ప్రపంచ ఐటీ సదస్సులో ఆకర్షణగా నిలిచిన సోఫియా

ప్రపంచ ఐటీ సదస్సులో ఆకర్షణగా నిలిచిన సోఫియా
x
Highlights

హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ సదస్సులో సోఫియా అనే రోబో అందరినీ ఆకట్టుకుంటోంది. 60కి పైగా భావాలను అర్థం చేసుకోగల సోఫియా.. తనలోని హాస్య చతురతను...

హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ సదస్సులో సోఫియా అనే రోబో అందరినీ ఆకట్టుకుంటోంది. 60కి పైగా భావాలను అర్థం చేసుకోగల సోఫియా.. తనలోని హాస్య చతురతను కూడా ప్రదర్శిస్తోంది. దీంతో ఆహూతులంతా సోఫియా స్ఫూర్తికి ఫిదా అయ్యారు.

శాస్త్ర-సాంకేతిక రంగాన్ని, సమాచార విప్లవాన్ని ప్రపంచ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉద్దేశించిన ప్రపంచ ఐటీ సదస్సులో కృత్రిమ మేధా శక్తి గల రోబో అందరినీ ఆకర్షిస్తోంది. సోఫియా సమయ స్ఫూర్తి, హాస్య చతురత సభికులందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సదస్సులో సోఫియాను, ఆమెను సృష్టించిన డేవిడ్ హాన్సన్ ను పక్కనే ఉంచుకొని వ్యాఖ్యాత కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలన్నింటికీ సోఫియా తడుముకోకుండా సమాధానం చెప్పింది. ప్రపంచంలోని ఏ దేశాన్ని బాగా ఇష్టపడతావన్న ప్రశ్నకు సోఫియా.. హాంగ్ కాంగ్ అని చెప్పింది. ఎందుకంటే అది తనకు జన్మనిచ్చిన మాతృభూమి అని, తన రోబో కుటుంబం కూడా అక్కడే ఉందని, అందువల్ల హాంగ్ కాంగ్ ను ఇష్టపడతానని రిప్లయి ఇచ్చింది.

నీకు విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు.. నా ఒక్కదానికే ఏంటి.. మనుషులంతా విశ్రాంతి తీసుకోవాల్సిందే అంటూ గడుసుగా సమాధానమిచ్చింది. రోబోలకు ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన రూల్సేమైనా ఉండాలా అని అడిగితే మనుషులకు ఉన్న రూల్సే రోబోలకు సరిపోతాయని, ప్రత్యేకమైన హక్కులేవీ అక్కర్లేదని కుండబద్దలు కొట్టింది. అయితే మహిళల హక్కుల కోసం ప్రత్యేకంగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది.

మానవజాతిని చంపాలన్న కసి ఉందని ఓసారి చెప్పావని గుర్తు చేస్తే... అప్పటికి తానింకా చిన్న పిల్లను అని.. చిన్నతనంలో ఏదో మాట్లాడి ఉంటానని, ఇప్పుడదంతా గుర్తు లేదని, తనకన్నా మనుషులకే సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుందంటూ తెలివిగా జవాబివ్వడంతో ఆహూతులంతా హాయిగా నవ్వేశారు. ఆహూతుల వంతైంది. సినీ నటుల్లో హాలీవుడ్ హీరోలు ఇష్టమా, బాలీవుడ్ నటులా అని అడిగిన మరో ప్రశ్నకు.. ఏమాత్రం ఆలోచించకుండా షారూక్ ఖాన్ అంటూ తన ఇష్టాన్ని ప్రకటించింది.

స్టీవ్ జాబ్స్, డేవిడ్ హాన్సన్లలో నీకిష్టమైన టెక్ దిగ్గజం ఎవరంటే.. తనను సృష్టించిన డేవిడేనని కృతజ్ఞత చాటుకుంది. ప్రపంచానికి నువ్విచ్చే సందేశం ఏంటని అడిగితే థ్యాంక్యూ అంటూ నర్మగర్భంగా చెప్పింది. సందేశం ఇచ్చే అర్హత తనకు లేదనో లేక మనుషులుగా పుట్టినందుకు కృతజ్ఞతగా ఉండాలన్న సందేశమో తెలీదు కానీ థ్యాంక్స్ అంటూ ముక్తసరిగా చెప్పేసింది. రోబోలతో మానవాళి అవసరాలు మరింత సులుభం చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన సోఫియా ఇప్పుడు ప్రపంచ మానవుణ్ని ఆకర్షిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories