ప్రేమోన్మాదానికి మరో యువతి బలి

ప్రేమోన్మాదానికి మరో యువతి బలి
x
Highlights

ప్రేమోన్మాదానికి మరో మహిళ బలైంది. మృతువుతో పోరాడి ఓడిపోయింది. హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ సంధ్యారాణి చనిపోయింది. 70 శాతం కాలిన...

ప్రేమోన్మాదానికి మరో మహిళ బలైంది. మృతువుతో పోరాడి ఓడిపోయింది. హైదరాబాద్‌లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ సంధ్యారాణి చనిపోయింది. 70 శాతం కాలిన గాయాలైన సంధ్యారాణి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. సికింద్రాబాద్‌లోని లాలాగూడలో సంధ్యారాణిపై కార్తీక్ అనే వ్యక్తి నిన్న రాత్రి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినా శరీరమంతా కాలిపోయి ఉండడంతో ప్రాణాలు విడిచింది. సంధ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరువుతున్నారు.

మృతురాలు నేరెడు సంధ్యారాణి తల్లి, అక్కలతో పాటు లాలాగూడలోని భజన సమాజంలో నివాసముంటోంది. శాంతినగర్‌లోని ఓ అల్యూమినియం షాపులో పని చేస్తోంది. నిన్న సాయంత్రం ఆరున్నరకు షాపునుంచి ఇంటికి వెళ్తున్న సంధ్య ఆశాకిరణ్‌ చిన్నారుల వసతి గృహం దగ్గరకు రాగానే కార్తీక్‌ అనే యువకుడు దాడి చేశారు. ప్రేమపేరుతో వేధించగా ఆమె తిరస్కరించడంతో సంధ్యారాణి దగ్గరకు వచ్చి కిరోసిన్ పోశాడు. ఆమె తప్పించుకునేందుకు యత్నించగా వెంటపడి మరీ ఆమెకు నిప్పంటించాడు.

రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్‌ సంధ్యారాణి స్నేహితురాలి సోదరుడు. కొన్ని నెలల క్రితం సంధ్యారాణి దగ్గర ప్రేమిస్తున్నానని చెప్పాడు. కుటుంబ పోషణాభారం తనపై ఉందంటూ అతని ప్రేమప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయినా తన పంథా మార్చుకోని కార్తీక్‌ ఫోన్‌ ద్వారా వేధించడం మొదలెట్టాడు. దీంతో కొన్నాళ్లుగా సంధ్యారాణి అతడిని దూరం పెట్టింది. నిన్న సంధ్యారాణి, కార్తీక్‌ మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ కార్తీక్‌ బెదిరించగా సంధ్యారాణి అతడిని మందలించింది. నిన్న సాయంత్రం కార్తీక్‌ కిరోసిన్‌ డబ్బాతో ఆ ప్రాంతానికి లాలాపేట దగ్గర కాపు కాశాడు. సంధ్యారాణి అటుగా రావడం గమనించి మరోసారి వేధించాడు. సంధ్యారాణి అతడి మందలించడంతో ఆగ్రహంతో వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోశాడు.

కార్తీక్ తనమీద కిరోసిన్ పోయడంతో షాక్‌కు గురైన సంధ్యారాణి వెంటనే తేరుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో జనం ఉండే ప్రాంతానికి పరిగెత్తింది. ఈ లోపే ఆమె వెంట పరిగెత్తిన కార్తీక్‌ నిప్పుపెట్టాడు. శరీరం కాలుతున్న బాధతో ఆమె హాహాకారాలు చేస్తుంటే అక్కడ నుంచి పారిపోయాడు. కాలుతున్న శరీరంతోనే దాదాపు 200 మీటర్లు పరిగెత్తిన సంధ్య కుప్పకూలిపోయింది. స్థానికులు ఆమె దగ్గరికి చేరుకుని మంటలార్పి పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన బాధితురాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

చిన్నతనంలోనే చనిపోయిన తండ్రి వివాహాలై వేరే ప్రాంతాల్లో ఉంటున్న ముగ్గురు సోదరులు వివాహమైనా ఇంట్లోనే ఉంటున్న అక్కలు తల్లితోపాటు తనపైనే పడిన కుటుంబ పోషణ భారం ఈ పరిస్థితుల మధ్య చిరుద్యోగంతో నెట్టుకొస్తున్న సంధ్యారాణి మనసు ప్రేమవైపు మళ్లలేదు. దీంతో ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్న కార్తీక్ కక్ష కట్టాడు. పథకం ప్రకారం ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉన్మాది కార్తీక్ స్వయంగా వచ్చి పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతణ్ణి విచారిస్తున్నారు. సంధ్య చావుకు కారణమైన ఉన్మాది కార్తీక్‌ను కూడా చంపాలని ఆమె తల్లి సావిత్రి డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే సంధ్యకు న్యాయం జరుగుతుందని కన్నీరుమున్నీరవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories