నేతల తీరుపై రేవంత్‌ రెడ్డి ఆందోళ‌న‌

నేతల తీరుపై రేవంత్‌ రెడ్డి ఆందోళ‌న‌
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారా ? పక్కా ఆధారాలతో అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నా సొంత పార్టీ నేతలు పట్టించుకోవడం లేదా...

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారా ? పక్కా ఆధారాలతో అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నా సొంత పార్టీ నేతలు పట్టించుకోవడం లేదా ? కాంగ్రెస్‌ నేతల తీరుపై రేవంత్‌ రెడ్డి ఎందుకు లోలోపల మదనపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఒంటరిపోరు చేసిన రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరినా పరిస్థితి మారలేదు. అక్కడ కూడా ప్రభుత్వంపై ఒంటరి పోరు తప్పలేదు. టీడీపీలో నేతలెవరు సహకరించలేదంటూ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు రేవంత్‌ రెడ్డి. అయితే కాంగ్రెస్‌ పార్టీలో చేరినప్పటి నుంచి టీఆర్ఎస్‌ పార్టీని ఇరుకున పెడుతూనే ఉన్నారు. మొదటి అస్త్రంగా మంత్రి కేటీఆర్ మామ గిరిజన సర్టిఫికెట్లు బయటపెట్టి సంచలనం రేపారు. ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్టీ సెల్‌కు అప్పగించి కేసులు పెట్టాలని కోరినా స్పందించే వారే కరువయ్యారు. మంత్రి కేటీఆర్‌ మామ సర్టిఫికెట్ల గురించి ఒక్కరు కూడా పట్టించుకోలేదు.

రెండో అస్త్రంగా ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి దొంగ డాక్టర్ అంటూ జడ్చర్ల సభలో కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. మంత్రి లక్ష్మారెడ్డి తిట్లదండకం ఎత్తుకోవడంతో అదే రీతిలో సమాధానం ఇచ్చి నోరు మూయించారు రేవంత్‌రెడ్డి. రెండు పార్టీల వివాదం దుమ్మురేపినా పార్టీ సీనియర్లు ఏ ఒక్కరు స్పందించలేదు. ఆ తర్వాత కరెంట్‌ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు రేవంత్‌రెడ్డి. విద్యుత్‌ కొనుగోళ్లపై చర్చకు రావాలంటూ అమరవీరుల స్థూపం నుంచి సవాల్‌ విసిరారు. బహిరంగ చర్చకు సిద్ధమంటూ రెండు పార్టీలు ప్రకటించాయ్. అయితే అంతలోనే టీఆర్ఎస్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ విషయంలోనూ కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డికి బాసటగా నిలవలేదు.

వరుస అస్త్రాలతో టీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతున్నా పార్టీ నుంచి మద్దతిచ్చే వారు లేకపోవడంతో రేవంత్‌రెడ్డి ఆలోచనలో పడినట్లు సమాచారం. అవినీతి అంశంలో అధికార పార్టీని టార్గెట్‌ చేసే విధంగా వ్యవహరించకపోవడం తన బాధనంతా సీనియర్‌ నేత వద్ద రేవంత్‌ వెల్లగక్కినట్లు తెలుస్తోంది. తాను తెరపైకి తెచ్చిన అంశాలపై పార్టీ పట్టించుకోకపోవడంతో వ్యక్తిగత కక్షతోనే ఇలాంటి అంశాలు తెస్తున్నట్లు టీఆర్ఎస్‌ ప్రచారం చేసే అవకాశముందని వాపోయినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరకముందు ప్రభుత్వంపై ఆధారాలతో విమర్శలు చేయని కాంగ్రెస్‌ నేతలు నాలుగు అంశాలు తెరపైకి తెచ్చినా పట్టనట్లు వ్యవహరించారు. నెతలెవరూ స్పందించిన రేవంత్‌కు ఇమేజ్‌ పెరుగుతుందన్న కారణంతోనే మిన్నకుండిపోయినట్లు పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories