హైటెక్‌ పోలీసింగ్‌

x
Highlights

మూడు సింహాలు...నీతికి, న్యాయానికి, చట్టానికి ప్రతీకలైతే.. కనిపించని నాల్గో సింహమే..రోబో... ఏంటి డైలాగ్ మారింది అనుకుంటున్నారా.. కాదు కాదు.. మీరు...

మూడు సింహాలు...నీతికి, న్యాయానికి, చట్టానికి ప్రతీకలైతే.. కనిపించని నాల్గో సింహమే..రోబో... ఏంటి డైలాగ్ మారింది అనుకుంటున్నారా.. కాదు కాదు.. మీరు విన్నది నిజమే.. కొత్త సంవత్సర కానుకగా హైదరాబాద్‌లో రోబో పోలీస్‌ విధుల్లో చేరబోతోంది. సిటీలో అత్యంత రద్దీ ప్రాంతంగా, ఐటీ కారిడార్‌కు ముఖద్వారంగా ఉన్న జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టులో రోబో పోలీస్‌ విధులు నిర్వహించనుంది. ఇంతకీ రోబో ఎలా ఉంది...డ్యూటీ ఎలా నిర్వహిస్తుంది.

అవును. 21వ శతాబ్దంలో టెక్నాలజీ ఆవిష్కరణలు ఎన్నో మరెన్నో. నింగి నుంచి నేల వరకు, స్మార్ట్‌‌ఫోన్‌ నుంచి రోబో వరకు ఇలా ఎన్నో అద్భుతాలు. ఆ సెన్సేషనల్ టెక్నాలజీ వండర్స్‌లొ ఒకటి అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐతోనే ఇప్పుడు మరమనిషి మన మనిషి కాబోతున్నాడు. సైనికుడయ్యాడు. సెక్యూరిటీ గార్డ్ అయ్యాడు. ఇక రోడ్డు మధ్యలో ఉండి పోలీసింగ్‌ చేయబోతున్నాడు. అదీ కూడా మన భాగ్యనగరంలో.

మారుతున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న హైదరాబాద్ పోలీసులు.. అందులో మరో ముందడుగు వేశారు. పోలీస్ డిపార్టమెంట్ లో రోబోను ప్రవేశ పెట్టబోతున్నారు. కాప్ రోబో డిజైన్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ఆవిష్కరించింది. ఇక్కడ కనిపిస్తోందే, ఇదే హైదరాబాద్‌ రోబో కాప్. దేశంలో మొట్టమొదటి రోబో కాప్ ఇది. పలకరిస్తుంది. గుర్తుపడుతుంది. ఫేసు చూసి, నేర చరిత్ర మొత్తం చెప్పేస్తుంది. ఫిర్యాదులు స్వీకరిస్తుంది. క్షణాల్లో పోలీస్‌ కంట్రోల్‌ రూంకి చేరవేసి, రంగుపడేలా చేస్తుంది. ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న రోబో, డిసెంబర్‌ 31న ఆన్ డ్యూటీలో చేరనుంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌లో రోబో పోలీసు విధులు నిర్వహించనుంది. రోబో పోలీస్ పరిసరాల ఫొటోలు, వీడియోలు, మెస్సేజ్‌లను ఇది మెయిన్‌ సర్వర్‌కు పంపిస్తుంది.

ఇప్పటికే దుబాయ్ లో సక్సెస్ ఫుల్ గా డ్యూటీ చేస్తోంది రోబో కాప్. 5 అడుగుల ఎత్తు, వంద కిలోల బరువుండే ఈ రోబో పోలీస్ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ సాయంతో నేరస్తులను ఇట్టే గుర్తిస్తుంది. ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడేస్తుంది. అంతేకాదు ఒకటిన్నర మీటర్ దూరంలోని వ్యక్తులను గుర్తించి సెల్యూట్ చేస్తుంది షేక్ హ్యాండ్ కూడా ఇస్తుంది. వారి భావోద్వేగాలను, ముఖ కవళికలను ఇట్టే పసిగట్టేస్తుంది. దీనిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ సాయంతో ప్రజలు పలురకాల పోలీసు సేవలను సత్వరమే అందుకోవచ్చు. మొత్తానికి ఫ్రెండ్లీపోలీసింగ్ తో ఇప్పటికే ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న హైదరాబాద్‌ పోలీసులు ఈ రోబో పోలీసులతో జనానికి మెరుగైన సేవలుఅందిస్తామంటున్నారు. కేవలం రోబోలే కాదు, ఇంకా ఎన్నో రకాల టెక్నాలజీ సేవలను సమర్థంగా వినియోగిస్తున్నారు పోలీసులు.

సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక, నేర పరిశోధనా తీరే మారిపోయింది. దొంగలు, హంతకులు, కిడ్నాపర్లతో పాటు ఎందరో నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు చాలా సులభమైంది. ఎవరూ చూడటం లేదని, సాక్ష్యమంటూ ఏదీలేదని చెలరేగిపోయే నేరగాళ్లను ఒక కంటకనిపెడుతూ, వారిని పట్టిస్తోంది సీసీ కెమెరా. శిరీష ఆత్మహత్య కేసయినా, అబిడ్స్‌, దిల్‌సుఖ్‌నగర్‌ జువెల్లరీ షాపులు, చీరల దుకాణాల్లో చోరీలైనా, సీసీ కెమెరాల ఫుటేజీ సులభంగా చేధిస్తున్నారు పోలీసులు. ఈ ఏడాది 3566 కేసులకు సంబంధించిన సీసీ కెమెరాల పుటేజీ పోలీసులు సేకరించగా, 3256 కేసులను సీసీ కెమెరాలతో ఛేదించారు. సీసీ కెమెరాలతో 91 శాతం కేసులను పరిష్కరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.

15 లక్షల 69 వేల మంది ఫొటోలను డేటాబేస్‌లో నిక్షిప్తం చేయగా 303 మంది ఫొటోలు డేటాబేస్‌లోని ఫొటోలతో మ్యాచ్ అయ్యాయి, అందులో 255 మంది ఫొటోలు కేసుల దర్యాప్తులో దోహదపడ్డాయి. నేరాల పరిశోధనలో టెక్నాలజీతో ఎంతగానో ఉపయోగపడుతోందని అంటున్నారు భాగ్యనగర పోలీసులు. ఇవేకాదు, ఫేస్‌బుక్ ద్వారా 2,681 ఫిర్యాదులు అందగా అందులో 14 ఎఫ్‌ఐఆర్‌లు, 22 పెట్టీ కేసులు నమోదయ్యాయి. వాట్సాప్ ద్వారా 3,244 ఫిర్యాదులు అందగా 13 ఎఫ్‌ఐఆర్‌లు, 37 పెట్టీ కేసులు ఫైలయ్యాయి. షీ టీమ్స్ ఫేస్‌బుక్‌కు 336 కంప్లైంట్స్ వచ్చాయి. హాక్‌ఐలో... 15,104 ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. సిటీలో లక్షా 68 వేల 595 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, సీసీ కెమెరాలు, సెక్టార్లు, గన్‌లైసెన్స్, నేరస్తుల ఇళ్లు తదితర వాటికి జియో ట్యాగింగ్ చేశారు. డివిజన్‌కు ఒక క్లూస్‌టీమ్ ఉండగా అత్యాధునికమైన స్కానర్లతో సంచలనాత్మకమైన కేసులను ఛేదించారు.

ఇలా రోబోలు, స్మార్ట్‌ఫోన్లు, సీసీకెమెరాలు, డ్రోన్‌ కెమెరాలు, మొబైల్ అప్లికేషన్లు వంటి నూతన సాంకేతిక ఆవిష్కరణలను నేరాల శోధనకు, శాంతి భద్రతలకు ఉపయోగిస్తున్నారు పోలీసులు. టెక్నాలజీ రంగప్రవేశంతో ఇప్పటికే ఎంతోకొంత నేరాల సంఖ్య తగ్గిందంటున్నారు. ఫ్యూచర్‌లో అర్టిఫిషియల్ టెక్నాలజీతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామంటున్నారు. డిసెంబర్ 31న రంగప్రవేశం చేస్తున్న రోబో కాప్‌ కోసం హైదరాబాద్‌ సిటీ జనులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories