సాహో సర్దార్‌... ఉక్కు సంకల్పానికి జోహార్‌

సాహో సర్దార్‌... ఉక్కు సంకల్పానికి జోహార్‌
x
Highlights

ఉక్కు సంకల్పానికి ప్రతీక ఆయన.. తన ఆలోచనలు, విధానాలతో జాతి ఐక్యతకు ఊపిరులూదిన వ్యక్తి.. నేడు దేశం ఇంత ఐక్యంగా ఉందంటే అది ఆయన చలవే.. ఆయనే సర్దార్...

ఉక్కు సంకల్పానికి ప్రతీక ఆయన.. తన ఆలోచనలు, విధానాలతో జాతి ఐక్యతకు ఊపిరులూదిన వ్యక్తి.. నేడు దేశం ఇంత ఐక్యంగా ఉందంటే అది ఆయన చలవే.. ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాంటి ఉక్కు మనిషికి మన దేశం ప్రపంచంలోకే అత్యంత ఎత్తైన విగ్రహం నెలకొల్పి.. నివాళులర్పించింది. యావత్ గుజరాత్ ను చూసేంత ఎత్తులో నిర్మితమైన పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోడీ కాసేపట్లో ఆవిష్కరించనున్నారు.

భారత ఐక్యతకు ఊపిరులూదిన వ్యక్తి సర్దార్ పటేల్.. చెదరని ఉక్కు సంకల్పంతో సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఘనుడాయన.. జాతి నిర్మాణంలో, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.. పటేల్,నెహ్రూ తనకు రెండు కళ్లని గాంధీ చెప్పే వారంటేనే సర్దార్ పటేల్ గొప్పతనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.. దేశానికి స్వాతంత్రం కోసం పోరాడిన నేతల్లో వల్లభాయ్ పటేల్ ఒకరు.. జాతి యావత్తూ ఆయన సేవలను నిరంతరం గుర్తు చేసుకుంటుంది. అలాంటి మహనీయుడికి గుజరాత్ లో ఉక్కు విగ్రహం నెలకొల్పాలన్న బిజెపి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. అమెరికాలో అత్యంత ఎత్తైన విగ్రహం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే మన దేశంలో ఉన్నది స్టాట్యూ ఆఫ్ యూనిటీ.. ఈ విగ్రహం నిర్మాణానికి 33 నెలల సమయం పట్టింది. 2013 అక్టోబర్ 31న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని నరేంద్రమోడీ చేతులపై జరిగింది. న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతల ఎత్తైనది సర్దార్ పటేల్ ఉక్కు విగ్రహం.. గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున నెలకొల్పిన ఈ విగ్రహంలో పటేల్ హావ భావాలను, ముఖాన్ని చక్కగా రూపు దిద్దారు.. 182 మీటర్ల పొడవైన ఈ విగ్రహం నిజంగా ఒక ఇంజనీరింగ్ అద్భుతమే.. దాదాపు 3 వేలమంది కార్మకులు ఈ విగ్రహ నిర్మాణానికి పగలు, రాత్రీ కష్టపడ్డారు.

ప్రతిష్టాత్మక లార్సన్ అండ్ టుబ్రో కంపెనీ చేపట్టిన ఈ విగ్రహ నిర్మాణానికి 2,989 కోట్లు ఖర్చయింది. ఈ విగ్రహం తయారీకి 1700 టన్నుల ఇత్తడిని వినియోగించగా మరో1850 టన్నుల ఇత్తడిని కేవలం విగ్రహం పై పూతకే వినియోగించారు. ఇక విగ్రహం లోపలి భాగాన్ని లక్షా 80 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ సిమెంట్ ని,18,500 టన్నుల రీ ఇన్ఫోర్స్ డ్ స్టీలును, 6,500 టన్నుల స్ట్రక్చర్డ్ స్టీలుతో నింపారు. ఇక సర్దార్ పటేల్ విగ్రహం ఎత్తు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే..సాధారణంగా 5.6 అడుగుల ఎత్తున్న మనిషికి వంద రెట్లు ఎత్తులో ఈ విగ్రహం ఉంటుంది. పటేల్ విగ్రహం పాదాల దగ్గర రెండు హై స్పీడ్ పాసెంజర్ ఎలివేటర్లు ఉంటాయి. ఇవి టూరిస్టులను నేరుగా పటేల్ ఛాతీ భాగం ఎత్తు వరకూ తీసుకెడతాయి. గ్యాలరీ వ్యూయింగ్ కోసం చేసిన ఈ ఏర్పాటులో ఒకేసారి 200 మంది టూరిస్టులు కూర్చునే వెసులు బాటు ఉంది. ఈ ఎలివేటర్ లో పటేల్ ఛాతీ భాగం ఎత్తుకు చేరుకుంటే అక్కడ నుంచి నర్మదా నది అందాలను, డ్యామ్ అందాలను, చుట్టూ ఉన్న సాత్పురా, వింధ్యాచల్ కొండల అందాలను చూడొచ్చు.

