ, వరాలు ప్రకటిస్తూ, ప్రధాన పార్టీలు జోరు పెంచాయి. కారుణ్య నియామకాల్లో ఇన్వాలిడేషన్ కోసం డబ్బులు వసూలు చేసిన నాయకుల బండారం బయటపెడతామని, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్ లాంటి సంఘాలతోపాటు ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ, టీజేఎస్ తదితర సంఘాలు క్యాంపెన్‌లో చెబుతున్నాయి. మరోవైపు సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ కార్యకర్తలు, నేతలు టీఆర్‌ఎస్ అభ్యర్థుల వెంట నడుస్తున్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కార్మికులపై వరాలు కురిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మొద్దని, కార్మికుల సంక్షేమానికి తామే కట్టుబడ్డామని చెబుతున్నారు.
మొత్తానికి ఇటు టీఆర్ఎస్, అటు మహాకూటమి పార్టీలు కోల్ బెల్ట్‌లో పాగా వేసేందుకు శర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. పది నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవాలని రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. చూడాల బొగ్గు బావుల్లో సత్తా చాటేదెవరో..