logo
జాతీయం

రిజర్వేషన్లు అందరికీ కావాలా?

రిజర్వేషన్లు అందరికీ కావాలా?
X
Highlights

రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ క్రమంగా అన్ని వర్గాలకూ విస్తరిస్తోంది. అగ్రవర్ణాల్లోని పేదలు కూడా తమకు అన్యాయం...

రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ క్రమంగా అన్ని వర్గాలకూ విస్తరిస్తోంది. అగ్రవర్ణాల్లోని పేదలు కూడా తమకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. రిజర్వేషన్ల కోసం తాము అనుభవిస్తున్న పేదరికాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి అగ్రవర్ణాల్లోని పేదల డిమాండ్ సహేతుకమైందేనా? ఈ అంశాన్ని రాజకీయ పార్టీలు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటాయి? ఇవే ఇప్పుడు ప్రభుత్వాలను కూడా పునరాలోచనలో పడేస్తున్నాయి.

దేశ రాజకీయాల్లో రిజర్వేషన్ల అంశం కుంపట్లు రేపుతోంది. వివిధ సామాజిక వర్గాల మధ్య మనస్పర్థలకూ కారణమవుతోంది. అనేక అసమానతలతో కూడిన భారత్ లో రిజర్వేషన్లకు సుదీర్ఘమైన చరిత్రే ఉంది. భూస్వాములు, పెత్తందార్లు, గ్రామ ప్రధాన్ ల పెడ పోకడలతో అణచివేతను ఎదుర్కొని, అభివృద్ధికి దూరమైన ఎస్సీలు, ఎస్టీల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు. సంఘజీవి అయిన మనిషి తోటి మనుషుల మధ్య సమాన హోదాతో, సగౌరవంగా బతికే అవకాశం లేకపోవడం అనాగరికం అన్న భావనే రిజర్వేషన్లకు దారి తీసింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఎడతెగని పోరాటంతోనే దళితులకు, ఆదివాసులకు ముందుగా ఆ అవకాశం దక్కింది. ఆ తరువాత రిజర్వేషన్ కోటాలోకి వివిధ వెనుకబడ్డ సామాజిక వర్గాలను కూడా క్రమంగా తీసుకువచ్చారు.

తొలుత రిజర్వేషన్లు పరిమిత కాలానికే వర్తించాలని నిర్ణయించినా అనేక సామాజిక, రాజకీయ డిమాండ్ల చేత ఇప్పటికీ అమలవుతూనే ఉన్నాయి. ఇక రాజకీయ పార్టీల స్వీయ ప్రయోజనాలు, వివిధ సామాజిక వర్గాల ప్రాబల్యాలు, ప్రాంతీయ శక్తులు జాతీయ స్థాయిలో కీలకంగా మారడం వంటి అనేక కారణాలతో రిజర్వేషన్ల అంశం నానాటికీ సంక్లిష్టంగా మారుతోంది. రిజర్వేషన్లు సామాజిక అవసరం అనేకన్నా రాజకీయ డిమాండ్లుగా మారుతూండడంతో అటు అగ్రవర్ణాల్లో అసహనం పెల్లుబుకుతోంది. తాము మౌనంగా ఉంటే మరింత నష్టపోతామన్న ఫీలింగ్స్ వారిని ఉద్యమానికి పురికొల్పుతున్నాయి. తాజాగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి రిజర్వేషన్ల మీద మనోభావాలు ప్రకటించడం మేధావులను కూడా ఆలోచింపజేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి మాటల్లోని వాస్తవికతే అటు పాలక ప్రభుత్వాల్లోనూ వ్యక్తమవుతుండడం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అగ్రవర్ణాల్లోని పేదలకూ రిజర్వేషన్లు కల్పిస్తామన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. అందులో భాగంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ సైతం ఏర్పాటు చేశారు. దీంతో వైశ్య కార్పొరేషన్ డిమాండ్, రెడ్డి సమాజానికీ ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇదే బాటలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే హామీ ఇవ్వడం గమనించాల్సిన అంశం. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా సుముఖంగా ఉండడం విశేషం. అయితే కార్యాచరణ దిశగా ప్రభుత్వాల మీద మరింత ఒత్తిడి పెంచేందుకు ఆయా సామాజికవర్గాల ఆధ్వర్యంలో వివిధ సందర్భాల్లో ఆందోళనలు జరిగాయి.

ఈ క్రమంలో రిజర్వేషన్ల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. పేదలకు వర్తించాలనే పేరుతో అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించినట్టయితే అవి దుర్వినియోగం కాకుండా ఆపే సత్తా ఏ ప్రభుత్వాలకైనా ఉంటుందా? అలాగని అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం సరైందేనా? పెద్దకులం అన్న కారణంతో ఆ వర్గంలోని జ్ఞాన సంపదకూ అన్యాయం చేయాలా? దీనిపై బడుగు, బలహీన వర్గాలేమంటాయి? ప్రభుత్వాల ముందున్న పరిష్కారాలేంటి? ఈ అంశాలే మరోసారి చర్చనీయంగా మారుతున్నాయి.

Next Story