పూర్తి పర్యావరణ హితంగా రూపొందిన ఈ విగ్రహం పరిసరాల్లో ఓ స్టార్ హోటల్, ఒక మ్యూజియం, ఆడియో, విజువల్ గ్యాలరీ కూడా ఉన్నాయి. సర్దార్ పటేల్ విగ్రహం ప్రత్యేకత కేవలం ఎత్తే కాదు.. నర్మదా నది మధ్యలో దీనిని నిర్మించడం వల్ల దూరం నుంచి చూసేవారికి పటేల్ గంభీర వదనం, నిండైన విగ్రహం అద్భుతంగా కనిపిస్తుంది.. నది మధ్యలో పటేల్ ఒక మౌన మునిలా నడచుకుని వెడుతున్నట్లు కనిపిస్తుంది.. పౌర్ణమి వేళలో ఈ విగ్రహం అందాలు మరింత ఇనుమడిస్తాయి. పటేల్ విగ్రహం నడుస్తున్న భంగిమలోనే ఉండటం విగ్రహానికి అద్భుతమైన కళను తీసుకొచ్చింది. ఇక దీని పటిష్టత గురించి చెప్పాలంటే గంటకు 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఈ విగ్రహానికి ఏం కాదు.. అలాగే రిక్టర్ స్కేల్ పై 6.5 తీవ్రత భూ కంపాన్నీ తట్టుకుని నిలబడగలదు.
నోయడాకు చెందిన శిల్పి రామ్ వీ. సుతార్ పటేల్ ముఖ కవళికలను అత్యద్భుతంగా జీవకళ ఉట్టి పడేలా రూపొందించారు.. పటేల్ ముఖ కవళికలను తీసుకు రావడానికి జాతీయ లైబ్రరీలో ఉన్న కనీసం రెండు వేల ఫొటోలను, అందుబాటులో ఉన్న క్లోజప్ ఫొటోలను ఆయన అధ్యయనం చేశారు. అలాగే అప్పట్లో పటేల్ తో అనుబంధం కలిగిన వారిని, ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారిని నేరుగా కలసి, కొన్ని వివరాలు సేకరించారు. ఈ విగ్రహాన్ని దూరం నుంచి చూస్తే సర్దార్ పటేల్ సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిలో నడచి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. పటేల్ విగ్రహాన్ని చూడాటానికి కెవాడియా టౌన్ నుంచి 3.5 కిలోమీటర్ల హైవేను దాటేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం రహదారి నిర్మాణం చేసింది. ఐక్యతా శిల్పమైన ఈ స్పాట్ కు టూరిస్టులు కావాలంటే బోట్ షికారులో కూడా వెళ్లొచ్చు. కాకపోతే సాధు ఐలాండ్ దగ్గర 320 మీటర్ల పొడవైన డిజైనర్ బ్రిడ్జిని దాటి వెళ్లాలి. ఉక్కు మనిషిగా పేరు పడ్డ పటేల్ విగ్రహం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా లక్షల గ్రామాల నుంచి తీసుకొచ్చిన ఇనుము తుక్కును వినియోగించారు. తద్వారా దేశం మొత్తం ఐక్యతను చాటి చెప్పారు. విగ్రహం దగ్గర ఫొటోలు తీసుకోడానికి ఓ సెల్ఫీ పాయింట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ పాయింట్ లో నిలబడి ఎవరు సెల్ఫీ తీసుకున్నా పటేల్ విగ్రహం మొత్తం చక్కగా కవర్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories